ఇళ్ల ధర పెరుగుదల ర్యాంకింగ్‌లో భారత్‌కు 51వ స్థానం!

by Mahesh |
ఇళ్ల ధర పెరుగుదల ర్యాంకింగ్‌లో భారత్‌కు 51వ స్థానం!
X

దిశ, వెబ్‌డెస్క్: గతేడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో దేశంలోని ఇళ్ల ధరలు 2.1 శాతం పెరగడంతో భారత్ వార్షిక హౌసింగ్ ధరల జాబితాలో 51వ స్థానాన్ని సాధించిందని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్‌ఫ్రాంక్ వెల్లడించింది. 'గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్ క్యూ4-2021' పేరుతో నైట్‌ఫ్రాంక్ సంస్థ నివేదికను విడుదల చేసింది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో భారత్ 56వ ర్యాంకులో ఉండగా, ఈసారి ఐదు స్థానాలు ఎగబాకి 51వ ర్యాంక్ కి చేరుకుంది. 'కోవిడ్-19 మహమ్మారి తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో సానుకూల ప్రభావం కనిపించింది. ఇళ్ల ధరల్లో రికవరీ మెరుగ్గా నమోదైంది.

దీనికి ముఖ్యంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో పాటు విదేశీ మార్కెట్లలో ఉన్న ధరల ద్రవ్యోల్బణ మద్దతు భారత్‌కు లాభించిందని ' నైట్‌ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ అన్నారు. ఇప్పటికీ సొంత ఇంటిని కలిగి ఉండాలనే ప్రజల ధోరణి, సరసమైన ధరలో ఇళ్లు లభించడం, గృహ రుణాలపై వడ్డీ రేటు చారిత్రాత్మక కనిష్టం లో ఉండటంతో రానున్న రోజుల్లో కూడా ఈ రంగం ఊపందుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. గత త్రైమాసికాల్లో ప్రతికూల పరిస్థితుల వల్ల ఇళ్ల ధరలు మోస్తరుగా పెరగడంతో ఈ రంగం వృద్ధి కూడా నెమ్మదిగానే పుంజుకుంటోందన్నారు. ఈ నివేదిక కోసం నైట్‌ఫ్రాంక్ సంస్థ 56 దేశాల నుంచి వివరాలను సేకరించింది.

Advertisement

Next Story

Most Viewed