కరీంనగర్ కేబుల్ బ్రిడ్జికి అరుదైన అవార్డు

by Mahesh |
కరీంనగర్ కేబుల్ బ్రిడ్జికి అరుదైన అవార్డు
X

దిశ, తిమ్మాపూర్ : తెలంగాణ రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్నది. ఔట్ స్టాండింగ్ కాంక్రీట్ స్ట్రక్చర్-2021 విభాగంలో కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ ఈ అవార్డును సొంతం చేసుకున్నది. ఇండియన్ కాంక్రీట్ ఇనిస్టిట్యూట్ హైదరాబాద్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 23న ఈ అవార్డును నిర్వాహకులు ఆర్ అండ్ బి శాఖకు ప్రదానం చేశారు. ఈ మేరకు ఈ అవార్డును శనివారం ఆర్ అండ్ బి ఈఎన్సీ‌లు రవీందర్ రావు, గణపతి రెడ్డిలు కలిసి రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మినిస్టర్ క్వార్టర్స్‌లోని తన అధికారిక నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక నిర్మాణాలు శాశ్వత ప్రాతిపదికన, పూర్తి నాణ్యతతో జరుగుతున్నాయన్నారు. ఇలాంటి అవార్డులు వాటికి నిదర్శనమన్నారు.

ఆర్అండ్‌బి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నూతన సెక్రటేరియట్, అమరుల స్మారకచిహ్నం, అంబేద్కర్ విగ్రహం, మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, సమీకృత కలెక్టరేట్లు, కొత్త వంతెనలు లాంటి దీర్ఘకాలిక ప్రయోజనం పొందే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు నిర్మించడం గర్వంగా ఉన్నదని చెప్పారు. రోడ్లు-భవనాల శాఖకు వచ్చిన ఈ అవార్డు అధికారుల్లో, ఉద్యోగుల్లో నూతనోత్సాహాన్ని నింపుతుందన్నారు. అవార్డు ప్రదానం చేసిన ఇండియన్ కాంక్రీటు ఇనిస్టిట్యూట్‌కి మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అందుకు కష్టపడి పని చేసిన అధికారులకు, ఉద్యోగులకు అందులో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికీ మంత్రి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

Next Story