Gautam Adani: ప్రపంచ కుబేరుల జాబితాలో దూసుకెళ్తున్న అదానీ! ఫోర్బ్స్ ర్యాంకులో నాలుగో స్థానం

by Harish |   ( Updated:2022-07-19 10:25:27.0  )
Gautam Adani Gains Worlds fourth Richest Rank On Forbes List
X

న్యూఢిల్లీ: Gautam Adani Gains World's fourth Richest Rank On Forbes List| దేశీయ అత్యంత సంపన్నుడు, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో మరింత వేగంగా దూసుకెళ్తున్నారు. ఫోర్బ్స్ తాజా జాబితా ప్రకారం, మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను అధిగమించి గౌతమ్ అదానీ ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నారు. ఇటీవల బిల్‌గేట్స్ గేట్స్ ఫౌండేషన్‌కు 20 బిలియన్ డాలర్లను విరాళంగా ప్రకటించడంతో ఆయన కొంత వెనుకబడ్డారు.

తాజా ఫోర్బ్స్ రియల్‌టైమ్ ర్యాంకుల్లో గౌతమ్ అదానీ నాలుగో స్థానానికి చేరుకోవడంతో ఆయన కుటుంబం మొత్తం సంపద సుమారు 114 బిలియన్ డాలర్లు(రూ. 9.10 లక్షల కోట్ల)కు పెరిగిందని ఫోర్బ్స్ తెలిపింది. బిల్‌గేట్స్ సంపద 102 బిలియన్ డాలర్లతో ఐదో స్థానానికి జారారు. ఇక, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా అధినేత ఎలన్ మస్క్ 230 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా, రెండో స్థానంలో బెర్నార్డ్ ఆర్నాల్ట్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మూడో స్థానంలో ఉన్నారు.

భారత దిగ్గజ రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ 88 బిలియన్ డాలర్ల(రూ. 7 లక్షల కోట్ల)తో పదో స్థానంలో ఉన్నారని ఫోర్బ్స్ పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆసియా సంపన్నుడిగా ముఖేష్ అంబానీ స్థానాన్ని గౌతమ్ అదానీ అధిగమించిన సంగతి తెలిసిందే. 2021 నుంచి గౌతమ్ అదానీ సంపద రెట్టింపు కంటే అత్యధికం కావడం గమనార్హం.

ఇది కూడా చదవండి: దోమల సహాయంతో దొంగను పట్టుకున్న పోలీసులు

Advertisement

Next Story