20 ఏళ్ల త‌ర్వాత పింక్ ఫ్లాయిడ్ కొత్త పాట‌.. పాడిందెవ‌రో తెలుసా..?!

by Sumithra |   ( Updated:2022-04-09 11:10:01.0  )
20 ఏళ్ల త‌ర్వాత పింక్ ఫ్లాయిడ్ కొత్త పాట‌.. పాడిందెవ‌రో తెలుసా..?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః పింక్ ఫ్లాయిడ్‌.. పేరు వింటేనే ప్ర‌పంచంలో కోట్ల‌ మందికి ఒళ్లు పుల‌క‌రిస్తుంది. అలాంటి ఓ ప్ర‌ఖ్యాత బ్రిటీష్ రాక్ మ్యూజిక్ బ్యాండ్ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఓ కార‌ణం కోసం మరోసారి కలిసింది. ర‌ష్యా దాడికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న‌ ఉక్రెయిన్ దేశానికి మద్దతుగా శుక్రవారం ఓ కొత్త పాటను ప్ర‌జ‌లకు అందించింది. తాజాగా విడుదలైన ఈ 'హే హే రైజ్ అప్' వసూలు చేసే మొత్తం డ‌బ్బులు ఉక్రెయిన్‌లో బాధితుల‌కు మానవతా సహాయం కోసం వెచ్చించ‌నున్నారు. అయితే, పింక్ ఫ్లాయిడ్ చేసిన ఈ పాట‌ను పాడింది బూమ్‌బాక్స్ బ్యాండ్‌కు చెందిన‌ ఉక్రేనియన్ గాయకుడు ఆండ్రీ ఖ్లివ్‌నియుక్ కావ‌డం విశేషం. ఉక్రెయిన్‌పైన ర‌ష్యా దాడి మొద‌లుపెట్టిన‌ త‌ర్వాత ఆండ్రీ త‌న దేశం కోసం బూమ్‌బాక్స్ అమెరికా పర్యటన నుండి ఉక్రెయిన్‌కు తిరిగి వచ్చేశాడు. టెరిటోరియల్ డిఫెన్స్ ఫోర్స్‌లో చేరి, త‌న దేశం కోసం నిల‌బ‌డ్డాడు. కీవ్‌ రాజధాని నగరంలో సోఫీస్‌కాయ స్క్వేర్‌లో సైనిక దుస్తుల్లో తాను పాడిన‌ జానపద పాటను ఇన్‌స్టాగ్రామ్ నుండి తీసుకొని పింక్ ఫ్లాయిడ్ త‌మ పాట‌ను రూపొందించింది. అప్ప‌టికే ఇది ఉక్రెయిన్-రష్యా యుద్ధం మధ్య అనధికారిక గీతంగా పాపుల‌ర్ అయ్యింది.

ఇక‌, ఆండ్రీ పాడిన ఈ వైరల్ గీతం, మొదటి ప్రపంచ యుద్ధం నాటిది. ఉక్రేనియన్ నిరసన పాట, 'ది రెడ్ వైబర్నమ్ ఇన్ ది మేడో'. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి వ్యతిరేకంగా మ‌రోసారి పునరుజ్జీవనం పొందింది. పాట చివరి పంక్తి "హే హే, లేచి సంతోషించు" అని వ‌స్తుంది. ఇక పింక్ ఫ్లాయిడ్ ఈ కొత్త పాట కోసం సంగీతాన్ని ఈ బృంద చిరకాల సభ్యులైన గిల్మర్, నిక్ మాసన్, బాస్ ప్లేయర్ గై ప్రాట్, కీబోర్డు ప్లేయ‌ర్‌ నితిన్ సాహ్నీతో కలిసి మార్చి 30న రికార్డ్ చేశారు. "స్వతంత్ర, శాంతియుత ప్రజాస్వామ్య దేశమైన ఉక్రెయిన్‌పై ఈ నీచమైన చర్య కోపం, నిరాశను తెప్పిస్తుంది. చాలా మందిలా మేమూ ఆ బాధ‌ను అనుభవిస్తున్నాము. ప్రపంచంలో బ‌ల‌మైన శ‌క్తిగా ఉన్న‌అగ్ర‌రాజ్యం ఇలా ప్రజలను ఆక్రమించం దారుణం" అని పింక్ ఫ్లాయిడ్ స‌భ్యుడు డేవిడ్ గిల్మర్ ఈ సంద‌ర్భంగా ట్వీట్ చేశారు. ఇక‌, ఈ కొత్త పాట‌కు మ్యాట్ వైట్‌క్రాస్ దర్శకత్వం వహించారు.


Advertisement

Next Story

Most Viewed