లక్షలు వెచ్చించారు.. లక్షణంగా వదిలేశారు

by Mahesh |
లక్షలు వెచ్చించారు.. లక్షణంగా వదిలేశారు
X

దిశ, వనస్థలిపురం: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ నుంచి ఎన్జీవోస్ కాలనీ వెళ్లే దారిలో రెడ్ వాటర్ ట్యాంక్, ఈత కొలను, మీసేవ, వార్డు కార్యాలయం చుట్టూ పాద బాట(ఫుట్ పాత్)ను కొన్ని రోజుల క్రితం హడావుడిగా నిర్మించారు. లక్షలు వెచ్చించి దాని నిర్మాణం చేపట్టారు. అయితే అది పూర్తి స్థాయిలో నిర్మించకుండా అరకొరగా పనులతో జీహెచ్ఎంసీ, ఇంజనీరింగ్ అధికారులు చేతులు దులుపుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎటు చూసినా అసంపూర్తిగా వదిలేశారని, దాని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శిస్తున్నారు.

అనువుగా లేదు..

సచివాలయ నగర్ నుంచి ఎన్జీవోస్ కాలనీ వెళ్లేదారిలో బస్టాండ్ ఉంది. దాని ముందు వీధి, చిరువ్యాపారులు కూరగాయలు, పండ్ల సముదాయాలు పెట్టుకుంటారు. అక్కడా, ఆధార్ అనుసంధానం మీ సేవ కార్యాలయం గేట్ల ముందు నిర్మించకుండా వదిలిపెట్టారు. వివిధ అవసరాల కోసం వచ్చిన వాళ్ల కార్లు, ద్విచక్ర వాహనాల పార్కింగ్ కు ఆ స్థలం ఉపయోగిస్తున్నారు. వీటి చుట్టూ అనువైన స్థలం లేక పాద బాట నిర్మించకుండానే గుత్తేదారు సరి పెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు.

లక్షలు వెచ్చించి..

అడుగడుగునా కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, టెలిఫోన్ పోల్స్, సాగర్, కృష్ణ నీటి పైప్ లైన్ గేట్ వాల్స్ అడ్డం ఉన్నా గుత్తేదారు, ఇంజనీరింగ్ అధికారులు పట్టించుకోకుండానే తమ పని చేసుకుంటూ పోయారు. అయితే వీటి చుట్టూ సరిపడా స్థలం, సరైన మార్గం లేనప్పటికీ నిర్మాణ పనులు చేపట్టారని స్థానికులు, చిరువ్యాపారులు ఆరోపిస్తున్నారు. నడవడానికి అనుకూలం కాకపోయినా కట్టారని విమర్శిస్తున్నారు. లక్షలు వెచ్చించి లక్షణంగా వదిలేశారని ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed