కొండెక్కిన నిత్యావసర సరుకుల ధరలు.. యుద్ధ పరిణామాలా.. బ్లాక్ దందానా..?

by samatah |   ( Updated:2022-03-18 07:50:04.0  )
కొండెక్కిన నిత్యావసర సరుకుల ధరలు.. యుద్ధ పరిణామాలా.. బ్లాక్ దందానా..?
X

దిశ, బెజ్జంకి : ఎక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ సామాన్యుడు బతకలేని పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. రోజు కూలి నాలి చేసుకుని బతుకు వెళ్లదీస్తున్న సామాన్యుల కథ ఇంకా గందరగోళంగా మారింది. నిన్నమొన్నటి వరకు 140 నుండి 150 రూపాయలకి దొరికే వంటనూనె కాస్త 200 నుండి 217 రూపాయలకు చేరింది. దాంతో సామాన్యుడు కొనలేడు, తినలేని పరిస్థితి తయారయ్యింది. నిత్యావసర సరుకుల ధరలు నియంత్రణలో ఉంచడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, దీంతో కాస్త నిరు పేదల బతుకు దిన దిన గండంగా ఉంది. నిన్న మొన్నటి వరకు గోల్డ్ డ్రాప్ వంట నూనె ధర 140 రూపాయలగా ఉండేది. అది నేడు కాస్త రెండు వందల నుండి 217 రూపాయలకు చేరుకుంది. దీంతో కిరాణా షాపుల్లో రెండు వందల రూపాయలకు నూనె ప్యాకెట్ ను విక్రయిస్తున్నారు. డీలర్ల వద్ద పాత ఎమ్మార్పీ ధర వున్నా కానీ, నేడు పెరిగిన ధరలకు విక్రయిస్తూ వారు సొమ్ము చేసుకుంటున్నారు. కిరాణా వర్తకులు తక్కువ ధరలకు విక్రయించాలని ప్రజలు మొరపెట్టుకున్నా కిరాణం యజమానులు నీ ఇష్టం అంటూ ఎడాపెడా మాట్లాడుతున్నారని వాపోతున్నారు. మార్కెట్లో పప్పులు,ఉల్లిగడ్డ ఇతర నిత్యావసర సరుకులు సామాన్యుడికి అందనంత దూరంలో ఉన్నాయి. విజిలెన్స్ అధికారులు స్పందించి అధికరేట్లకు విక్రయించే డీలర్లపై, కిరాణా షాపుల యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed