ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తున్నారు.. తప్పుడు వాగ్ధానాలు చేసే సీఎం, మంత్రులకు శిక్షేది? : అక్బరుద్దీన్ ఫైర్

by Nagaya |   ( Updated:2022-03-09 13:32:09.0  )
ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తున్నారు.. తప్పుడు వాగ్ధానాలు చేసే సీఎం, మంత్రులకు శిక్షేది? : అక్బరుద్దీన్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : శాసనసభలో నిబంధనలకు విరుద్దంగా వెల్‌లోకి వచ్చిన సభ్యులను సస్పెండ్ చేస్తున్న స్పీకర్... తప్పుడు హామీలు, వాగ్ధానాలను ఇదే వేదికగా ఇచ్చిన ముఖ్యమంత్రి, మంత్రులపై తీసుకున్న చర్యలేంటని మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రశ్నించారు. సభలో ఇచ్చిన ప్రతి హామీకి విలువ, గౌరవం ఉంటుందని, కానీ స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చి దాన్ని పాటించకపోతే ఆయనపైనా, ప్రభుత్వంపైనా స్పీకర్ తీసుకున్న చర్యలేంటని ప్రశ్నించారు. బడ్జెట్ సమావేశాల తొలి రోజున ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ వ్యవహారాన్ని బుధవారం సమావేశాల సందర్భంగా పరోక్షంగా ప్రస్తావించిన అక్బరుద్దీన్, వెల్‌లోకి దూసుకురావడాన్ని కారణంగా భావించి మొత్తం సమావేశాలకు హాజరుకాకుండా సస్పెన్షన్ నిర్ణయాన్ని తీసుకున్నారని గుర్తుచేశారు. కానీ సభ్యులుగా తమకున్న అధికారంతో, ఆవేదనతో సమస్యలను ప్రస్తావిస్తే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన మంత్రులు గాలికొదిలేసినందుకు వారిపై ఏం చర్యలు తీసుకోరా అని నిలదీశారు.

శాసనసభలో సభ్యులు లేవనెత్తే, ప్రభుత్వం ఇచ్చే ప్రతీ అంశం రికార్డుల్లోకి ఎక్కుతుందని, కానీ తెలంగాణ అసెంబ్లీలో మాత్రం దురదృష్టవశాత్తూ ఏళ్ళు గడుస్తున్నా ప్రభుత్వం ఇచ్చిన హామీలు మాత్రం అమలుకు నోచుకోకుండా పోతున్నాయని మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా వేదికగా ఇచ్చే హామీలకు సర్కారు ఇస్తున్న విలువ ఇదేనా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఒక మాట, బడ్జెట్‌లో మంత్రి హరీశ్‌రావు మరొక మాట చెప్తూ ఉంటే దేన్ని నమ్మాలి అని ప్రశ్నించారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా బుధవారం అక్బరుద్దీన్ మాట్లాడుతూ, ఫలక్‌నుమా, గోల్కొండ, చంచల్‌గూడ, హుస్సేని ఆలం క్యాంపస్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి నిధులను మంజూరు చేస్తామని చెప్పి మూడేళ్ళు దాటినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు.

ఇదే అసెంబ్లీ వేదికగా తాను గతంలో లేవనెత్తిన అనేక అంశాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా సమాధానం ఇచ్చి హామీలు ప్రకటించారని, మూడేళ్ళయినా అతీగతీ లేదన్నారు. అసెంబ్లీలో చేసే వ్యాఖ్యలకు, ఇచ్చే హామీలకు విలువ లేదా అని ప్రశ్నించారు. మైనారిటీల సంక్షేమం విషయంలో గతంలో సీఎం ఎన్నో హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. చార్మినార్ పెడస్ట్రల్ ప్రాజెక్టు ఏళ్ళ తరబడి నడుస్తూనే ఉన్నదని, ఇప్పటికీ పూర్తికాలేదన్నారు. హజ్ హౌజ్‌ను కొత్తగా నిర్మించి అన్ని మైనారిటీ సంక్షేమ డిపార్టుమెంట్లను అక్కడకు తరలిస్తామని సీఎం చాలా కాలం కిందటే హామీ ఇచ్చారని, ఇప్పటికీ కదలికే లేదని గుర్తుచేశారు. హజ్ హౌజ్ నిర్మాణం దాదాపుగా కొలిక్కి వచ్చిందంటూ అధికారులు చెప్తున్నారని, కానీ నిజానికి అక్కడ పనులు కూడా మొదలుకాలేదన్నారు.

