మండలంలో మహిళా అధికారులదే అగ్ర పీఠం

by Javid Pasha |
మండలంలో మహిళా అధికారులదే అగ్ర పీఠం
X

దిశ, ఖానాపూర్: వంటింటికే పరిమితమైన రోజుల నుండి ఉద్యోగం చేసే స్థాయికి, ఓటు హక్కు కూడా లేకుండా వివక్ష పొందిన రోజుల నుండి దేశాన్ని పాలించే స్థాయికి మహిళలు ఎదిగారు. మాతృమూర్తిగా, అక్కగా, భార్యగా వివిధ పాత్రల్లో మహిళలు ఆప్యాయతకి చిరునామాగా నిలిచారు. ఎక్కడ స్త్రీ పూజించబడుతుందో అక్కడ దేవతలు నివాసం ఉంటారని గ్రంధాలు చెబుతున్నాయి. అంటే స్త్రీ రూపంలో మనం దేవతని పక్కనే పెట్టుకున్నామని గ్రహించాలి. పురుషాధిక్య సమాజం పోకడల్ని విడనాడి ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి. శివుడు తనలో సగభాగం ఇచ్చి ఎలా అర్ద నారీశ్వరునిగా మారాడో అదే స్పూర్తిగా సమానత్వమివ్వాలి.

నేటి సమాజంలో మహిళలు విద్య, ఉద్యోగ, వ్యాపార, క్రీడా రంగాల్లో విశేషమైన ప్రతిభ కనబరుస్తూ సమాజ నిర్మాణంలో, దేశ అభ్యున్నతిలో తమ వంతు పాత్రని పోషిస్తున్నారు. ఈ రోజు చాలామంది మహిళలు ఉన్నత చదువులు చదివి అత్యున్నత స్థాయికి ఎదిగినప్పటికీ సమాజంలో ఇంకా కొన్ని వర్గాలు మహిళలని అణచివేతకు గురిచేస్తూనే ఉన్నాయి. మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ధోరణి పోవాలంటే మహిళలు గౌరవించబడాలి. అందుకోసం సమాజమే మహిళల పట్ల తన దృక్పథాన్ని మార్చుకోవాలి. సమాజం అంటే మనమే కాబట్టి మనలో ప్రతి ఒక్కరి ఆలోచనల్లో మార్పు రావాలి. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శక్తివంతమైన ఖానాపూర్ మహిళామణులపై దిశ ప్రత్యేక కథనం.


1. ఖానాపూర్ తహసీల్దార్ జూలూరి సుభాషిణి:

తహసీల్దార్‌గా, మండల మేజిస్ట్రేట్‌గా మండల రెవెన్యూ వ్యవస్థని అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఎలాంటి వివాదాలకు చోటు లేకుండా తనదైన శైలిలో విధులు నిర్వర్తిస్తున్నారు. మండలంలోని వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ సమర్థవంతంగా కార్యనిర్వాహక విధులని నిర్వర్తిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలు ఉన్నత విద్యాభ్యాసం ద్వారా తమ లక్ష్యాలను చేరుకోవాలన్నారు. తల్లిదండ్రులు ఆడపిల్లలకు త్వరగా పెళ్లి చేసి చేతులు దులుపుకుందామనే ఆలోచనలో ఉన్నారని, ఆడపిల్ల అంటే భారం కాదు ధైర్యం అని గుర్తించాలన్నారు.


2. ఖానాపూర్ ఎంపీడీఓ పీ సుమనవాణి:

నూతన పంచాయతీరాజ్ చట్టంతో గ్రామ పంచాయితీల రూపురేఖలు మారిపోయాయి. అదే సమయంలో అనేక కొత్త కార్యక్రమాలు ప్రభుత్వం చేత అమలు చేయబడుతున్నాయి. ఒక వైపు ఈ.జి.ఎస్, మరోవైపు అభివృద్ధి పనులతో నిత్యం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. మండలంలోని 20 గ్రామ పంచాయతీలను విజయవంతంగా అభివృద్ధి వైపు నడిపిస్తున్న అధికారి ఎం.పి.డి.ఓ సుమనవాణి. తన హార్డ్ వర్క్‌తో మహిళా అధికారులకి ప్రేరణగా నిలిచారు.


