బ‌ల్దియాలో `న‌కి`లీల‌లు..అక్కడ అంద‌రి సంత‌కాలు ఫోర్జరీ..?

by Mahesh |
బ‌ల్దియాలో `న‌కి`లీల‌లు..అక్కడ అంద‌రి సంత‌కాలు ఫోర్జరీ..?
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: బీఎన్ రెడ్డి న‌గ‌ర్‌కు చెందిన ఓ వ్యక్తి త‌న 200 గ‌జాల స్థలంలో ఇంటి నిర్మాణం చేప‌ట్టాల‌నుకున్నాడు. ఇందుకు ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలో తెలియ‌క స‌రూర్‌న‌గ‌ర్‌లోని జీహెచ్ఎంసీ స‌ర్కిల్‌ కార్యాల‌యానికి వెళ్లాడు. టౌన్‌ప్లానింగ్ సెక్షన్‌కు వెళ్లి అక్కడ త‌న‌కు ఇంటి నిర్మాణం కోసం అనుమ‌తులు కావాల‌ని అడిగాడు. దీంతో అధికారులు టీఎస్‌బీపాస్‌లో ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. ఎలా చేసుకోవాలో తెలియ‌ద‌ని చెప్పడంతో ఆఫీసుకు ఎదురుగా బ్రోక‌ర్లు చాలా మంది ఉంటార‌ని వారి వ‌ద్దకు వెళ్తే పూర్తిగా వాళ్లే అన్నీ చేసిపెడ‌తార‌ని చెప్పారు. దీంతో అత‌డు వారి ద‌గ్గర‌కు వెళ్లాడు.

త‌న 200 గ‌జాల స్థలంలో ఇంటి నిర్మాణం కోసం ప‌ర్మిష‌న్ ఇప్పించాల‌ని కోరాడు. దీంతో ఓ బ్రోక‌ర్ ఫీజు కాక రూ.3 ల‌క్షల వ‌ర‌కు ఖ‌ర్చవుతుంద‌ని చెప్పాడు. దీంతో ప‌ర్మిష‌న్‌కు మూడు ల‌క్షలా అని ఆశ్చర్యపోయాడు. అందుకు ఆ బ్రోక‌ర్ ఇలా స‌మాదానం ఇచ్చాడు. మేము ప్లానింగ్‌తో స‌హా సివిల్ ఇంజ‌నీర్, నోట‌రీ, గెజిటెడ్ అధికారుల సంత‌కాలు, స్టాంపులు అన్ని పూర్తి చేసి టీఎస్‌బీపాస్ ఆన్‌లైన్‌లో అప్లై చేస్తామ‌ని, అయితే అనుమ‌తి రావాలంటే మాత్రం అధికారుల‌కు కూడా డ‌బ్బులు ఇవ్వాల్సి ఉంటుంద‌ని బ‌దులిచ్చాడు. ఇక చేసేది లేక ఆ నిర్మాణ‌దారులు బ్రోక‌ర్‌కు డ‌బ్బులు చెల్లించి ద‌ర‌ఖాస్తు చేయ‌మ‌ని చెప్పాడు. ఇదీ స‌ర్కిల్‌-3, 4, 5 కార్యాల‌యాల‌ వ‌ద్ద రోజు జ‌రిగే తతంగం.

ఎల్బీన‌గ‌ర్ ప్రాంతానికి చెందిన జీహెచ్ఎంసీ స‌ర్కిల్‌ 3, 4, 5 కార్యాల‌యాలు మూడు స‌రూర్‌న‌గ‌ర్‌లో ఒకే చోట ఉన్నాయి. ఈ కార్యాల‌యానికి రోజు ఇంటి నిర్మాణ అనుమ‌తుల కోసం చాలా మంది వ‌స్తుంటారు. అయితే వీరుకి బ్రోక‌ర్ల ద్వారానే ప‌ని సులువుగా అవుతున్నట్లు చెబుతున్నారు. ఇంటి నిర్మాణ అనుమ‌తుల కోసం ప్రభుత్వం టీఎస్ బీపాస్ తీసుకువ‌చ్చి ఆన్‌లైన ద్వారా 21 రోజుల్లో పార‌ద‌ర్శకంగా అనుమ‌తులు మంజూరు చేస్తున్నామ‌ని చెబుతున్నా.. టౌన్‌ప్లానింగ్ అధికారులు మాత్రం బ్రోక‌ర్ల ద్వారా వ‌చ్చిన వాటికి మాత్రమే అనుమ‌తులు మంజూరు చేస్తున్నట్లు స‌మాచారం. నేరుగా అప్లైయ్ చేసుకున్న వాటిని ఎదో ఓక‌ సాకుతో రిజ‌క్ట్ చేస్తున్నట్లు నిర్మాణ‌దారులు పేర్కొంటున్నారు. చివ‌రికి బ్రోక‌ర్ల వ‌ద్దకు వెళ్లనిదే అనుమ‌తులు మంజూరు కావ‌డంలేద‌ని వాపోతున్నారు.

అంద‌రి సంత‌కాలు ఫోర్జరీ..?

సివిల్ ఇంజ‌నీర్ ద‌గ్గరి నుంచి గెజిటెడ్ అధికారుల వ‌ర‌కు అంద‌రి సంత‌కాల‌ను బ్రోక‌ర్లే ఫోర్జరీ చేస్తున్నారు. సివిల్ ఇంజ‌నీర్‌, గెజిటెడ్ అధికారుల రెడిమేడ్ స్టాంపులు సైతం వీరి వ‌ద్దనే ఉంటాయి. ఇంటి నిర్మాణ అనుమ‌తుల కోసం ద‌ర‌ఖాస్తు చేయాల్సిన ఫారాల‌పై ఫోర్జరీ సంత‌కాలు చేయడం, న‌కిలీ స్టాంపులు గుద్దడంలో బ్రోక‌ర్లది అంద‌వేసిన చెయ్యి. ఇంటి నిర్మాణాన్ని బ‌ట్టి ఒక్కోర‌కంగా నిర్మాణ‌దారుల నుంచి వ‌సూళ్లు చేస్తుంటారీ బ్రోక‌ర్లు. వీరికి తోడు కొన్ని ప‌త్రిక‌ల రిపోర్టర్‌లు సైతం బ్రోక‌ర్ల అవ‌తారం ఎత్తి అనుమ‌తులు మంజూరు చేయిస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమ‌వుతున్నాయి. టీఎస్‌బీపాస్‌లో ద‌ర‌ఖాస్తు చేశాక ఆఫైల్‌ను టౌన్‌ప్లానింగ్ అధికారుల వ‌ద్దకు తీసుకువెళ్లి చిటికెలో మంజూరు చేయించి అనుమ‌తుల ప‌త్రాల‌ను నిర్మాణ‌దారుల‌కు అంద‌జేస్తారు.

తిలాపాపం.. త‌లా పిడికెడు..!

ఫోర్జరీ సంత‌కాల‌తో ఇంటి నిర్మాణ అనుమ‌తులు పొందిన విష‌యం తెలియ‌ని నిర్మాణ‌దారులు ఎదో ర‌కంగా ఇంటి నిర్మాణం కోసం అనుమ‌తి ల‌భించింద‌ని సంబుర‌ప‌డిపోతాడు. కానీ ఎప్పుడైన అది బ‌య‌ట‌ప‌డితే త‌న మెడ‌కు చుట్టుకుంటుంద‌నే విష‌యాన్ని గ‌మ‌నించ‌డు. విస్తీర్ణాన్ని బట్టి.. అంత‌స్తును బ‌ట్టి రేటు నిర్ణయించి బ్రోక‌ర్లు నిర్మాణ‌దారుల నుంచి వ‌సూలు చేసి ఆయా టౌన్‌ప్లానింగ్ ఏసీపీల‌కు, టీఎపీఎస్‌ల‌కు `మామూళ్లు` ముట్టచెబుతార‌ని తెలుస్తోంది. టౌన్‌ప్లానింగ్ అధికారుల నుండి కొంత శాతం డిప్యూటీ క‌మిష‌న‌ర్లకు కూడా అందుతున్నట్లు స‌మాచారం. ఇలా తిలా పాపం.. త‌లా పిడికెడు అన్నట్లుగా జీహెచ్ఎంసీ స‌ర్కిల్‌-3, 4, 5 టౌన్‌ప్లానింగ్ అధికారుల వ్యవ‌హారం మూడు బిల్డింగ్‌లు- ఆరు అనుమ‌తులు అన్నట్లు సాగుతుంద‌ని విమ‌ర్శలు వినిపిస్తున్నాయి.

విజిలెన్స్‌, ఎసీబీ దృష్టిసారించాలి

జీహెచ్ఎంసీ స‌ర్కిల్-3, 4, 5 టౌన్‌ప్లానింగ్ విభాగంలో భారీ ఎత్తున అవినీతి జ‌రుగుతున్నట్లు ప‌లువురు వాపోతున్నారు. మామూళ్లకు అల‌వాటు ప‌డ్డ అధికారులు ఎటువంటి వెరిఫికేష‌న్ లేకుండానే బ్రోక‌ర్లు చేసిన ఫోర్జరీ సంత‌కాలు, న‌కిలీ స్టాంపుల‌కు అనుమ‌తులు మంజూరు చేస్తున్నారు. ఒక్కో స‌ర్కిల్ ప‌రిధిలో అసిస్టెంట్ టౌన్‌ప్లానింగ్ అధికారికి రోజుకు ల‌క్ష రూపాయాలు వ‌ర‌కు ముడుపులు అందుతున్నట్లు స‌మాచారం. ఈ లెక్కన వారి ఆస్తులు ఏమేర‌కు ఉంటాయో అర్థం చేసుకోవ‌చ్చు. మూడు స‌ర్కిళ్ల టౌన్ ప్లానింగ్ విభాగాల‌పై విజిలెన్స్, ఏసీబీ అధికారులు దృష్టిసారించాల‌ని ప‌లువురు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed