హుజురాబాద్ ఉప ఎన్నికల్లో మంత్రి హామీ.. ఆశగా ఎదురు చూస్తున్న మండల ప్రజలు

by Manoj |
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో మంత్రి హామీ.. ఆశగా ఎదురు చూస్తున్న మండల ప్రజలు
X

దిశ, వీణవంక: నిత్యం వందలాది వాహనాలు వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే రోడ్డు అది. ఉత్తర తెలంగాణలో ప్రధాన వాణిజ్య నగరాలైన హుజురాబాద్, జమ్మికుంట అలాగే మండల కేంద్రమైన వీణవంక మీదుగా జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి. అయితే దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్, ఎంపీగా బోయినపల్లి వినోద్ కుమార్ ఉన్న సమయంలో జమ్మికుంట నుండి వీణవంక వరకు ఉన్న రెండు లైన్ల రోడ్డును, పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా నాలుగు లైన్ల రోడ్డు గా విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఆ దిశగా కొంత పనులు మొదలు పెట్టినా కూడా ఇన్నేళ్ళలో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా తయారయింది. విస్తరణ పనులు మొదలై నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. రోడ్డు వెంట వెలువడే దుమ్ము ధూళితో తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నామని, కంకర వేసిన రోడ్డుపై వాహనాలు నడపాల్సి రావడంతో వాటి సామర్థ్యం దెబ్బతిని, తొందరగా పాడవుతున్నాయని- నిత్యం ఆ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు వాపోతున్నారు. రాత్రిపూట దూర ప్రయాణాలు చేసే వాహనదారుల ఇబ్బందులు వర్ణించరానివిగా ఉన్నాయి. ఆ సమయంలో అనేక ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర వీడి రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు.

ఆర్థిక మంత్రి ఆదేశాలు బేఖాతరు

గత సంవత్సరం హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వీణవంకలో నిర్వహించిన బహిరంగ సభలో ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రసంగిస్తూ.. జమ్మికుంట నుండి వీణవంక వరకు గల రోడ్డు విస్తరణ పనులు ఒక నెలలో పూర్తి చేస్తామని మండల ప్రజలకు ఇచ్చిన హామీ వారిని ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. కొంచెం అతిశయోక్తిగా అనిపించినప్పటికీ, సాక్షాత్తు ఆర్థిక మాత్యుడు ఇచ్చిన హామీ కాబట్టి, ప్రజలలో రోడ్డు నిర్మాణం పట్ల ఒక ఆశాభావం ఏర్పడింది. కానీ ఇప్పటివరకు ఆ హామీని నెరవేర్చే దిశగా ఎలాంటి పురోభివృద్ధి జరగలేదు. ఇప్పటికైనా ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రజల సాక్షిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుని, రోడ్డు నిర్మాణ పనులను సత్వరమే తిరిగి మొదలుపెట్టాలని ప్రయాణికులు, ఆయా గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed