వరుస ఐదు రోజుల లాభాలకు బ్రేక్!

by Harish |
వరుస ఐదు రోజుల లాభాలకు బ్రేక్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్ల ఐదు రోజుల లాభాలకు మంగళవారం బ్రేక్ పడింది. కరోనా మహమ్మారి తర్వాత అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపునకు సంబంధించిన ప్రకటనతో దేశీయంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యం కంటే ఎగువన నమోదవడం వంటి అంశాలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీనికి తోడు రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితులు కొనసాగుతుండటం, అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన ట్రేడింగ్ సంకేతాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. అంతేకాకుండా గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో మెరుగ్గా ర్యాలీ చేసిన తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ఆసక్తి చూపించడంతో సూచీలు నష్టాలను ఎదుర్కొన్నాయి.

దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 709.17 పాయింట్లు పతనమై 55,776 వద్ద, నిఫ్టీ 208.30 పాయింట్లు దిగజారి 16,663 వద్ద ముగిశాయి. ఉదయం ప్రారంభంలో లాభాల్లోకి మారుతున్నట్టు కనిపించినప్పటికీ నిఫ్టీలో మెటల్, ఐటీ రంగాలు అత్యధికంగా 3-4 శాతం మేర నీరసించడం సూచీలకు కలిసి రాలేదు. ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాలు స్వల్ప సానుకూలతతో పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, మారుతీ సుజుకి, నెస్లె ఇండియా, ఏషియన్ పెయింట్ షేర్లు లాభాలను దక్కించుకోగా, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, కొటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్, హెచ్‌సీఎల్ టెక్, పవర్‌గ్రిడ్ కంపెనీల షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 76.53 వద్ద ఉంది.

Advertisement

Next Story