చివరి వరకు పోరాడుతా: రాజీనామా చేసే ప్రసక్తే లేదంటున్న ప్రధాని

by Harish |
చివరి వరకు పోరాడుతా: రాజీనామా చేసే ప్రసక్తే లేదంటున్న ప్రధాని
X

ఇస్లామాబాద్: తాను ఎవ్వరికీ తలవంచనని, చివరికి వరకు పోరాడుతానని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఉద్ఘాటించారు. రాజీనామా చేసే ఉద్దేశం లేదని పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నుంచి తప్పుకుంటారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో గురువారం దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తాను దేశ భవిష్యతుకు అవసరమైన ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడనున్నట్లు తెలిపారు. దేశం విపత్కర పరిస్థితుల్లో ఉందని అన్నారు. తన ముందు రెండు మార్గాలున్నాయని, రాజీనామా మాత్రం చేయబోనని చెప్పారు. ముందుగా తాను రాజకీయాల్లోకి రావడానికి గల కారణాన్ని వివరించారు. స్వేఛ్చా పాకిస్తాన్‌లో జన్మించిన మొదటి తరానికి చెందిన వ్యక్తినని అన్నారు. 'నేను రాజకీయాలు ప్రారంభించినప్పుడు మ్యానిఫెస్టోలో మూడు విషయాలు చేర్చాను. ప్రతి ఒక్కరికీ సమ న్యాయం అందించడం. ముస్లిం దేశానికి భద్రత. మూడోది ముస్లిం దేశం ఏ ఒక్కరికీ బానిసగా ఉండకుడదనే గర్వం. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఎవ్వరి ముందు తలవంచలేదు. దేశ ప్రధానిగా అదే కొనసాగిస్తున్నాను. ప్రధాని అయ్యాక దేశ విదేశాంగ పాలసీ స్వాతంత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. దానర్థం వేరేవరిని శత్రువులుగా మార్చుకోవాలని అనుకోలేదు' అని అన్నారు. తనకు భారత్, అమెరికాలో మంచి మిత్రులు ఉన్నారని చెప్పారు. దక్షిణ కొరియా పాక్ పురోగతిని నేర్చుకునేందుకు వచ్చిందని తెలిపారు. మలేషియా యువరాణి తనతో చదువుకున్నట్లు తెలిపారు. మాకు విదేశాల నుంచి సందేశాలు వచ్చాయి. ఇమ్రాన్ ఖాన్ గద్దె దిగితే వారు పాకిస్తాన్‌ను మరిచిపోతారు అని అన్నారు. విదేశీయులతో పనిచేస్తున్న ముగ్గురు తొత్తులు ఇక్కడ ఉన్నారని తెలిపారు. వారు ఇమ్రాన్ ఖాన్‌ను గద్దె దింపాలని చూస్తున్నారని, ఓ వ్యక్తి ఆ స్థానంలో ఉండాలని అనుకుంటున్నట్లు చెప్పారు. కాగా, అంతకుముందు జాతీయ భద్రత కమిటీ ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన సమావేశమైనట్లు జాతీయ భద్రత సలహాదారులు తెలిపారు.

ఈ నెల 3న అసెంబ్లీ సమావేశం

పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ ఏప్రిల్ 3కు వాయిదా పడింది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను గద్దె దింపేందుకు విపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానంపై గురువారం చర్చ ప్రారంభించారు. అయితే ఇది కాస్త గందరగోళంగా మారడంతో సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో ఆయన సమావేశాన్ని ఆదివారానికి వాయిదా వేశారు. కాగా గురువారం సెషన్ కు విపక్షాల నుంచి 172 మంది సభ్యులు హాజరైనట్లు రిపోర్ట్ తెలిపింది. మొత్తం 342 మంది సభ్యులున్న నేషనల్ అసెంబ్లీ ఇమ్రాన్ ఖాన్ మద్దతుగా 165 మంది ఉన్నారు. అయితే ఈ మధ్య మిత్రపక్షాలు మద్దతు విరమించుకోవడంతో విపక్షాల బలం 177 గా ఉంది. దీంతో మ్యాజిక్ నెంబర్ కు ఇమ్రాన్ ప్రభుత్వం కొద్ది దూరంలో ఉంది. మరోవైపు ఇప్పటికే ఇమ్రాన్ చివరి బంతి వరకు పోరాడుతారని ఆయన పార్టీ సభ్యుడు ఫవాద్ చౌదరీ అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్ష నేతలు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ మెజారిటీ కోల్పోయారని విపక్షాలు ఆరోపించాయి. ముందుగానే హుందాగా గద్దె దిగాలని డిమాండ్ చేశాయి.

సుప్రీంకోర్టుకు అవిశ్వాసం

పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై విశ్వాస పరీక్షను నిలిపివేయాలని కోరుతూ పాకిస్తాన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి విదేశీ కుట్ర వివాదాన్ని వాడుకుంటున్నారని పిటిషనర్ తెలిపారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించకుండా స్పీకర్‌ను నిరోధించాలని కోరుతూ లేఖపై విచారణకు ఆదేశించాలని సుప్రీం కోర్టును పిటిషనర్ కొరారు.

Advertisement

Next Story

Most Viewed