సభను తప్పుదారి పట్టించే సంప్రదాయం గౌరవం అనిపించుకోదని, మంచి పద్ధతి కాదన్నారు. అప్పుల విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, రిజర్వు బ్యాంకు ద్వారా ఓపెన్ మార్కెట్ బారోయింగ్ పేరుతో వేలాది కోట్ల రూపాయలను అప్పుల రూపంలో సమకూర్చుకుంటూ ఉన్నదని, నిబంధనల ప్రకారం వాటిని కాపిటల్ ఎక్స్ పెండిచర్‌కు మాత్రమే ఖర్చు పెట్టాల్సి ఉంటుందని, కానీ దాన్ని దారి మళ్ళిస్తున్నదని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పథకానికి వైఎస్సార్ హయాంలో ఏ ట్రీట్‌మెంట్‌కు ఎంత ఫీజు అనేది నిర్ణయమైందని, ఇప్పటికీ దాన్ని సవరించలేదని, చివరకు పేదలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. క్రిటికల్ కేర్ యూనిట్‌లో ఒక పేషెంట్‌కు రూ. 4000 మాత్రమే ఆరోగ్యశ్రీ ద్వారా లభిస్తున్నదని, కానీ కార్పొరేట్ ఆస్పత్రులు రూ. 40 వేలు వసూలు చేస్తున్నాయని, సీలింగ్ దాటిపోయిన తర్వాత పేషెంట్లకు వైద్య సేవలకు అంతరాయం కలుగుతున్నదని వివరించారు.

ఉర్దూను రాష్ట్రంలో రెండవ అధికార భాషగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రసంగాన్ని సభ్యులకు ఉర్దూ భాషలో అందించలేదని, చివరకు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదులను ఉర్దూ భాషలో ఇస్తే తీసుకోవడంలేదని అక్బరుద్దీన్ ఆరోపించారు. వక్ఫ్ భూముల పరిరక్షణ విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, ఇటీవల ఈ కారణంగానే ఒక భూమి చేజారిపోయిందన్నారు. మైనారిటీ గురుకుల విద్యా సంస్థలకు కేంద్రం నుంచి నిధులు సక్రమంగా వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడంలో విఫలమవుతున్నదని, వక్ఫ్ నుంచి భూములు ఇచ్చినా గ్రౌండ్ వర్క్ జరగడంలేదన్నారు. ఎస్సీ ఎస్టీలకు సమానంగా మైనారిటీలకు ప్రాధాన్యత కల్పిస్తామని ముఖ్యమంత్రి ఈ సభా వేదికగా చెప్పిన మాటలన్నీ వట్టివేనని తేలిపోయిందన్నారు.

గడచిన మూడేళ్ళలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఒక్క లబ్ధిదారునికి కూడా ఆర్థిక సాయం అందలేదని, సుమారు ఒకటిన్నర లక్ష దరఖాస్తులు ఆమోదానికి నోచుకోకుండా పోతున్నాయన్నారు. రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నట్లు మంత్రి హరీశ్‌రావు తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారని, కానీ కాళోజీ హెల్త్ వర్శిటీ మాత్రం పది కాలేజీలు ఉన్నట్లే చెప్తున్నదని, ఈ రెండింటిలో ఏది కరెక్టు అని ప్రశ్నించారు. టీఆర్ఎస్‌కు తాము మిత్రపక్షమేనని, వచ్చే ఎన్నికల్లోనూ ఇదే స్నేహం కొనసాగుతుందని, కానీ వైఫల్యాలను ఎత్తిచూపడానికి మాత్రం నిర్మాణాత్మకంగా విమర్శలు చేయక తప్పదన్నారు.

Advertisement

Next Story