గేట్లను ఎత్తి నీటిని వదిలిన అధికారులు... మునిగిపోయిన గుండి గ్రామం

by S Gopi |
గేట్లను ఎత్తి నీటిని వదిలిన అధికారులు... మునిగిపోయిన గుండి గ్రామం
X

దిశ, తాండూర్: గత వారం రోజులుగా కుమురంభీం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు భయం గుప్పెట్లో కాలం వెళ్లదీస్తున్నారు. కుమురంభీం, వట్టి వాగు, చెలిమెల ప్రాజెక్టులోకి వరదనీరు భారీగా చేరుతుండడంతో అధికారులు గేట్లను ఎత్తారు. అధికారులు వరద నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు, నది పరివాహక ప్రాంతాల గ్రామాలు జల దిగ్భందంలో చిక్కుకుంటున్నాయి. కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని గుండి గ్రామంలోకి బుధవారం వరద నీరు చేరింది. గుండి వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఇండ్లలోకి వరదనీరు చేరడంతో గ్రామస్తులు భయం గుప్పెట్లో కాలం వెళ్లదీస్తున్నారు. గుండి గ్రామం నుంచి బయటకు వెళ్లేలేని పరిస్థితి ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసిఫాబాద్ పట్టణంలోని పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. కాగజ్ నగర్ పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వంకులం గ్రామ సమీపంలో వరద నీరు చేరింది. లోతట్టు, పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, సంబంధిత అధికారులు హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed