- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జడేజాకు చెన్నై పగ్గాలు ఇవ్వడం వెనుక ధోనీ ఆలోచన ఇదే..
న్యూఢిల్లీ: మరో రెండు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభమవుతుందనగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. సీఎస్కే కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. అలాగే, కెప్టెన్సీ బాధ్యతలను స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు అప్పగించాడు. దీంతో ఈ సారి సీఎస్కేను జడేజా నడిపించనున్నాడు.
ఈ విషయాన్ని చెన్నయ్ సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. ధోనీ ఈ సీజనే కాకుండా భవిష్యత్తులోనూ సీఎస్కేకే ప్రాతినిధ్యం వహిస్తాడని తెలిపింది. ధోనీ, సురేశ్ రైనా తర్వాత చెన్నయ్ సూపర్ కింగ్స్‌కు సారథ్యం వహించే మూడో కెప్టెన్‌గా జడేజా నిలిచాడు. అయితే, రైనా తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టగా.. ధోనీ తర్వాత పూర్తి స్థాయి కెప్టెన్సీ చేపట్టింది మాత్రం జడేజానే.
2020 సీజన్ నుంచే ధోనీ సీఎస్కే కెప్టెన్‌గా తప్పుకుంటాడని, 2021 సీజన్‌లో పాల్గొనడని ప్రచారం జరిగింది. ఆ సమయంలోనే ధోనీ చేసిన కామెంట్లు సైతం అభిమానులను గందరగోళానికి గురి చేశాయి. అయితే, టీమ్ మేనేజ్‌మెంట్ ఆ వార్తలను కొట్టిపారేయడంతో అవన్నీ పుకార్లేనని తేలింది. అయితే, మరో రెండు రోజుల్లో లీగ్ ప్రారంభం కానుండగా.. ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అలాగే, అందరూ ఊహించినట్టే జడేజా చెన్నై పగ్గాలు చేపట్టనున్నాడు.
గురువారం టీమ్ మీటింగ్‌లో ధోనీ తన నిర్ణయాన్ని వెల్లడించాడని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపాడు. 'ఫ్రాంచైజీకి ఏం చేస్తే మంచిదో ధోనీ ఆలోచిస్తుంటాడు. జడేజా తన కెరీర్‌లో ప్రస్తుతం మంచి పొజిషన్‌లో ఉన్నాడు. దాంతో కెప్టెన్సీ బాధ్యతలు జడేజాకు అప్పగించడం ఇదే సరైన సమయమని ధోనీ భావించాడు' అని పేర్కొన్నాడు. అయితే, గత ఏడాది ఈ ప్రస్తావన వచ్చిందని, ధోనీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే బెస్ట్ ఆప్షన్ జడేజానే అని తమకు తెలుసునని చెప్పాడు.
మహేంద్రుడి కోట..
ఐపీఎల్‌లో చెన్నయ్ సూపర్ కింగ్స్‌ను కెప్టెన్ ధోనీ తిరుగులేని జట్టుగా నిలిపాడు. కూల్ కెప్టెన్‌గా.. బెస్ట్ ఫినిషర్‌గా ధోనీ చెన్నయ్‌ను సక్సెస్‌ఫుల్ జట్టుగా అగ్రస్థానంలో ఉంచాడు. 2008లో ఐపీఎల్ ఆరంభం నుంచే సీఎస్కేకు ధోనీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.12 ఏళ్లుగా చెన్నయ్ జట్టును నడిపించిన ధోనీ.. 2010, 2011, 2018, 2021 సీజన్లలో చాంపియన్‌గా నిలిపాడు. ఐపీఎల్‌లో అత్యధిక టైటిల్స్ గెలిచిన జట్లలో ముంబై ఇండియన్స్ తర్వాతి స్థానం చెన్నయ్‌దే. అయితే, ఐపీఎల్‌లో 195 మ్యాచ్‌లు ఆడిన చెన్నయ్ 117 విజయాలతో 60.56 విన్ పర్సంటేజ్‌తో సీఎస్కేనే టాప్‌లో ఉంది. ముంబై 58.52 శాతంతో రెండో స్థానంలో కొనసాగుతున్నది. విజయవంతమైన జట్టుగా చెన్నయ్‌ను తీర్చిదిద్దిన ధోనీ.. తన తర్వాత సైతం జట్టు అదే ప్రదర్శన కొనసాగించాలని భావించాడు. గత రెండు సీజన్ల ముందే ధోనీ ఈ ఆలోచన చేసినట్లు తెలుస్తున్నది. అందులో భాగంగానే జడేజాను తీర్చిదిద్దాడు. అలాగే, ఇటీవల ముగిసిన మెగా వేలంలోనూ ఆటగాళ్ల కొనుగోలులో ధోనీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తున్నది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని క్రికెటర్ల ఎంపిక జరిగింది.
చెన్నై పగ్గాలు జడేజాకు..
చెన్నై నూతన సారథిగా రవీంద్ర జడేజా నియామకమయ్యాడు. ధోనీ తర్వాత పూర్తి స్థాయి కెప్టెన్‌గా జడేజా ఈ ఏడాది నుంచే బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా, 2012లో సీఎస్కేకు ఆడిన జడ్డూ.. ఆ తర్వాత జట్టులో కీలక ప్లేయర్‌గా మారిపోయాడు. ప్రతిసారి వేలంకు ముందు సీఎస్కే మేనేజ్‌మెంట్ రిటైన్ చేసుకుంది. ఇక, గత రెండు సీజన్లలో జడేజా అదరగొట్టాడు. 2020, 2021 సీజన్లలో 57.37 సగటుతో 459 పరుగులు చేశాడు. అలాగే, 30 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీశాడు. బ్యాటు ఝుళిపించడంలోనూ.. బంతితో ఆకట్టుకోవడంలోనూ.. ఫీల్డింగ్‌లోనూ అద్భుతంగా రాణించే జడేజా పర్‌ఫెక్ట్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు.
ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆల్‌రౌండర్ జాబితాలో నం.1 స్థానంలో ఉండటంతోపాటు.. వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లోనూ మంచి పొజిషన్‌లో ఉన్నాడు. అయితే, కెప్టెన్‌గా జడేజాకు అనుభవం లేదు. 2007లో భారత అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, ఈ ఏడాది జడేజాను ధోనీ వెనుక ఉండి నడిపించనున్నాడు. ధోనీ మార్గదర్శకంలో జడేజా సూపర్ కెప్టెన్‌గా మారడంలో సందేహం లేదు. కాగా, ఈ నెల 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండగా.. ఆరంభ మ్యాచ్‌లోనే చెన్నయ్ జట్టు కోల్‌కతాతో తలపడనున్నది.