జీవో 317కు వినూత్న నిరసన.. స్థానికత ప్రశ్నార్థకమైందని ఆవేదన

by Mahesh |   ( Updated:2022-03-27 23:46:19.0  )
జీవో 317కు వినూత్న నిరసన.. స్థానికత ప్రశ్నార్థకమైందని ఆవేదన
X

దిశ, తెలంగాణ బ్యూరో : సుదీర్ఘకాలం తర్వాత జరిగిన రిక్రూట్‌మెంట్‌తో ఉద్యోగాలు పొందినా జీవో 317తో స్థానికత ప్రశ్నార్థకమైందన్న ఆవేదనతో సుమారు వెయ్యికిపైగా నర్సులు జాబ్ వదులుకోడానికి సిద్ధమవుతున్నారు. సుమారు 80 వేలకు పైగా ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయబోయే నోటిఫికేషన్ల ప్రకారం మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఎలాగూ ఉత్తీర్ణత సాధించి ఇంటర్‌వ్యూలలో సెలక్టు అవుతామనే ధీమా ఉన్న సుమారు వెయ్యి మందికి పైగా నర్సులు కొత్త నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. గతేడాది రిక్రూట్‌మెంట్ జరిగినప్పుడు జీవో 317 లేదని, అది వచ్చిన తర్వాత స్థానికతకు భిన్నంగా ఇతర జోన్లు, జిల్లాల్లో పోస్టింగులు వచ్చాయని, కుటుంబానికి దూరంగా బాధలు పడుతున్నామని వాపోతున్నారు.

ఇప్పుడు వెలువడే నోటిఫికేషన్లన్నీ కొత్త జోనల్ సిస్టం ప్రకారం భర్తీ కానున్నందున సొంత జిల్లాల్లోనే రిక్రూట్ అయ్యే అవకాశం ఉందని నర్సులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నర్సులుగా దాదాపు ఆరు నెలలకు పైగా ఉద్యోగాలు చేసుకుంటున్నప్పటికీ కొత్త నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకుంటే సొంత జిల్లాల్లోనే ఉండిపోవచ్చని భావిస్తున్నారు. ఉత్తీర్ణత సాధిస్తామన్న ధీమా ఉన్న వారంతా ప్రస్తుత ఉద్యోగానికి సెలవులు పెట్టి కొత్త నోటిఫికేషన్ ద్వారా నిర్వహించే పరీక్షకు సిద్ధం కావాలనుకుంటున్నారు. అంచనాలు తారుమారై సెలెక్ట్ కాకపోతే ఇప్పుడు చేసుకుంటున్న ఉద్యోగంలోనే కొనసాగడానికి ఎలాగూ వెసులుబాటు ఉంటుందనే భావనతో ఉన్నారు.

కొత్త నోటిఫికేషన్‌ ప్రకారం నర్సు పోస్టులకు సెలక్టు అయితే పాత ఉద్యోగానికి రాజీనామా చేయాలనుకుంటున్నారు. వీటిని భర్తీ చేయడానికి మళ్ళీ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టాల్సి ఉంటుంది. జీవో 317 తెచ్చిన తంటాలతో నర్సులు ఈ దిశగా ఆలోచిస్తున్నారు. ఈ తరహాలో ప్రభుత్వానికి నర్సులు నిరసన తెలియజేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed