Governor Tamilisai Soundararajan :గవర్నర్‌కు మరోసారి ఘోర అవమానం.. అడుగడుగునా షాకిస్తున్న అధికార పార్టీ!

by GSrikanth |   ( Updated:2022-04-11 07:04:02.0  )
Governor Tamilisai Soundararajan :గవర్నర్‌కు మరోసారి ఘోర అవమానం.. అడుగడుగునా షాకిస్తున్న అధికార పార్టీ!
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: గవర్నర్ తమిళిసైని రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అవమాన పరుస్తోంది. తనకు తెలంగాణ సర్కార్ ప్రొటోకాల్ పాటించడం లేదంటూ ఇటీవల ఢిల్లీ పెద్దలు, జాతీయ మీడియా ఎదుట స్వయంగా తమిళిసై ఆవేదన వెళ్లగక్కిన విషయం తెలిసిందే. అయినా.. సీఎం కేసీఆర్ సర్కార్ తీరు మారడం లేదనే విమర్శలు వస్తున్నాయి. భద్రాచలంలో నేడు జరిగిన పట్టాభిషేక మహోత్సవంతో పాటు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో గవర్నర్ రెండ్రోజుల పర్యటన ఖరారైంది. సోమ, మంగళ వారాల్లో ఆమె పలు సామాజిక కార్యక్రమాలతో పాటు పూసుకుంట ఆదివాసీ గ్రామంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జిల్లా ఉన్నతాధికారులను గవర్నర్‌కు ప్రొటోకాల్ ఇవ్వకుండా వారిని సెలవుపై పంపించినట్లు సమాచారం.

పట్టాభిషేకంలో కనిపించని ఉన్నతాధికారులు..

శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి హాజరైన తమిళిసై పర్యటన సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులెవరూ హాజరవకుండా ఆమెను అవమాన పరిచారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్, ఐటీడీఏ పీవో గౌతమ్, ఎస్పీ సునీల్ దత్ గవర్నర్ పర్యటనకు రాకుండా డమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. వీరు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 48 గంటల సెలవుపై వెళ్లినట్లు సమాచారం. అంతేకాదు.. భద్రాద్రి రామాలయలంలోని పలు శాఖల హెచ్ఓడీలు కూడా గవర్నర్ పర్యటనకు హాజరు కాకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇటీవల యాదాద్రి పుణ్యక్షేత్రానికి వెళ్లిన తమిళి సైకి ఆలయ పీవో గీతారెడ్డి హాజరు కాకుండా అవమాన పరిచిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే..

ప్రత్యేక రైలు బోగీలో కొత్తగూడానికి..

తెలంగాణ ప్రభుత్వంతో తీవ్ర విభేదాలు కొనసాగుతున్న తరుణంలో భద్రాద్రి జిల్లాలోని పర్యటనకు ఆమె రైలు మార్గం ద్వారా సికింద్రాబాద్ నుంచి కొత్తగూడెం చేరుకున్నారు. మణుగూరు ఎక్స్ ప్రెస్‌కు ప్రత్యేక బోగీ ఏర్పాటు చేసుకుని కొత్తగూడెం వచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా భద్రాచలం చేరుకున్నారు. తాను తెలంగాణలో రైలు, రోడ్డు మార్గం ద్వారానే ప్రయాణించగలనని.. అందరూ అర్థం చేసుకోవాలని తమిళిసై ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story