EPFO: పీఎఫ్ ఆటో క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ పరిమితిని ఐదు రెట్లు పెంచిన ఈపీఎఫ్ఓ

by S Gopi |   ( Updated:2025-03-31 16:12:07.0  )
EPFO: పీఎఫ్ ఆటో క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ పరిమితిని ఐదు రెట్లు పెంచిన ఈపీఎఫ్ఓ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రావిడెంట్ ఫండ్‌కు సంబంధించి సెటిల్‌మెంట్‌ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఆటో క్లెయిమ్‌ పరిమితిని ఏకంగా ఐదు రెట్లు పెంచింది. దీనివల్ల 7.5 కోట్ల మంది ఈపీఎఫ్ చందాదారులు ప్రయోజనం పొందనున్నారు. కోట్లాది మంది పీఎఫ్ చందాదారులకు 'ఈజ్ ఆఫ్ లివింగ్' పెంచేందుకు ఆటో క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ రూపంలో తీసుకునే పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచుతూ నిర్ణయించారు. దీన్ని గతవారం జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల 113వ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుమితా దావ్రా ఆమోదించారని ఏఎన్ఐ తన కథనంలో పేర్కొంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ) ఆమోదం తర్వాత ఈపీఎఫ్ఓ సభ్యులు ఆటోమేటెడ్ సెటిల్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్ క్లెయిమ్స్(ఏఎస్ఏసీ) ద్వారా విద్య, వైద్యం, వివాహం, ఇంటి నిర్మాణం, వైద్య ఖర్చుల కోసం రూ. 5 లక్షల వరకు విత్‌డ్రా చేసుకునేందుకు వీలవుతుంది. మొదట ఈ సదుపాయాన్ని వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల కోసం 2020, ఏప్రిల్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత విద్య, వివాహం, గృహ అవసరాలకు కూడా విస్తరించారు. తిరిగి 2024, మేలో ఈపీఎఫ్ఓ ​​క్లెయిమ్ పరిమితిని రూ. 50,000 నుంచి రూ. లక్షకు పెంచారు. తాజా ప్రతిపాదనతో రూ. 5 లక్షల వరకు విత్‌డ్రాలు మూడు రోజుల్లోనే ప్రాసెస్ అవుతాయి. ఈ సదుపాయం ద్వారా 95 శాతం వరకు మానవ ప్రమేయం లేకుండానే, ఈపీఎఫ్ఓ ఏఐ-ఆధారిత ఆటో-క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ 2025, మార్చి 6 నాటికి రికార్డు స్థాయిలో 2.16 కోట్ల ఆటో-క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లను నమోదు చేసింది.

Next Story

Most Viewed