ఇసుక ర్యాంపుల్లో కాంట్రాక్టర్ల ప్రైవేటు సైన్యం.. ప‌రిశీల‌న‌కు వెళ్లే వారిపై దాడులు

by Disha News Desk |
ఇసుక ర్యాంపుల్లో కాంట్రాక్టర్ల ప్రైవేటు సైన్యం.. ప‌రిశీల‌న‌కు వెళ్లే వారిపై దాడులు
X

దిశ‌ ప్రతినిధి, వ‌రంగ‌ల్: ములుగు, భూపాల‌ప‌ల్లి జిల్లాలోని ఇసుక ర్యాంపుల వ‌ద్ద మాఫియాసామ్రాజ్యం న‌డుస్తోంది. ప‌రిశీల‌న‌కు వెళ్లిన ప‌త్రిక, టీవీ చానెళ్ల రిపోర్టర్లతో పాటు ప్రజాసంఘాలు, ఆదివాసీ సంఘాల నేత‌ల‌పై కాంట్రాక్టర్లు ప్రైవేటు సైన్యంతో దాడుల‌కు తెగ‌బ‌డుతున్నారు. ఇసుక ర్యాంపుల్లో జ‌రుగుతున్న అక్రమాల‌ను బ‌య‌ట‌పెట్టేందుకు వెళ్తున్నవారిని గిరిజ‌న‌, ఆదివాసీ మ‌హిళ‌ల చేత అడ్డుకుంటున్నారు. అవ‌స‌ర‌మైతే దాడులు చేసిన‌ట్లుగా పోలీస్ స్టేష‌న్లలో కూడా ఫిర్యాదులు ఇప్పిస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఇలాంటి సంఘ‌ట‌న‌లు గ‌డిచిన కొద్దిరోజుల కాలంలో పెరుగుతుండ‌టం గ‌మనార్హం. ర్యాంపుల్లోని అక్రమాలు బ‌య‌ట‌కు రాకుండా ఉండేందుకు ఈ దురాగ‌తాల‌కు పాల్పడుతున్నారు. అక్రమాలన్నీ కూడా అధికారుల క‌నుస‌న్నల్లోనే జ‌రుగుతున్నా.. నోరు మెద‌ప‌డం లేదు.

మ‌చ్చుకు కొన్ని..

నేష‌న‌ల్ మీడియాకు చెందిన ఓ ప‌త్రిక విలేఖ‌రి ఇటీవ‌ల వెంక‌టాపురం మండ‌లం యాక‌న్నగూడెం స‌మ్మక్క సార‌ల‌మ్మ ర్యాంపు ప‌రిశీల‌న‌కు వెళ్లిన విలేఖ‌రిని కొంత‌మంది కొట్టినంత ప‌నిచేశారు. అలాగే రామానుజ‌పురంలోని ర్యాంపు వ‌ద్ద ఉన్న కొంత‌మంది మ‌హిళ‌లు ఓ ఎలాక్ట్రానిక్ మీడియాకు చెందిన జ‌ర్నలిస్ట్ సెల్‌ఫోన్ లాక్కోవ‌డంతో పాటు ఇక్కడికి ఎందుకు వ‌చ్చావ్‌.. ఏంటీ ప‌నంటూ బెదిరింపుల‌కు పాల్పడిన‌ట్లు స‌మాచారం. ఈ విష‌యం పోలీస్ స్టేష‌న్ దాకా వెళ్లినా.. చిన్న సారీ వ్యవ‌హారంతో పోలీసులు కేసు న‌మోదు చేయ‌కుండా రాజీ చేసినట్లు స‌మాచారం. క్వారీల్లో జ‌రుగుతున్న అక్రమ ఇసుక రవాణాపై అధికారుల‌కు ఫిర్యాదు చేసినా పోలీసులు పెద్దగా ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న విమ‌ర్శలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి ప్రైవేటు సైన్యంతో ప్రశ్నించే వారిని భ‌యాబ్రాంతుల‌కు గురి చేసే ప్రయ‌త్నం దాదాపు ప్రతీ క్వారీ వ‌ద్ద జ‌రుగుతోంది. కొంత‌మంది గిరిజ‌నుల‌తో ఒప్పందం కుదుర్చుకుని మరీ కేసులు పెట్టేందుకు అంగీకరించిన మీద‌టే ప‌నిలోకి తీసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా క్వారీ ప్రదేశాలేమైనా నిషిద్ధ ప్రదేశాలా..? ప్రజా సంఘాలు, విలేఖ‌రులు సంద‌ర్శించ‌కూడ‌ద‌ని నిబంధ‌న‌ల్లో ఏమైనా ఉందా..? అంటూ ప్రజ‌లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed