కబ్జా చెరలో చెరువులు.. హైకోర్టు ఆదేశాలు బేఖాతరు

by Vinod kumar |
కబ్జా చెరలో చెరువులు.. హైకోర్టు ఆదేశాలు బేఖాతరు
X

దిశ, శేరిలింగంపల్లి: చెరువులకు చెర కొనసాగుతూనే ఉంది. నగరంలో ఒక్కో చెరువు, కుంట క్రమంగా కనుమరుగవుతుండగా. ఇప్పటికే వందలాది చెరువుల కబ్జా చెరలో ఉన్నాయి. అయినా అటు ఇరిగేషన్, ఇటు జీహెచ్ఎంసీ అధికారుల్లో కనీస స్పందన కనిపించని దుస్థితి నెలకొంది. న్యాయస్థానాల ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్న ఘనత మన అధికారులకే చెల్లుతుంది. ప్రభుత్వం చెరువుల సుందరీకరణ కోసమంటూ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుండగా.. కొందరు అక్రమార్కులు అందులోనే పాగా వేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ప్రయత్నాలు వృధా అవుతుండగా ఎఫ్టీఎల్ లు, బఫర్ జోన్ లో బహుళ అంతస్థుల నిర్మాణాలు వెలుస్తున్నాయి. అదేంటి అంటే పర్మిషన్స్ ఉన్నాయి.. అందుకే కట్టుకుంటున్నారు నిర్మాణదారులు.

అలాంటప్పుడు స్థల పరిశీలన చేయకుండా, ఎక్కడ కడుతున్నారో తెలియకుండా అనుమతులు ఎలా జారీ చేశారు.. అనేది ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారుల వద్ద కూడా సమాధానం లేకుండా పోతోంది. వారు పర్మిషన్ లకు దరఖాస్తు చేసుకున్నారు మేము ఇచ్చామంటూ.. ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటున్నారు శాఖల మధ్య సమన్వయ లోపం కొందరు బిల్డర్లకు వరంగా మారింది. ఈ నిర్మాణాల వెనుక హైదర్ నగర్ పక్క డివిజన్ కార్పొరేటర్ దగ్గరుండి మరీ తన పలుకుబడిని ఉపయోగిస్తున్నారని, ఆయన కనుసన్నల్లోనే ఈ నిర్మాణాలు సాగుతున్నాయన్న ఆరోపణలున్నాయి.

కింది కుంట చెరువు పై హైకోర్టులో పిల్..

హైదర్ నగర్ డివిజన్ కందికుంట చెరువులో అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయని, సుందరీకరణ పేరుతో మట్టి పోస్తే కొందరు కబ్జాలు చేసి అందులో నిర్మాణాలు చేపడుతున్నారని, కబ్జా కోరల్లో నుండి చెరువును కాపాడాలంటూ ఫోరమ్ టూ ఇంప్రూవ్ థింగ్స్ సంస్థ ప్రతినిధులు ఆగస్టు 5, 2020లో రాష్ట్ర హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ది స్టేట్ ఆఫ్ తెలంగాణ రిఫరెన్స్ బై ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, హెచ్.ఎమ్.డి.ఏ కమిషనర్, జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ వెస్ట్, కలెక్టర్ మేడ్చల్, మల్కాజిగిరి, తహశీల్దార్ కూకట్ పల్లి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇరిగేషన్ అండ్ క్యాడ్ డిపార్ట్మెంట్ నార్త్ టాంక్స్ డివిజన్ అధికారులను ప్రతివాదులుగా పేర్కొంటూ.. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కింది కుంట చెరువు స్థితిగతులను క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని పేర్కొంది.

అలాగే కూకట్‌పల్లి మండలం, హైదర్‌ నగర్ గ్రామంలో ఉన్న సర్వేనెంబర్ 119 లోని కింది కుంట చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) 08-17 రక్షించకపోవడంపై 8 మంది అధికారులను ప్రతివాదులుగా పేర్కొంది. సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా పనులు చేపడితే ఎందుకు పరిరక్షించలేదంటూ ప్రశ్నించింది న్యాయస్థానం. ఈ పిల్ ఇంకా న్యాయస్థానంలోనే ఉంది. దీంతో పాటు కిందికుంట చెరువుకు సంబంధించి మరో కేసు కూడా పెండింగ్ లో ఉంది.

జీహెచ్ఎంసీ అధికారుల అత్యుత్సాహం దేనికి..?


హైదర్ నగర్ డివిజన్ కిందికుంట చెరువును ఆనుకుని సాగుతున్న నిర్మాణం కోసం సంబంధిత నిర్మాణదారు కూకట్ పల్లి సర్కిల్ మున్సిపల్ అధికారులను ఆశ్రయించగానే వారు అనుమతులు జారీ చేశారు. కింది కుంట చెరువు విషయంలో జీహెచ్ఎంసీ అధికారులను ప్రతివాదులుగా పేర్కొన్నా, స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన టీపీఎస్ సిబ్బంది వాటిని కనీసం పట్టించుకోకుండా అనుమతులు జారీ చేయడం ఏంటి అనేది అనేక అనుమానాలకు తావిస్తోంది.

ఇదే విషయంపై టీపీఎస్ అధికారి శ్రీనివాస్ రెడ్డిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోగా, ఏసీపీ ఇర్షాద్ ఫోన్ స్విచ్చాఫ్ లో ఉంచారు. అటు ఇరిగేషన్ అధికారులు కూడా ఆ స్థలం ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా లేదా అని చూడకుండా.. బఫర్ జోన్ లోకి వస్తుందా అనే కనీస పరిశీలన కూడా చేయకుండా ఎన్‌ఓసీ జారీచేయడం పట్ల చెరువులు, కుంటల పరిరక్షణ కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

చెరువు సమాచారం గల్లంతు..


నగరంలోని చెరువులు, కుంటల సమాచారానికి సంబంధించి ఇరిగేషన్ అధికారులు ప్రత్యేకంగా ఓ సర్వర్ తయారు చేసి అందులో ప్రతీ చెరువుకు ఒక ఐడీ కేటాయించి సదరు చెరువు విస్తీర్ణం, దాని ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లను నిర్ణయిస్తూ.. ఆ సమాచారాన్ని ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచింది. కానీ ఇటీవల కొన్ని చెరువులు, కుంటలకు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా ఎత్తివేశారు. ఆన్ లైన్ లో ఆ చెరువు ఐడీ ఎంటర్ చేస్తే 404 ఫైల్ ఆర్ డైరెక్టర్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. అంటే ఈ సమాచారాన్ని తొలగించారు అని చూపిస్తుంది.

చెరువుల విషయంలో పారదర్శకంగా ఉండాల్సిన ఇరిగేషన్ అధికారులు అందులో ఉన్న సమాచారాన్ని ఏ కారణాలతో తొలగించారు, ఇది ఏమైనా దేశ భద్రతకు సంబంధించిన విషయమా..? తొలగించాల్సిన అవసరం ఏముంది అనేది ఎవరికి అంతుచిక్కని ప్రశ్న. ఇక కింది కుంట చెరువు సర్వేనెంబర్ 119 లో ఉండాల్సిన 8.17 ఎకరాలు ఏమైంది. ఎవరు ఎంత భూమి కబ్జా చేశారు. ఈసీలో ఉన్నది ఎంత..? అందులో ఉన్న లొసుగులు ఏంటి..? ఇప్పుడు సాగుతున్న నిర్మాణాల వెనుక ఉన్నది ఏ డివిజన్ కార్పొరేటర్.? సికింద్రాబాద్ లీడర్ ఇక్కడ ఎలా భూమిని దక్కించుకున్నారు..?అనేది త్వరలోనే బట్టబయలు కానుంది.

Advertisement

Next Story