ఢిల్లీకి చేరిన లొల్లి.. ఇక వారితో యుద్ధమే అంటున్న అద్దంకి

by Javid Pasha |   ( Updated:2022-04-09 14:11:07.0  )
ఢిల్లీకి చేరిన లొల్లి.. ఇక వారితో యుద్ధమే అంటున్న అద్దంకి
X

దిశ, తుంగతుర్తి : గత కొంత కాలంగా నిప్పు, ఉప్పులా ఉండే తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలు మరోసారి బజారుకెక్కారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఈ తతంగం ఢిల్లీ పెద్దల వరకు చేరింది. తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గత రెండు పర్యాయాలుగా పోటీ చేసి ఓటమిపాలైన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్.. ఏకంగా జిల్లాలోని సీనియర్ నేతలు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలపై విమర్శలు గుప్పించారు. ఈమేరకు శనివారం స్వయంగా ఢిల్లీ పెద్దలను కలిసి వినతి పత్రాలు అందజేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నాయకులు వడ్డేపల్లి రవిని 2018లో నిలబెట్టి తన ఓటమికి కారకులయ్యారని పేర్కొన్నారు.

ముఖ్యంగా రవిని ఆరేళ్లపాటు బహిష్కరించినప్పటికీ మళ్లీ పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారని తన ఫిర్యాదులో అద్దంకి వివరించారు. 2018లో రవిని పోటీ చేయ వద్దని అధిష్టానం ఆదేశించినప్పటికీ వినకుండా కేవలం తన ఓటమి కోసమే స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టారని అద్దంకి దామోదర్ రెడ్డిపై విమర్శలు చేస్తూ ఫిర్యాదు చేశారు. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా మారిన తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం 1985 తర్వాత రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ వశమైంది. అనంతరం తుంగతుర్తి జనరల్ నుండి ఎస్సీ రిజర్వుడ్‌గా మారడంతో ఇక్కడి నేతలు తమ అడ్డాని సూర్యాపేటకు మార్చారు. అయినా వీరి ఆధ్వర్యంలోనే తుంగతుర్తి రాజకీయాలు నడుస్తున్నాయి.

2014లో తుంగతుర్తి నుండి తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అద్దంకి దయాకర్.. టీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆనాడు కిషోర్ కు 64 వేల 382 ఓట్లు వస్తే, అద్దంకికి 62 వేల 003 ఓట్లు వచ్చాయి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ తదనంతరం ఓటమి తర్వాత అద్దంకి దయాకర్.. ఏనాడు కూడా పార్టీ సమావేశాలకు హాజరుకాకపోవడమే కాకుండా తమను పూర్తిస్థాయిలో విస్మరించి, నియోజకవర్గానికి దూరంగా ఉన్నారనే ప్రధాన అంశం క్యాడర్‌లో బలంగా ఉంది. ముఖ్యంగా ఓటమికి ఏర్పడిన కారణాలను విశ్లేషించే నిమిత్తం జరిగిన సమావేశాలకు కూడా అద్దంకి రాలేదనే అంశాన్ని ప్రధానంగా చూపెడుతూ క్యాడర్ ఘాటుగా మండిపడుతోంది. దీంతో నాటినుండి పార్టీ రెండు వర్గాలుగా చీలినట్లుగా మారింది.


అద్దంకి తుంగతుర్తి ప్రాంతానికి అడపాదడపాగా వచ్చినప్పుడు కూడా తనకు చెందిన వర్గీయులతోనే మాట్లాడి వెళ్లేవారని అంటున్నారు. అనంతరం 2018లో అద్దంకి ఢిల్లీ స్థాయిలో ఉన్న తన పలుకుబడితో తుంగతుర్తి అసెంబ్లీ నుండి రెండో మారు పోటీ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. దీనికి ముందు సూర్యాపేటకు చెందిన ప్రముఖ కంటి వైద్యులు డాక్టర్ రవి తుంగతుర్తి రాజకీయాల్లో దామోదర్ రెడ్డి ఆశీస్సులతో అడుగు పెట్టారు. ఈ మేరకు డాక్టర్ రవి నియోజకవర్గ స్థాయిలో గుర్తింపు పొంది, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీ చేస్తున్నట్లుగా ప్రజానీకానికి పరోక్షంగా సంకేతాలు పంపారు. ఈ మేరకు దామోదర్ రెడ్డి కూడా డాక్టర్ రవికి టికెట్ ఇప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేసి చివరి అంకంలో విఫలమయ్యారు.

