Minister Ajay Kumar: పోలవరంపై తిరిగి సమీక్షించాలి: మంత్రి పువ్వాడ

by S Gopi |   ( Updated:2022-07-21 13:02:53.0  )
Polavaram Should be Reviewed, says Minister Ajay Kumar
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: Polavaram Should be Reviewed, says Minister Ajay Kumar| కేంద్ర ప్రభుత్వం పోలవరంపై మరోసారి సమీక్షించాలని, ముంపుపై సరైన అధ్యయనం అవసరమని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఈసారి గోదావరి వరదల కారణంగా ముంపు అధికంగా ఉందని, దీనికి పోలవరం బ్యాక్ వాటర్ కారణమని అన్నారు. ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు తాత మధు అధ్యక్షతన జిల్లా నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. 1986లో వచ్చిన వరదలనే అధిక వరదలుగా భావించామని.. కానీ ఈసారి అంతకంటే ఎక్కువ వరదలు వచ్చాయని తెలిపారు. ముంపు కూడా ఎక్కువగా ఉందని చెప్పారు. భవిష్యత్తులో అంచనాకు మించి ముంపు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలవరంపై మరోసారి చర్చ అవసరమని స్పష్టం చేశారు. ముంపునకు సంబంధించి కేంద్రప్రభుత్వం సరిగ్గా అంచనా వేయలేదన్నదే తమ వాదన అని అభిప్రాయపడ్డారు.

గత ఐదారు సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం ఈ విషయమై అనేకసార్లు లేఖలు రాసినట్లు తెలిపారు. పోలవరం ఎత్తు, నిర్మాణం గురించి తాము మాట్లాడటం లేదని బ్యాక్ వాటర్ ద్వారా తమకు కలుగుతున్న ముంపు గురించే మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు. డ్యాం ఒరిజనల్ కెపాసిటీ 36 లక్షల క్యూసెక్కులైతే.. దాని సామర్థ్యాన్ని 50 లక్షల క్యూసెక్కులకు పెంచారని.. కాపర్ డ్యాం నిర్మాణంపై కూడా స్పష్టత లేదన్నారు. మొత్తం 50 లక్షల క్యూసెక్కుల కోసం నిర్మాణం కనుక చేపడితే ముంపు తీవ్రత అంచనాలకు మించి ఉండే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. భద్రాచలం పరిసర గ్రామాలతో పాటు పర్ణశాల సహా వందలాది గ్రామాలు నీట మునగడం ఖాయమన్నారు. 36 లక్షల క్యూసెక్కుల నిర్మాణానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ విషయమై కేంద్రానికి ఐదుసార్లు లేఖలు రాశామని, ఎలాంటి స్పందనలేదన్నారు. రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలే ఉన్నందున సామరస్యంగా సమస్య పరిష్కారానికి కేంద్రం, ఆంధ్ర నాయకులు చొరవ చూపాలని, కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

సహాయ కార్యక్రమాల కొనసాగింపు..

గోదవరి వరదల కారణంగా నిరాశ్రయులైనవారికి సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఉన్నతాధికారులతోపాటు.. జిల్లా అధికారులు కూడా అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ ఏడు గోదావరికి విపరీత వరదలు వచ్చాయని అధికారులు, మీడియా మిత్రుల సహకారంతో సమిష్టి గండం నుంచి బయటపడ్డామని తెలిపారు. చాలామంది ఇప్పటికే పునరావాస కేంద్రాలనుంచి వెళ్లిపోయారని, ఉన్న కొందరి కోసం వాటిని కంటిన్యూ చేస్తామని చెప్పారు. 200 గ్రామాల్లో శానిటైజేషన్ పూర్తయిందని, 240 గ్రామాలకు విద్యుత్ పునరుద్ధరణ జరిగిందని వెల్లడించారు. బాధితులకు 25 కేజీలు బియ్యం, 5 కేజీల పప్పు అందజేస్తున్నామని, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు సేకరిస్తున్నామని అందరి అకౌంట్లు తీసుకున్నాక రూ. 10 వేల జమ చేస్తామని చెప్పారు. రేపు భద్రాచలం వెళ్లి అన్ని ప్రాంతాలు కలియతిరిగి సమీక్ష చేస్తానని వెల్లడించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో యూట్యూబర్ ఆత్మహత్య.. వ్యూసే కారణమా..?

Advertisement

Next Story

Most Viewed