ఈ ఏడాది చివర్లో ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచే అవకాశం: ఫిక్కీ!

by Vinod kumar |
ఈ ఏడాది చివర్లో ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచే అవకాశం: ఫిక్కీ!
X

న్యూఢిల్లీ: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఈ ఏడాది చివర్లో కీలక వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రేపో రేటు 50-70 బేసిస్ పాయింట్లు పెరగవచ్చని పరిశ్రమల సంఘం ఫిక్కీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ధరలు పెరగడంతో ఆర్థిక పునరుద్ధరణ అతిపెద్ద సవాలుగా పరిస్థితులు నెలకొన్నాయని ఫిక్కీ తన ఎకనమిక్ ఔట్‌లుక్ సర్వేలో పేర్కొంది.


ఈ నేపథ్యంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 7.4 శాతం నమోదవ్వొచ్చని ఫిక్కీ అంచనా వేసింది. అలాగే, ఈ వారంలో జరగబోయే ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశంలొ రెపో రేటును యథాతథంగా ఉంచడం ద్వారా దేశ ఆర్థిక పునరుద్ధరణకు మద్దతివ్వనుందని ఫిక్కీ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి మెరుగా ఉండొచ్చని, వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాల వృద్ధి 3.3 శాతం గా, పరిశ్రమల వృద్ధి 5.9 శాతం, సేవల రంగం 8.5 శాతం వృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయని ఫిక్కీ వెల్లడించింది.


రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కీలక విడిభాగాల వస్తువులకు సరఫరా అంతరాయం ఏర్పడి ధరలు భారీగా పెరిగాయి. పరిస్థితులు ఇలాగే ఎక్కువ కాలం కొనసాగితే ముడి చమురు, సహజవాయువు, ఆహారం, ఎరువులు, మెటల్ సహా ప్రధాన ముడి పదార్థాల సరఫరాకు మరింత ఆటంకం ఏర్పడవచ్చు. ఇంధన అవసరాలపై ఆధారపడిన భారత్ ముడి పదార్థాల పెరుగుదలతో గణనీయంగా ప్రభావితం అవనుంది. మరింత కాలం యుద్ధ పరిస్థితులు కొనసాగితే ఆర్థిక వ్యవస్థ మరింత తీవ్రంగా దెబ్బతింటుందని ఫిక్కీ అంచనా వేసింది.

Advertisement

Next Story

Most Viewed