మధ్యతరగతి మహిళల సామాజిక బాధలపై సహజ చిత్రణ..

by Manoj |   ( Updated:2022-07-26 04:27:00.0  )
మధ్యతరగతి మహిళల సామాజిక బాధలపై సహజ చిత్రణ..
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా భారతీయ సినిమాల్లో స్త్రీ పాత్రలకు పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. కథా గమనంలో సహాయక పాత్ర పోషించడం తప్ప ఆధిపత్యం ప్రదర్శించే దాఖలాలు చాలా అరుదు. వీరోచిత విన్యాసాలు చేసే కథానాయకుడికి ప్రేయసిగా, అతని అజమాయిషీని అంగీకరించే ఇల్లాలిగా తప్ప నిర్ణయాత్మక పాత్ర ఆశించడం అత్యాశే. ఈ జనరేషన్ చిత్రాల్లోనూ లైంగికత చుట్టూ సంభాషణలకు కేంద్రకంగా.. మగాళ్ల దృష్టి కోణం, పితృస్వామ్య విలువలకు లోబడే స్త్రీ పాత్రల చిత్రీకరణ ఉంటోంది. ఇలా తరతరాలుగా లైంగికత చాటున అణచివేయబడిన పలు వ్యక్తీకరణలకు కొన్ని సినిమాలు ఆశాజనకంగా నిలిచాయి. పలువురు మహిళా రచయితలు స్త్రీల లైంగికత, అవసరాలు, కోరికలను నిర్భయంగా వెల్లడించే రియల్ క్యారెక్టర్స్ సృష్టించారు. ఇవి వెండితెరకే పరిమితం కాకుండా సమాజ దృష్టికోణంలో మార్పునకు నాంది పలికాయి. ఇంతకీ ఆ చిత్రాలేంటో చూద్దాం.

* డాలీ, కిట్టి ఔర్ వో చమక్తే సితారే, అలంకృత శ్రీవాత్సవ (2019, హిందీ)

రక్తసంబంధీకులైన ఇద్దరు భారతీయ మధ్యతరగతి మహిళల జీవితాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. పెళ్లయిన డాలీ(కొంకణా సేన్)కి కుటుంబం, ఆర్థిక వ్యవహారాలు, కొత్త ఇంటి ఆశలు.. వంటి విషయాలతో భవిష్యత్ భారంగా కనిపిస్తుంటుంది. చెల్లి కిట్టి(భూమి పెడ్నేకర్).. సిటీ లైఫ్ అనుభవించాలనే ఆశతో నోయిడాలోని డాలీ దగ్గరికి వెళ్తుంది. కొన్నాళ్లు అక్కడే ఉన్న కిట్టి.. తన బావ వంకర చూపులు, చేష్టలతో పాటు పెళ్లి విషయంలో డాలీ ఒత్తిడిని తట్టుకోలేక సొంతంగా జీవితాన్ని మొదలుపెట్టేందుకు బయలుదేరుతుంది. మొత్తానికి ఒక సెక్స్ అండ్ చాట్ కాల్ సెంటర్‌లో జాబ్ పొందుతుంది. ఈ మార్గంలో తనకు కొన్ని ఆహ్లాదకరమైన, అసహ్యకరమైన అనుభవాలు ఎదురవుతాయి. కాగా ఉమెన్ ఫ్రీడమ్, లోన్లీనెస్, డ్రీమ్స్, డిజైర్స్ గురించి చాలా అరుదుగా మాట్లాడే మధ్యతరగతి భారతీయ గృహాల వాస్తవాలను ఈ చిత్రం అత్యంత సహజంగా కళ్లకు కట్టింది. సెమీ అర్బన్ ఇండియాలో పడే సామాజిక బాధలను డైరెక్టర్‌ అద్భుతంగా చిత్రీకరించారు.

* మిర్చ్, వినయ్ శుక్లా (2010, హిందీ)

కెరీర్‌లో బ్రేక్ కోసం కష్టపడుతున్న స్క్రీన్ రైటర్ జర్నీ నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. 'మిర్చ్' అనేది విచిత్రమైన, వాస్తవికమైన మర్యాదలో స్త్రీ లైంగికతకు సంబంధించి సూక్ష్మ నైపుణ్యాలపై దృష్టి సారించే ఒక సెక్స్-కామెడీ. ఈ కథనంలో నాలుగు చిన్న కథలు మిళితమయ్యాయి. ఇది భారతదేశపు ప్రాచీన జానపదమైన 'పంచతంత్రం' నుంచి ప్రేరణ పొందిన భారతీయ శృంగారాన్ని తాకింది. కొంకణా సేన్, సుశాంత్ సింగ్, షహానీ గోస్వామి, ఇతర తారాగణం ప్రధాన పాత్రలు పోషించారు. ఈ కథకు ఉన్న ప్రయోగాత్మక స్వభావం.. 'ఫిమేల్ సెక్సువాలిటీ'ని అన్వేషించడం. అందుకే సంబంధిత అనేక ట్విస్టులతో ఆసక్తికరంగా సాగుతుంది సినిమా.

* సంచారం(ది జర్నీ), లిగీ జె. పుల్లపల్లి(2004, మలయాళం)

ఈ కథనం కేరళలోని ఒక మారుమూల గ్రామంలో జరుగుతుంది. దేశంలోని అనేక ఇతర ప్రాంతాల మాదిరిగా అక్కడ భిన్నమైన వివాహం మాత్రమే చట్టంగా ఉంది. ఈ బలమైన, నిర్బంధ సామాజిక ఫ్రేమ్‌వర్క్‌లో కిరణ్ అనే అమ్మాయి డెలిలా అనే మరో యువతికి అట్రాక్ట్ అవుతుంది. భారతదేశంలోని చాలామంది స్వలింగ సంపర్కుల స్థితి, ఆమోదంపై వెలుగునిచ్చే వివేకవంతమైన సినిమా ఇది. దర్శకుడు పుల్లపల్లి 2004లో ఈ జానర్ సినిమా ద్వారా సాహసోపేతమైన సవాల్‌ను స్వీకరించాడు. మొత్తానికి భారతీయ నిషేధాలను విస్తృతంగా అన్వేషించిన చిత్రాలకు 'సంచారం' ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది. ఈ చిత్ర కథాంశంతో పాటు సినిమాటోగ్రఫీ.. ప్రపంచ సినీ సమాజంలో కొంత అలజడి సృష్టించిందనే చెప్పొచ్చు.

Advertisement

Next Story

Most Viewed