తెలంగాణ రాజకీయాల్లో రహస్య భేటీ దుమారం..?

by GSrikanth |   ( Updated:2022-07-14 09:30:46.0  )
తెలంగాణ రాజకీయాల్లో రహస్య భేటీ దుమారం..?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావుడి స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీలన్నీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ రాజకీయాన్ని మరింత రక్తి కట్టిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్‌ను గద్దె దింపేందుకు కాంగ్రెస్, బీజేపీ గట్టిపోటీ ఇస్తోన్న తరుణంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కేసీఆర్ గుట్టు అంతా తనకు తెలుసని, ఆయన బలమేంటో, బలహీనత ఏంటో దగ్గర ఉండి చూసిన వ్యక్తిని తాను అని ఈటల ఇటీవల చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఢీ కొట్టబోయేది తానేనని తన చేతిలో ముఖ్యమంత్రి ఓటమి పాలు కావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. అయితే, అపోజిషన్‌లోని బీజేపీకి చెందిన ఎమ్మెల్యేగా ఈటల వ్యాఖ్యలపై ఓ వైపు చర్చ జరుగుతుండగానే అదే సమయంలో మరో వైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా చర్చకు దారి తీశాయి.

గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్‌పై తాను పోటీ చేసి గెలవబోతున్నానని ఈటల రాజేందర్ కామెంట్స్ పై రేవంత్ రెడ్డి ఆసక్తికరంగా స్పందించారు. గజ్వేల్ నియోజకవర్గంలో గెలవబోయేది మాత్రం కాంగ్రెస్ అభ్యర్థియేనని అన్నారు. గజ్వేల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మాత్రమే కేసీఆర్‌ను ఓడిస్తారని రేవంత్ చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. ఓ వైపు ఈటలను చూస్తే తానే కేసీఆర్‌ను ఓడిస్తానని చెబుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి చేతిలోనే కేసీఆర్ ఓడిపోబోతున్నారని చెప్పడం పొలిటికల్ కారిడార్‌లో కొత్త చర్చకు తెరలేసినట్లైంది. రేవంత్ మాటలు చూస్తుంటే ఈటల రాజేందర్ మరోసారి పార్టీ మారబోతున్నారా? బీజేపీని కాదని కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారా అనే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈటల రాజేందర్ పార్టీయేతర కార్యకలాపాలకు పాల్పడుతున్నారనేది టీఆర్ఎస్ అతడిపై మోపిన ఆరోపణల్లో ఒకటి. కేసీఆర్ నిర్ణయాలకు వ్యతిరేకంగా రహస్యంగా ఇతర పార్టీ నేతలను కలుస్తున్నారని టీఆర్ఎస్ ఆరోపించింది. ఈటల రాజేందర్ ఎవరికి తెలియకుండా అత్యంత రహస్యంగా ఒక్కడే వేకువ జామున బయటకు వెళ్లి ఇతర పార్టీ నేతలతో మంతనాలు జరిపారని, ఈ విషయం కేసీఆర్ పసిగట్టి అతడికి చెక్ పెట్టారనే టాక్ అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. అయితే, అచ్చం ఇలాంటి సీన్ ఇప్పుడు కాంగ్రెస్‌లోనూ చోటు చేసుకోవడం సంచలనం అవుతోంది. గత ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఎవరికి తెలియకుండా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ తాను బస చేస్తున్న హైదరగూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బయటకు వెళ్లడం ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.

ఆయనతో పాటు పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఉన్నారని వీరని రేవంత్ రెడ్డి, జానారెడ్డి వంటి పెద్దలను కలిసి చర్చించుకున్నారని ఆ తర్వాత ఈ నలుగు కలిసి ఎక్కడి వెళ్లారు? ఎవరిని కలిశారనేదానిపై రాజకీయ చర్చ జరుగుతోంది. అయితే వీరంతా ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా సీక్రెట్ వ్యవహారం నడిపించారని తెలుస్తోంది. నిజంగా ఎక్కడిపోయారు ఎవరిని కలిశారనేది బయటకు తెలియనప్పటికీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, మంత్రులను కలిశారని, బీజేపీకి చెందిన ఈటలనూ కలిశారనే ప్రచారం జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed