అతినిద్ర కలిగించే అనర్థాలు..

by Mahesh |   ( Updated:2022-07-19 11:50:08.0  )
అతినిద్ర కలిగించే అనర్థాలు..
X

దిశ, ఫీచర్స్: మంచి ఆరోగ్యానికి తగినంత నిద్ర అవసరం. కానీ అతి నిద్ర కూడా నష్టాన్ని కలిగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోయే అలవాటును తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతంగా సూచిస్తున్నారు. ఇంకా అతిగా నిద్రపోవాలనే కోరిక.. ఆందోళన, డిప్రెషన్ వంటి మెంటల్ హెల్త్ సమస్యలతో ముడిపడి ఉంటుంది. అయితే ఒక వ్యక్తికి సరిపడా నిద్ర అనేది వయసు, కార్యాచరణ స్థాయి, శారీరక ఆరోగ్యం, జీవనశైలి అలవాట్లను బట్టి నిర్ణయించబడుతుంది. కాగా అతి నిద్ర వల్ల కలిగే ప్రతికూల పరిణామాలతో పాటు అది మానసికంగా, శారీరకంగా ఎలా డిస్టర్బ్ చేస్తుందో చూద్దాం.

ఎక్కువగా నిద్రపోతే ఏమవుతుంది?

వెన్నునొప్పి: దీర్ఘకాలికంగా నిద్రిస్తున్నట్లయితే.. ఎంత సుఖంగా ఉన్నప్పటికీ చివరకు వెన్నునొప్పి సమస్యలకు దారితీస్తుంది. నాణ్యమైన పరుపుపై ​ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకోవడం వల్ల కండరాలు అలసటకు గురి కావచ్చు. దీనికి పేలవమైన స్లీపింగ్ పొజిషన్‌ తోడైతే పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారుతుంది.

డిప్రెషన్ : నిద్రలేమి అనేది అతినిద్ర కంటే డిప్రెషన్‌తో ఎక్కువ సంబంధం కలిగి ఉంటుంది. అయినప్పటికీ డిప్రెషన్ అనుభవిస్తున్న వారిలో దాదాపు 15% మంది ఎక్కువగా నిద్రపోతారు. ఇది వారిలో నిరాశను మరింత తీవ్రతరం చేస్తుంది.

మధుమేహం: అతినిద్ర వల్ల అలసిపోయినట్లుగా ఉండటంతో డే టైమ్‌లో ఎనర్జీ కోసం జంక్ ఫుడ్‌ ప్రిఫర్ చేస్తాం. ఇందులోని అనవసరమైన క్యాలరీలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అందుకే వీలైనంత వరకు ఆరోగ్యకరమైన స్లీప్ సైకిల్ మెయింటైన్ చేయడం అత్యవసరం.

తలనొప్పి: ఎక్కువ నిద్రపోయినప్పుడు తలనొప్పి వస్తుంది. ఎందుకంటే అధిక నిద్ర సెరోటోనిన్ స్థాయిలను తగ్గిస్తుంది. సెరోటోనిన్ మానసిక స్థితి, నిద్ర నియంత్రణకు బాధ్యత వహిస్తుంది. సెరోటోనిన్ స్థాయిలు బ్యాలెన్స్‌గా లేనప్పుడు మైగ్రేన్స్ లేదా తలనొప్పి సంభవించవచ్చు.

అలసట: అధిక సమయం నిద్రపోవడం వల్ల అలసట కలుగుతుందని అధ్యయనాల్లో తేలింది. ఒక అధ్యయనం ప్రకారం రాత్రికి తొమ్మిది గంటలకు పైగా నిద్రపోయే వ్యక్తులు మేల్కొనేందుకు ఇబ్బంది పడతారు. వారు పగటిపూట కూడా అలసటను ఫీల్ అవుతూ నీరసంగా ఉంటారు. ఇది నిద్ర లేమిని సూచిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed