రైతును 'బత్తాయి'లా పిండుకుంటున్న వ్యాపారులు

by Nagaya |
రైతును బత్తాయిలా పిండుకుంటున్న వ్యాపారులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆ మార్కెట్లో పండ్లకు కమీషన్ చెల్లించాల్సిందే. తీసుకొచ్చిన వాటికి మాత్రం వ్యాపారులు వేసే వేలం పాటలోనే అమ్ముకోవాలి.. లేకుంటే రైతులకు నిరీక్షణే. అయినా ఆ మార్కెట్ అధికారులు మాత్రం చూసిచూడనట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. ఒక వేళ తీసుకొచ్చిన వాటిని మార్కెట్లో అమ్మితే లక్షకు 10వేల రూపాయలను చెల్లిస్తుండటంతో రైతన్న నిలువుదోపిడీకి గురవుతున్నాడు. నెలల తరబడి చేసిన కష్టం కూడా రాకపోవడంతో లోలోన మదన పడుతున్నాడు.

ఏ పంటను పండించాలన్నా... ఏ కాయను అయినా పండించాలన్నా నెలల తరబడి రైతన్న కష్టం చేయాల్సిందే. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టాల్సింది. అయితే ఎకరాకు సుమారు రూ.40వేల వరకు ఖర్చుచేసి బత్తాయి సాగుచేస్తే అమ్మితే అంత ఆదాయం రావడం లేదు. కాయతెంచడం, ట్రాన్స్ పోర్టు చార్జీలు, కూలీల ఖర్చు సైతం అదనంగా భారవుతోంది. తీరా మార్కెట్ కు వెళ్లే అక్కడ వ్యాపారులు ఎంత పాట పాడితే అంతకు అమ్మాల్సిందే. లేకుంటే తెంచిన కాయ అమ్ముడుపోకపోతే తీవ్ర నష్టం జరుగుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఇతరులు వచ్చి చిల్లరగా కొనుగోలు చేసే అవకాశం ఉండదు. కొత్తపేట పండ్ల మార్కెట్ ను పోచంపల్లి సమీపంలోని కొత్తగూడెంకు తరలించిన విషయం తెలిసిందే. పాత మార్కెట్ గ్రేటర్ లో ఉండటంతో చిల్లర వ్యాపారులు సైతం రైతుల నుంచి కొనుగోలు చేసేవారు. వచ్చిన దాంట్లో సుమారు 80శాతం స్థానికంగా అమ్ముడు పోయేది. అయితే మార్కెట్ ను కొత్తగూడెంకు తరలించడంతో టోకు వ్యాపారులు తగ్గారు. గతంలో 371 మంది ఏజెంట్లు ఉన్నట్లు సమాచారం. అయితే అందులో 150 మంది మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో వ్యాపారులు ఎంతపడితే అంతకు బత్తాయి రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి. కాయ నాణ్యతతో ఉన్నప్పటికీ సుమారు టన్ను 45 నుంచి 46వేలు మాత్రమే అమ్ముడు పోతుండటంతో రైతు పరిస్థితి దారుణంగా మారింది. అసలే ఈ ఏడాది కాపు సైతం తక్కువగా రావడంతో రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వేలం పాటద్వారానే అమ్మకాలు జరుగుతుండటంతో గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లక్షకు రూ.10వేలు కమీషన్

పండ్ల రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం క్రయ విక్రయాలకు మార్కెట్ సదుపాయం కల్పించింది. అయితే మార్కెట్ కు వచ్చిన రైతు ముందుగానే వే బ్రిడ్జీ ద్వారా ఎంత బత్తాయిని తీసుకొస్తున్నాడని వేయిస్తారు. వాటిని మార్కెట్లో పోసి దానికి ఒక పలకపై ఎన్ని క్వింటాళ్లు అని రాసి ఉంచుతున్నారు. దీంతో వ్యాపారులంతా వచ్చి వేలం పాట వస్తారు. వారి నోటికి ఎంతవస్తే అంత పాడుతారు. ఆ రోజు మార్కెట్ ను బట్టి ధరను నిర్ణయించాల్సి ఉంటుంది కానీ అలాకాకుండా వేలంపాట వేస్తుండటం గమనార్హం. ఇదిలా ఉంటే రైతుకు లక్ష రూపాయలు వస్తే అందులో మార్కెట్ ఫీజు అని, ఇతర ఫీజులు అని రూ.10వేలు కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో తోచడం లేదని మనోవేధనకు గురవుతున్నారు రైతులు.

టన్నుకు 100కేజీలు తీసివేత...

మార్కెట్ కు వచ్చిన రైతులను వ్యాపారులు(కమిషన్ ఏజెంట్లు) సైతం నిలుపుదోపిడీ చేస్తున్నారు. టన్నుకు 100 కేజీలు తీసివేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వచ్చేది తక్కువ.. అందులో కమిషన్ అంటూ... మరో పక్క 100 కేజీలు తీసివేస్తుండటంతో తమకు ఏమీ మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా జరుగుతున్న మార్కెట్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి దోపిడీని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మార్కెట్లో మౌలిక వసతులు అంతంతే...

గ్రేటర్ కు 30 కిలో మీటర్ల దూరంలో పండ్ల మార్కెట్ ను ఏర్పాటు చేశారు. అయితే అక్కడ మౌలిక వసతులు కల్పించడంలో మాత్రం విఫలమవుతూనే ఉన్నారు. తాత్కాలికంగా టాయిలెట్స్, వాటర్ సదుపాయం కల్పించారు కానీ ఇతర మౌలిక వసతులు లేకపోవడం, షెడ్లు సైతం సరిపడే విధంగా లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. భోజనసదుపాయం లేక పడరాని పాట్లు పడుతూ.. కిలో మీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమీషన్ పై ఉన్న శ్రద్ధ వసతులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. వ్యాపారులు సైతం మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటున్నారు.

కమీషన్ తీసివేయాలి

ఎకరాకు రైతు దగ్గర రూ.52వేలు పెట్టి బత్తాయి తోటను పట్టాను. ట్రాన్స్ పోర్టు చార్జీ రూ.25వేలు అయింది. గడ్డికి రెండువేలు, అన్ లోడ్ కు రూ.1600 కూలీలకు ఇచ్చాను. మొత్తం 9 టన్నుల 520 కిలోలు తీసుకొచ్చాను. టన్నుకు రూ.46 వేలకు పాటపడారు. అసలు వచ్చింది తక్కువ. దీనికి తోడు లక్షకు రూ.10వేలు కమీషన్ కట్ చేయడంతో మిగిలే పరిస్థితి లేదు. దీంతో పెట్టుబడి మిగలడం లేదు. మార్కెట్ లో కమిషన్ తీసివేసి ఆదుకోవాలి.

-అప్పస్వామి, కౌలురైతు, బత్తలపల్లి, అనంతపురం

టన్నుకు క్వింటా తరుగు తీస్తున్నారు

కొత్తపేట మార్కెట్ కు తీసుకొస్తే కొంత రవాణా చార్జీలు తగ్గేది. ఇప్పుడు అక్కడి నుంచి కొత్తగూడెంకు తీసుకురావడంతో ట్రాన్స్ పోర్టు చార్జీ పెరిగింది. అసలే గిట్టుబాటు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో టన్నుకు 100 కేజీలు తీసివేస్తున్నారు. అధికారులు స్పందించి 100 కేజీలు తీయకుండా చర్యలు చేపట్టాలి. బత్తాయి రైతుల సంక్షేమానికి పాటుపడాలి. దీనికి తోడు షెడ్లను సైతం పెంచాలి.

-నగేష్, ఐజ గ్రామం, జోగుళాంబ గద్వాల

Advertisement

Next Story

Most Viewed