విదేశాలకు రవాణా చేస్తున్న వాటితోనే అధిక ప్రమాదాలు

by Mahesh |
విదేశాలకు రవాణా చేస్తున్న వాటితోనే అధిక ప్రమాదాలు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : విదేశాలకు ఎగుమతి అవుతున్న గ్రానైట్ రవాణాలో లీజ్ దారులు జాగ్రత్తలు పాటించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. భారీ సైజులో ఉండే రా మెటీరియల్ లారీల్లో తరలించేప్పుడు తీసుకుంటున్న చర్యలు అసలే ఉండటం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పలు గ్రానైట్ క్వారీల నుండి నిత్యం వందల లారీల్లో రైల్వే స్టేషన్లు, పోర్టుల వరకు నెలకు 2 లక్షల టన్నుల మేర గ్రానైట్ రా మెటీరియల్ తరలిపోతోంది. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలోని సుమారు 300 గ్రానైట్ క్వారీల నుండి రా మెటీరియల్ లారీల్లో తరలిపోతుంటుంది. భారీ సైజులో ఉండే ఈ మెటీరియల్ సైడ్ వాల్స్ లేని లారీల్లోనే తరలిస్తుంటారు.

అయితే వీటిని తరలిస్తున్న క్రమంలో ఒక్కోసారి లారీలపై నుండి జారి పడిపోతుంటాయి. బండలు జారి పోకుండా ఉండేందుకు ఐరన్ చైన్ లతో కట్టినట్లయితే లారీ కూడా బోల్తా పడే ప్రమాదం ఉంటుందని భావించి క్వారీల నిర్వహకులు, ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు రాళ్లు తొణకకుండా సెట్ చేసి లారీల ద్వారా రవాణా చేస్తున్నారని చెబుతున్నారు. అయితే ఈ లారీలు పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రయాణిస్తూనే ఉన్నందున ప్రమాదాలు జరిగినప్పుడు లారీల సమీపంలో ప్రయాణించే వారు ప్రాణాలు కోల్పోవల్సిందే. ట్రాఫిక్ తక్కువగా ఉండే సమయాల్లో నడపించాలన్న సూచనలు చేసినా బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నాయి.

డ్రైవర్‌ల అజాగ్రత్తలు..

భారీ సైజులో ఉండే గ్రానైట్ రా మెటీరియల్ తరలించే లారీల డ్రైవర్‌లు అజాగ్రత్తలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన రహదారులపై లారీలపై నుంచి భారీ సైజ్ గ్రానైట్ బండలు పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా శుక్రవారం కరీంనగర్ లోనే శ్రీనిధి గ్రానైట్ కు సంబంధించిన లారీ డ్రైవర్ తాగిన మైకంలో సడన్ బ్రేక్ వేయడంతో గ్రానైట్ రోడ్డుపై పడిపోయింది. అదుపు తప్పిన లారీ ఓ ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఒకరికి గాయాలయ్యాయి. ప్రమాదాలతో సహవాసం చేస్తున్న రీతిలో సాగే గ్రానైట్ రవాణా చేసే లారీలను నడిపే డ్రైవర్లు సుశిక్షుతులగా ఉండడమే కాకుండా.. జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది.

కానీ లారీ డ్రైవర్లను కట్టడి చేసే విషయంలో అటు ట్రాన్స్‌పోర్టు ఏజెన్సీలు కానీ, గ్రానైట్ లీజ్ దారులు కానీ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రవాణా శాఖ అధికారులు కూడా ఈ విషయం పై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాస్తవంగా కూడా ప్రధాన రహాదారుల పై జరుగుతున్న ప్రమాదాలు, స్టేషన్లలో ఫిర్యాదు అవుతున్న ఘటనలు మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. కానీ గ్రానైట్ జోన్ లోని పల్లెల్లో యాక్సిడెంట్‌లు జరగడం సర్వసాధరణంగా మారిపోయిందని అంటున్న వారు లేకపోలేదు.

Advertisement

Next Story