చనిపోయిన ఆడ ఈగలతో మగఈగల సంపర్కం!

by Manoj |
చనిపోయిన ఆడ ఈగలతో మగఈగల సంపర్కం!
X

దిశ, ఫీచర్స్ : ఏ జీవికైనా ఫంగస్ సోకడం సర్వసాధారణం. గాలి, మట్టి, నీరు, మొక్కలపైనే కాకుండా కొన్ని శిలీంధ్రాలు మానవ శరీరంలోనూ నివసిస్తాయి. వీటిలో సగం మాత్రమే హానికరం కాగా కొన్ని ప్రాణాలను కూడా హరించగలవు. అలాంటి ఓ డేంజరస్ ఫంగస్ సోకితే ఆడ ఈగలు చనిపోతాయి. విచిత్రం ఏమిటంటే.. ఈ ఫంగస్ చనిపోయిన ఆడఈగల శరీరాలతో మగ ఈగలు జతకట్టేలా చేస్తుందని శాస్త్రవేత్తల బృందం ప్రకటించింది. ఈ వ్యూహం ఆ ఫంగస్ మనుగడ కొనసాగేందుకు సాయపడుతుందని పేర్కొంది.

ఈగలపై ఫంగస్ ప్రభావం తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్ కోపెన్‌హాగన్, స్వీడిష్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ పరిశోధకులు సంయుక్తంగా హౌస్‌ ఫ్లైస్(మస్కా డొమెస్టికా) జనాభాను గమనించారు. వీటిలో ఆడ ఈగలు 'ఎంటోమోఫ్తోరా మస్కే'గా పిలువబడే పారాసైట్ ఫంగస్‌ బారినపడ్డాయి. దీంతో 'ఎంటోమోఫ్తోరా మస్కే' శిలీంధ్రం హోస్ట్ అయిన ఆడ ఈగ శరీరాన్ని మెల్లిగా ఆక్రమించి సుమారు ఆరు రోజుల తర్వాత పూర్తిగా స్వాధీనం చేసుకుంటుంది. దీని ప్రేరణతో ఆ ఈగలు తమ సమీప పరిసరాల్లోని ఎత్తయిన ప్రదేశానికి లేదా ఎత్తయిన వృక్షాలపైకి చేరుకుని అక్కడే ప్రాణం కోల్పోతాయి. ఇలా ఫంగస్.. జోంబీ ఆడ ఈగను చంపినప్పుడు, అది సెస్క్విటెర్పెనెస్ అనే రసాయన సంకేతాలను విడుదల చేస్తుంది.

'ఈ రసాయన సంకేతాలు మగ ఈగలను ఆకర్షించేందుకు 'ఫెరోమోన్స్'గా పనిచేసి, నిర్జీవమైన ఆడ కళేబరాలతో జతకట్టేలా విపరీతమైన కోరికను కలిగిస్తాయి. దీంతో శిలీంధ్ర బీజాంశాలు మేల్‌లోకి సంక్రమించి వ్యాపిస్తాయి. ఈ విధంగా ఎంటోమోఫ్తోరా మస్కే తన బీజాంశాలను వ్యాప్తి చేస్తూ మనుగడను కాపాడుకుంటుంది. ఫ్లై ప్రవర్తనను ట్రాక్ చేయడం వల్ల చనిపోయిన ఆడ ఈగలు సమయం గడిచేకొద్దీ మరింత ఆకర్షణీయంగా మారతాయి. కాలక్రమేణా ఫంగల్ బీజాంశాల సంఖ్య పెరగడమే ఇందుకు కారణం కాగా ఇది సెడక్టివ్ సువాసనలను పెంచుతుందని పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.

'ఇది ఫంగస్ జాతుల ఉద్దేశపూర్వక వ్యూహమని మా పరిశీలనలు సూచిస్తున్నాయి. ఈ శిలీంధ్రాలు మానిప్యులేషన్‌కు నిజమైన మాస్టర్స్‌గా చెప్పవచ్చు. ఇది చాలా ఆకర్షణీయమైన పద్ధతిని ఫాలో అవుతోంది' అని పరిశోధకులు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed