కేసీఆర్ లాంటి చరిష్మ ఉన్న లీడర్ తెలంగాణలో మరొకరు లేరు: MLC

by Gantepaka Srikanth |
కేసీఆర్ లాంటి చరిష్మ ఉన్న లీడర్ తెలంగాణలో మరొకరు లేరు: MLC
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎల్కతుర్తి సభ కాంగ్రెస్ పార్టీకి కేవలం ట్రైలర్ మాత్రమే అని.. ఈ సభ రేవంత్ పాలనపై రెఫరండం లాంటిదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ కుమార్ అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు రేవంత్ వైపు లేరని మరోసారి రుజువైందన్నారు. కేసీఆర్‌పై ప్రజలకు అచంచలమైన విశ్వాసం ఉందన్నారు. ఎల్కతుర్తి సభ బాహుబలి లాంటి సభ అని పేర్కొన్నారు. ఎండ సైతం లెక్క చేయకుండా తరలివచ్చారని చెప్పారు. గత సభలన్నింటినీ తలదన్నేలా ఎల్కతుర్తి సభ జరిగిందని తెలిపారు. కేసీఆర్ లాంటి చరిష్మ ఉన్న లీడర్ తెలంగాణలో ఇంకొకరు లేరన్నారు. పోలీసుల స్వయంగా టిప్పర్లు, లారీలు అడ్డం పెట్టించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని.. సభ పక్కన లాఠీ‌చార్జ్ చేశారని.. రేవంత్‌రెడ్డి దుర్మార్గపు పాలనకు ఇది రిఫరెన్స్‌లాంటిదని చెప్పారు. సభలో రేవంత్‌రెడ్డి పేరు ఎత్తలేదని అన్నం తినకుండా పడుకున్నాడంట అని ఎద్దేవా చేశారు. నలుగురు మంత్రులనను బీఆర్ఎస్ పార్టీపై పురిగొల్పారని ఆరోపించారు.

యూపీఏ తెలంగాణ ఇచ్చినంత మాత్రాన.. రాష్ట్రానికి ఆ పార్టీ చేసిన పాపాలు పోతాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ తెలంగాణకు నంబర్ వన్ విలన్ అని కేసీఆర్ అనడంలో తప్పేమి లేదన్నారు. బీఆర్ఎస్ సభ సక్సస్ తర్వాత మంత్రులు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదని.. రేవంత్ సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్‌ను మాట్లాడారని పేర్కొన్నారు. రానున్న మూడున్నర సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ భరతం పడుతుందని హెచ్చరించారు. ఆరు గ్యారంటీలను వంద రోజులలో అమలు చేస్తామని చెప్పిన సీఎం, మంత్రులు అంబేద్కర్ విగ్రహం దగ్గర చెంపలేసుకుంటారా అని ప్రశ్నించారు. ఒక్క గ్యారెంటీ అయినా రాష్ట్రంలో అమలు చేస్తున్నారా అని నిలదీశారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా లేక అనుముల రాజ్యాంగం నడుస్తుందా..? అని అడిగారు. మాజీ నక్సలైట్, రాష్ట్ర మంత్రి సీతక్క, నక్సలైట్ల హక్కుల కోసం, ధర్మం కోసం మాట్లాడిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పాలన్నారు. రాష్ట్రం ఎందుకు కుదిలైందో పొంగులేటి సమాధానం చెప్పాలన్నారు. మంత్రుల మధ్య సమన్వయం లేదని ఆరోపించారు.



Next Story