3. ఖానాపూర్ ఎంఈఓ వీ రత్నమాల:

తను ఒక్కరే ఒక హై స్కూల్, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాద్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తన్నారు. దాంతో పాటుగానే ఐదు మండలాల ఇంచార్జ్ విద్యాశాఖాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మహిళలు పురుషులతో సమానంగా మాత్రమే కాదు. అంతకుమించి పనిచేస్తారని నిరూపిస్తున్నారు. ఒక మహిళ ఇన్ని బాధ్యతలు మోయడం అది రిటైర్మెంట్ దగ్గర్లో ఇంతటి భారాన్ని మోయగలగడం నిజంగా హర్షనీయం. ఆచరణాత్మక క్రమశిక్షణతో సవ్యమైన దారిలో 5 మండలాల విద్యా కార్యకలాపాలని ఒక్కరై చక్కదిద్దుతున్నారు.


4. శ్రీ లక్ష్మి, వెటర్నరి వైద్యురాలు:

ఖానాపూర్ మండల పశు వైద్యాధికారిగా సేవలందిస్తూ అనతికాలంలోనే సౌమ్యురాలిగా, సమర్థ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. గ్రామీణ ప్రాంత పాడి రైతులకి, పశువుల పెంపకందార్లకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మారుమూల ప్రాంతాల్లో కూడా సందర్శించడం,వృత్తి పట్ల నిబద్ధత చూపుతూ మండలంలోని ప్రభావశీలమైన మహిళల్లో ముందు వరుసలో ఉన్నారు. మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని మించిన ఆయుధం మరేది లేదంటారు. కొన్ని పనులు పురుషులకు మాత్రమే సాద్యమనుకునే కాలం నుండి ఎలాంటి సవాలుకైనా మేమున్నాం అంటూ ప్రేరణగా నిల్చారు.


5. సంకినేని మంజుల, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు:

మండలంలోని అశోక్ నగర్ స్కూల్ హెచ్.ఎం, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తారు. విధి నిర్వహణలో విద్యార్థుల శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమించే ఉపాధ్యాయురాలు 2021వ సంవత్సరం గురుపూజోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయినిగా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు తీసుకోని శక్తివంతమైన మహిళగా నిలిచారు. ఒక మహిళగా ఉద్యోగం చేసే చోట చిత్రమైన వ్యక్తుల మధ్య పని చేస్తున్నా కూడా ఆత్మ స్థైర్యం చెదరకుండా ఉండాలన్నారు. మహిళలని చులకనగా చూసే వారి ఎదుటే సామర్థ్యంలో మేమేమి తీసిపోమనే పట్టుదలతో ముందుకు సాగాలన్నారు.


6. పి. మేనక,ప్రత్యేక అధికారి, కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల :

తాను 200 పైచిలుకు భావి మహిళలకు దిక్సూచి. బాలికల ఉన్నతి కోసం ప్రభుత్వం తరపున పనిచేస్తున్నారు. పగలు, రాత్రి, పేద, అనాధ బాలికల విద్య, వసతి, పౌష్టికాహారం సమకూర్చడంతో పాటు వారిలోని ఇష్టాలని, సృజనాత్మకతని వెలికితీసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సాహం అందిస్తున్నారు. వీరంతా మండల స్థాయి అధికారిణిలు కాగా కింది స్థాయిలో విజయవంతమైన మహిళా ఉద్యోగులుగా చాలామందే ఉన్నారు. వీరు కాకుండా రాజకీయంగా సర్పంచ్, ఎం.పి.టి.సి, వైస్ ఎం.పి.పిగా సేవలందిస్తూ పాలనలో తమదైన శైలిలో ముందుకు సాగుతున్న ఖానాపూర్ మండల మహిళలకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇదే స్పూర్తితో కొనసాగుతూ భవిష్యత్ తరాలకి దిశానిర్దేశం చేస్తారని ఆశిస్తున్నాము.సమాజం కూడా తన ఆలోచన ధోరణి మార్చుకొని మహిళలపై ఆంక్షలు, ఆకృత్యాలు, అగత్యాలు లేకుండా సమసమాజం వైపు పయనించాలని కోరుకుంటున్నాం.

Advertisement

Next Story

Most Viewed