తలసాని ఇదేంది.. 5 నెలలుగా జీతాల్లేవ్​.. మంత్రి పేషిలో ఫైల్​ పెండింగ్​

by Nagaya |   ( Updated:2022-07-05 23:30:46.0  )

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో గోపాలమిత్రల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. 5 నెలల నుంచి వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రతీ ఏడాది గోపాలమిత్రలను కంటిన్యూషన్ చేయాల్సి రావడంతోనే ఈ సమస్య తలెత్తుతున్నట్టు తెలుస్తోంది. ప్రతీ సంవత్సరం మార్చిలో గోపాలమిత్రలను తెలంగాణ స్టేట్ లైవ్ స్టాక్ డెవలప్ మెంట్ ఏజెన్సీ (టీఎస్ఎల్ డిఏ) కంటిన్యూషన్ చేస్తూ ఉత్తర్వులను విడుదల చేస్తోంది. కానీ ఈ ఏడాది ఇంతవరకూ కంటిన్యూషన్ కు సంబంధించి ఉత్తర్వులు రాకపోవడం, ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ నిధులను ఇవ్వకపోవడంతో గత ఏడాదిలోని ఫిబ్రవరి, మార్చి 2 నెలలు, 2022 ఏడాది లో ఏప్రిల్, మే, జూన్ మాసాలకు చెందిన జీతాలు కలిపి మొత్తం 5 నెలల జీతం ఇంకా గోపాలమిత్రలకు అందలేదు.

ఇదిలా ఉండగా ఈసారి కంటిన్యూటికి సంబంధించిన ఫైల్ మంత్రి తలసాని పేషిలోనే ఉందని టీఎస్ఎల్ డీఏ వర్గాల ద్వారా తెలుస్తోంది. మంత్రి పేషి నుంచి ఫైల్ వస్తే వెంటనే ఈ ఏడాది కంటిన్యుటి రావడంతో పాటు, పెండింగ్ లో ఉన్న జీతాలు కూడా అందనున్నట్టు సమాచారం. గోపాలమిత్రలకు ఇప్పటివరకు పీఎఫ్​, ఇన్సూరెన్స్ కూడా లేకపోవడం గమనార్హం.

5 నెలల పెండింగ్ రూ.5కోట్ల 95లక్షలు..

రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ఎల్ డీఏ, పశుసంవర్ధక శాఖలకు సంయుక్తంగా సుమారు 1400 మందికి పైగా గోపాలమిత్రలు పనిచేస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా వీరికి వేతనాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1400 మంది మిత్రలకు ఒక్కోక్కరికి నెలకు రూ.8,500 చొప్పున టీఎస్ఎల్ డిఏ జీతాలను ఇవ్వాల్సి ఉంది. ఒక్కో నెలకు మొత్తం 1400 మందికి రూ.కోటి 19లక్షలు వెచ్చిస్తుండగా, మొత్తం 5 నెలల బకాయిలు రూ.5కోట్ల 95లక్షలున్నట్టు గోపాలమిత్రల ద్వారా తెలుస్తోంది. పెండింగ్ లో ఉన్నజీతాలు గోపాలమిత్రలకు అందాలంటే 2022 ఏడాదికి కంటిన్యూటి ఉత్తర్వులు వస్తేనే అందనున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫైల్ మంత్రి పేషిలోనే ఉన్నా జాప్యానికి గల కారణాలేంటన్నది తెలియడంలేదు.

మొత్తంగా 5 నెలల నుంచి జీతాల్లేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని గోపాలమిత్రలు వాపోతున్నారు. కనీసం ఫ్యామిలీ ఇన్సూరెన్స్ కూడా లేదని అధికారులు దానిపై దృష్టి సారించాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది జనవరి జీతం కూడా మార్చిలో అందిందని ఓ గోపాలమిత్ర 'దిశ'తో చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం సకాలంలో జీతాలను ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా గోపాలమిత్రలకు సంబంధించి 2022 ఏప్రిల్, మే, జూన్ మాసాల వేతనాలు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని టీఎస్ఎల్ డిఏ అధికారుల ద్వారా తెలుస్తోంది. జీతాలు రాకపోయినప్పటికీ ప్రతీ నెల గోపాలమిత్రలు పూర్తిచేసిన కృత్రిమగర్భధారణకు చెందిన ఎమౌంట్ ను మాత్రం ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు.


జీతానికీ టార్గెట్.. దేవుడు వరమిచ్చినా..పూజారి వరమివ్వలే..

ఏ ఎంప్లాయికైనా నిర్ణయించిన గౌరవ వేతనం ప్రతినెలా వారి ఖాతాల్లో జమకావాల్సి ఉంటుంది. కానీ గోపాలమిత్రల పరిస్థితి మాత్రం 'దేవుడు వరమిచ్చినా..పూజారి వరమివ్వలేదన్న'చందంగా తయారైంది. గోపాలమిత్రలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం 2018లో గౌరవ వేతనం కింద రూ.8,500 ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఆ మేరకు 2018 సెప్టెంబర్ 6న అప్పటి ప్రభుత్వ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఉత్తర్వుల అనంతరం టీఎస్ఎల్ డీఏ జీతానికి టార్గెట్ ను విధిస్తూ మరో ఉత్తర్వును జారీ చేయడం గమనార్హం. ఇందుకు సంబంధించి 2019 డిసెంబర్ 19న టీఎస్ఎల్ డీఏ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం 75శాతం (కృత్రిమ గర్భధారణ) చేసిన వారికి రూ.4,900, 76 నుంచి 85 శాతం చేసిన వారికి రూ.6,100, 86 నుంచి 95 శాతం చేసినవారికి రూ.7,300, 96శాతానికి పైగా చేసిన వారికి రూ.8,500 ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదీ కాక సీజన్ వారీగా టార్గెట్ లను విధిస్తోంది. ప్రస్తుత సీజన్ లో ఒక్కో గోపాలమిత్రకు 50 నుంచి 70కు పైగా కృత్రిమ గర్భధారణలు చేయాలని టార్గెట్ విధించినట్టు తెలుస్తోంది.

2000వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ స్కీంలో పలు దఫాలుగా మార్పులు జరిగి 2005లో వైయస్ రాజశేఖర్ రెడ్డి హాయాంలో వీరికి గౌరవ వేతనం కింద రూ.1,200ఇచ్చారు. అనంతరం 2007లో మరో సారి రూ.2వేలు చేశారు. 2010లో రూ.2,500గా, కిరణ్​ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న హాయాంలో రూ.3,500గా చేయగా 2018లో సీఎం కేసీఆర్ ఒకేసారి 5వేలు పెంచుతూ ఒక్కో గోపాలమిత్రకు రూ.8,500ను ఇవ్వాలని నిర్ణయించారు. కానీ జీతాలు మాత్రం సమయానికి అందకపోగా, ప్రతీ ఏటా కంటిన్యుటి చేయాల్సి రావడంతో క్షేత్రస్థాయిలో రైతులకు సేవలందిస్తున్న గోపాలమిత్రలకు ఆర్ధికంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

Advertisement

Next Story