తీవ్ర ఒడిదుడుకుల మధ్య లాభాల నుంచి నష్టాల్లోకి జారిన స్టాక్ మార్కెట్లు!

by GSrikanth |   ( Updated:2022-07-05 11:19:20.0  )
తీవ్ర ఒడిదుడుకుల మధ్య లాభాల నుంచి నష్టాల్లోకి జారిన స్టాక్ మార్కెట్లు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య అధిక లాభాల నుంచి నష్టాల్లోకి జారిపోయాయి. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో ఉదయం నుంచి సానుకూలంగా ర్యాలీ చేసిన సూచీలు మిడ్-సెషన్ తర్వాత అధిక అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లలో ద్రవ్యోల్బణ భయాలు కొనసాగుతుండటం, ఆర్థిక మాంద్యం ఆందోళనల కారణంగా గరిష్ఠాల వద్ద పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీనికితోడు భారత వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో ఉండటం, మన కరెన్సీ రూపాయి విలువ అంతకంతకు బలహీనపడుతుండటం వంటి పరిణామాలు ప్రతికూలంగా మారాయి.

దీనికితోడు ముడి చమురుకు సంబంధించి కేంద్రం అదనపు పన్నులు అమలు చేయడం, గ్లోబల్‌గా అమెరికా, యూరప్, ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉండటం వంటి అంశాలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ ఇండెక్స్ 100.42 పాయింట్లు క్షీణించి 53,134 వద్ద, నిఫ్టీ 24.50 పాయింట్లు తగ్గి 15,810 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, బ్యాంకింగ్, ఆటో, ఎఫ్ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు క్షీణించాయి. మెటల్, ఫార్మా రంగాలు మాత్రమే పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో పవర్‌గ్రిడ్, బజాజ్ ఫిన్‌సర్వ్, హిన్సూస్తాన్ యూనిలీవర్, సన్‌ఫార్మా, రిలయన్స్ కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ఐటీసీ, విప్రో, ఎంఅండ్ఎం, ఎల్అండ్‌టీ, మారుతీ సుజుకి, ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్స్ అధిక నష్టాలను నమోదు చేశాయి. మరోవైపు భారత కరెన్సీ విలువ రోజురోజుకు పతనమవుతోంది. ఇటీవలే ఆల్‌టైమ్ కనిష్టానికి దిగజారిన తర్వాత కోలుకుంటున్నట్టు కనిపించినప్పటికీ, మంగళవారం అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 79.29 వద్ద ఉంది.

Advertisement

Next Story