దేశాన్ని 'పంట' కాలనీలుగా విభజించాలి: మంత్రి నిరంజన్ రెడ్డి

by Vinod kumar |
దేశాన్ని పంట కాలనీలుగా విభజించాలి: మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: దేశాన్ని పంట కాలనీలుగా విభజించి, ఒక సంవత్సరంలో ఏ ఏ పంట ఎంత పండించాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం ముందుగానే నిర్ణయించి అమలు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి పరచాలన్న లక్ష్యంతో వివిధ రాష్ట్రాలు, దేశాలు పర్యటించి వివరాలను సేకరిస్తున్న మంత్రి నిరంజన్ రెడ్డి తో కూడిన బృందం మహారాష్ట్ర పర్యటనకు వెళ్లింది.


ఈ క్రమంలో అహ్మద్ నగర్ జిల్లా షిరిడి సమీపంలో ఉన్న ద్రాక్ష, జామ తోట, తదితర సాగులను పరిశీలించిన అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డి బృందం అక్కడి ఉద్యానవన శాఖ అధికారులు, రైతులతో ప్రత్యేక సమావేశం అయ్యారు. అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డి పత్రికా ప్రకటనను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వచ్చే లక్ష్యంతో ముందుకు సాగుతుందన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో గత ఏడేళ్లుగా తెలంగాణ వ్యవసాయ రంగం సమూలంగా మార్పులు సంతరించుకుందని మంత్రి పేర్కొన్నారు.


పంట మార్పిడితో మరిన్ని లాభాలు గడించే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు, పంటల దిగుబడి మార్కెటింగ్ విధానాలకు సంబంధించి ఆయా రాష్ట్రాలు, దేశాలు పర్యటించి పరిశీలించామని మంత్రి వెల్లడించారు. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యవసాయ రంగం మరింతగా అభివృద్ధిని సాధించి తీరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. యువత పెద్ద ఎత్తున వ్యవసాయ రంగంపై దృష్టి సారించి ప్రత్యేక ముద్ర వేయాలని మంత్రి సూచించారు.


మంత్రి నిరంజన్ రెడ్డి తో పాటు వెళ్లిన ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి, బాల్క సుమన్, గండ్ర వెంకటరమణా రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్ రామ్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ సరోజినిదేవి, అసిస్టెంట్ డైరెక్టర్ సుభాషిని తదితరులు శుక్రవారం ఉదయం షిరిడిలో సాయిబాబాను దర్శించుకొని అనంతరం వివిధ రకాల పంటల పరిశీలన చేశారు.

Advertisement

Next Story