పల్లి, పొద్దుతిరుగుడు వ్యర్థాలతో నీటిలోని లోహాల తొలగింపు..

by Manoj |
పల్లి, పొద్దుతిరుగుడు వ్యర్థాలతో నీటిలోని లోహాల తొలగింపు..
X

దిశ, ఫీచర్స్ : వేరుశనగ లేదా పొద్దుతిరుగుడు గింజల నుంచి వంట నూనె తీసినప్పుడు 'ఆయిల్‌సీడ్ మీల్'గా పిలువబడే వ్యర్థ పదార్థం ఉత్పత్తవుతుంది. అయితే దీని నుంచి సేకరించిన ప్రోటీన్లు ఉపయోగించి కలుషిత నీటిలోని భారీ లోహాలను ఫిల్టర్ చేయొచ్చని కొత్త పరిశోధనలో వెల్లడైంది. ఇందుకు సంబంధించిన వివరాలు కెమికల్ ఇంజనీరింగ్ జర్నల్‌లో ఇటీవలే ప్రచురితమయ్యాయి.

సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ(NTU), స్విట్జర్లాండ్‌లోని ETH జ్యూరిచ్ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు.. వేరుశనగ, సన్‌ఫ్లవర్ బై ప్రొడక్ట్స్‌పై తాజాగా ఓ అధ్యయనం చేపట్టారు. ఈ ఉత్పత్తి నుంచి ప్రోటీన్స్‌ సంగ్రహించి, ప్రోటీన్ చైన్స్‌తో కలిపినప్పుడు 'ప్రోటీన్ అమిలాయిడ్ ఫైబ్రిల్స్(తాడు వంటి నిర్మాణాలను) ఏర్పరుస్తుంది. ఆ ఫైబ్రిల్స్‌ను యాక్టివేటెడ్ కార్బన్‌తో కలిపితే హైబ్రిడ్ ఫిల్ట్రేషన్ మెంబ్రేన్స్ ఏర్పడతాయి.

సీసం, ప్లాటినం, క్రోమియంతో కలుషితమైన నీటిని ఫిల్టర్ చేసేందుకు ఈ మెంబ్రేన్స్ ఉపయోగిస్తే.. అవి భారీ లోహాలను 99.89 శాతం వరకు తొలగిస్తాయని సైంటిస్టులు గుర్తించారు. ఈ విధంగా శుద్ధిచేసిన నీరు ఇంటర్నేషనల్ డ్రింకింగ్ స్టాండర్స్‌కు అనుగుణంగా ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. కాగా సీసంతో కలుషితమైన స్విమ్మింగ్ పూల్ పరిమాణపు( ఒలింపిక్-స్విమ్మింగ్ పూల్‌కు సమానమైన) నీటిని ఫిల్టర్ చేసేందుకు కేవలం 16 కిలోల(35 lb) పొద్దుతిరుగుడు ప్రోటీన్ అవసరమవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ ప్రక్రియను మరింత అభివృద్ధి చేస్తే రివర్స్ ఆస్మాసిస్ వంటి సాంప్రదాయ సాంకేతికతలకు తక్కువ-ధరలో ప్రత్యామ్నాయంగా ఫిల్టరేషన్ మెంబ్రేన్స్ ఉండవచ్చని భావిస్తున్నారు. పైగా దీనికి ఎలాంటి విద్యుత్ అవసరం ఉండదని పేర్కొన్నారు.

'మా ప్రోటీన్-ఆధారిత మెంబ్రేన్స్ పర్యావరణహితమైన పద్ధతిలో విద్యుత్ శక్తి అవసరం లేకుండా అతితక్కువ ఖర్చుతో రూపొందిస్తాం. వాటిని ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో ఉపయోగించడం వల్ల అక్కడి ప్రజలకు ప్రయోజనకారిగా ఉంటుంది' అని ఎన్‌టీయూ ప్రొఫెసర్ అలీ మిసెరెజ్ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed