హిందీ వ్యతిరేక ఆందోళనను తమిళులు మర్చిపోలేదు: డీఎంకే ఫైర్

by Manoj |
హిందీ వ్యతిరేక ఆందోళనను తమిళులు మర్చిపోలేదు: డీఎంకే ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: హిందీని బలవంతంగా రుద్దాలని ప్రయత్నించవద్దని తమిళనాడులో అధికార డీఎంకే పార్టీ, కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించింది. పార్టీ సంస్థాపకుల్లో ఒకరైన ఎమ్ కరుణానిధి దశాబ్దాల క్రితం ప్రారంభించిన హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని తమిళులు ఇంకా మర్చిపోలేదని, హిందీని బలవంతంగా రుద్దడాన్ని ఇప్పటికీ వారు అనుమతించబోరని డీఎంకే హెచ్చరించింది.

దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన వారు ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయంగా హిందీలో మాట్లాడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై డీఎంకే ధ్వజమెత్తింది. హిందీని తమిళ ప్రజలపై బలవంతంగా రుద్దడాన్ని నిరసిస్తూ 14 ఏళ్ల వయసులో తన స్వస్థలమైన తిరువారూర్‌లో 1938లో వీధుల్లో మార్చి చేస్తూ హిందీకి వ్యతిరేకంగా ఉద్యమించిన కరుణానిధి నినాదాన్ని డీఎంకే అధికార వాణి మురసోలి ఆదివారం ఎడిషన్‌లో ప్రచురించింది. ఆ నినాదం కింద 'కేంద్రానికి హెచ్చరిక' అనే ట్యాగ్‌లైన్‌ని కూడా తగిలించింది.

తమిళ ప్రజలు ఇప్పటికీ ఆనాటి కరుణానిధి హిందీ వ్యతిరేక ర్యాలీని మర్చిపోలేదని మురసోలి పత్రిక గుర్తు చేసింది. తమిళనాడులో హిందీని బలవంతంగా రుద్దడాన్ని ప్రజలు ఇప్పటికీ సహించరు అనే విషయాన్ని మర్చిపోవద్దని హెచ్చరించింది. ఇదే విషయమై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ అది జాతీయ సమగ్రతను విచ్ఛిన్నపరుస్తుందని వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story