గ్రామీణ ప్రాంతాల్లో టాటా మోటార్స్ 'మొబైల్ షోరూమ్' కార్యక్రమం!

by Disha Desk |
గ్రామీణ ప్రాంతాల్లో టాటా మోటార్స్ మొబైల్ షోరూమ్ కార్యక్రమం!
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రామీణ ప్రాంత వినియోగదారులకు కార్లను చేరువ చేసేందుకు దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా మొబైల్ షోరూమ్‌లను తీసుకొస్తామని, మొదట 103 షోరూమ్‌లను ప్రారంభించనున్నట్టు గురువారం కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 'అనుభవ్' పేరుతో షోరూమ్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని కంపెనీ రూపొందించింది. జనాభాతో పాటు ఆర్థికంగా కూడా అధిక సామర్థ్యం ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ద్వారా కంపెనీ విస్తరించడానికి వీలవుతుందని కంపెనీ తెలిపింది. మొబైల్ షోరూమ్‌ల వద్ద వినియోగదారులు కొనాలనుకునే కారు మోడల్ వివరాలు, ఫైనాన్స్ సౌకర్యం, టెస్ట్ డ్రైవ్, ఎక్స్ఛేంజ్ సదుపాయం గురించిన అన్ని వివరాలు తెలుసుకోవచ్చని టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల విభాగం వైస్-ప్రెసిడెంట్ రాజన్ అంబా చెప్పారు. కొత్తగా ప్రారంభిస్తున్న మొబైల్ షోరూమ్ విధానం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల అవసరాలు, కోరికలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని, విస్తరణను మరింత వేగంగా చేపట్టేందుకు వీలవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో గ్రామీణ ప్రాంతం వాటా 40 శాతంగా ఉందని, రానున్న రోజుల్లో దీన్ని మరింత పెంచేందుకు కొత్త కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ఇప్పుడున్న డీలర్లే కొత్త మొబైల్ షోరూమ్‌లను నిర్వహించనున్నారు. దీన్ని కంపెనీ పర్యవేక్షిస్తుంది.

Advertisement

Next Story