దీంతో తనకు టికెట్ రాలేదనే ఆగ్రహంతో డాక్టర్ రవి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి పార్టీ అధిష్టానం ఆగ్రహానికి గురై ఆరేళ్లపాటు సస్పెన్షన్‌ని మూటకట్టుకున్నారు. టికెట్ పొందిన అద్దంకి దయాకర్ నియోజకవర్గంలో పర్యటించలేని పరిస్థితి నెలకొంది. చివరికి దామోదర్ రెడ్డి సహాయంతో ప్రచారాన్ని సాగించారు. చివరికి అద్దంకి రెండో సారి కిషోర్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో కిషోర్ కు 90 వేల 857 ఓట్లు వస్తే.. అద్దంకి మాత్రం 89 వేల 10 ఓట్లు వచ్చాయి. స్వతంత్రంగా పోటీ చేసిన వడ్డేపల్లి రవికి 2 వేల 806 ఓట్లు పోలయ్యాయి. ఈ పరిణామాలన్నీ లెక్కలోకి తీసుకున్న అద్దంకి తన ఓటమికి దామోదర్ రెడ్డితో పాటు ఆయన వర్గీయులను కారణంగా చూపెడుతూ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారు.

కాగా రెండోసారి జరిగిన ఓటమిపై సమీక్ష చేసే నిమిత్తం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన సమావేశానికి పిలిచినప్పటికీ రాలేదు సరి కదా నియోజకవర్గానికి, తమకు దూరంగా ఉంటూ పట్టించుకోలేదని క్యాడర్ బహిరంగంగా అద్దంకిపై నిరసనలు వ్యక్తం చేసింది. అంతేకాదు జిల్లాలో పలు సందర్భాల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో కూడా తుంగతుర్తి అసెంబ్లీ విషయం చర్చకు వచ్చినప్పుడు అద్దంకిపై దుమారాలు లేచాయి. రెండు సార్లు పోటీ చేసి ఓటమి పాలై ముఖం చాటేసిన అద్దంకి అభ్యర్థిత్వానికి మమ్మల్ని ఎందుకు సహకరించాలన్నారు? అంటూ దామోదర్ రెడ్డిపై పలు సమావేశాల్లో క్యాడర్ విరుచుకుపడింది. ఇదిలా ఉంటే మూడు మాసాల క్రితం హైదరాబాదులో రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అద్దంకి వ్యవహారాన్ని పూసగుచ్చినట్లు వివరించారు. దీనికి రేవంత్ కూడా తుంగతుర్తిపై సర్వాధికారాలు దామోదర్ రెడ్డి, చెవిటి వెంకన్నలకే అప్పజెప్పినట్లు అప్పట్లో పార్టీ సమావేశాల్లో చర్చ జరిగింది.

నా ప్రచారానికి వారు ఎన్నడూ రాలేదు..! ఇక వారితో యుద్ధమే..!!

తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉంటే.. దామోదర్ రెడ్డితో పాటు పలువురు నా తరఫున ప్రచారానికి రాలేదని అద్దంకి దయాకర్ ఘాటుగా విమర్శించారు. శనివారం ఆయన ఢిల్లీ నుండి 'దిశ' తో ఫోన్ ద్వారా మాట్లాడారు. 2018 ఎన్నికల్లో తన ఓటమికి పరోక్షంగా కారకులయ్యారని దుయ్యబట్టారు. వడ్డేపల్లి రవి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడటంలో వారి పాత్ర ఉందన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం కొమ్మాల గ్రామం తన తాతముత్తాతలదని, అలాంటప్పుడు నేను నాన్ లోకల్ ఎలా అవుతానని ప్రశ్నించారు. తాను ముమ్మాటికీ లోకల్ అభ్యర్థి నేనని స్పష్టం చేశారు.

దామోదర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ప్రస్తుతం లోకలా..? నాన్ లోకలా ? అనేది వారే చెప్పాలని పేర్కొన్నారు. రాజకీయాలు వారికే కాదు నాకు కూడా తెలుసునని అన్నారు. తాను వివిధ దేశాలు, రాష్ట్రాలు తిరిగినప్పుడు తుంగతుర్తికి మాత్రం ఎందుకు రానని ప్రశ్నించారు. తుంగతుర్తి కొస్తే ఎవరూ రారు..వచ్చేవారిని రానివ్వరు..! పార్టీ సభ్యత్వాలను చేయనివ్వరు..ఇలాంటి పరిస్థితుల మధ్య నేను రాకపోతే రాలేదంటారు..! ఇదెక్కడి న్యాయం అంటూ తెగేసి చెప్పుకొచ్చారు. ఇంతకాలం భరించిన వీరి ఆగడాలను ఇక నేను తట్టుకోలేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, తదితరులను కలిసి పరిస్థితులను వివరిస్తానన్నారు.

Advertisement

Next Story

Most Viewed