- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ వివాదంలో చిక్కిన టూరిజం ఎండీ
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్‌కు లోకాయుక్త నోటీసు జారీ చేసింది. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ ఆధారంగా పదోన్నతి పొందారంటూ దాఖలైన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని పై నోటీసు జారీ చేసింది. జూలై 8వ తేదీ లోగా సమగ్ర వివరాలను సమర్పించాలని రిజిస్ట్రార్ విజేందర్ గత నెల 28న ఆదేశాలు జారీ చేశారు. సమైక్య రాష్ట్రంలో టూరిజం కార్పొరేషన్‌లో 1988లో అసిస్టెంట్ మేనేజర్‌గా చేరారని, విధుల్లో చేరుతున్న సమయంలో కేవలం పాలిటెక్నిక్ సర్టిఫికెట్ మాత్రమే ఉన్నదని, ఆ తర్వాత డిగ్రీ పట్టాను సమర్పించి మేనేజింగ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారని ఫిర్యాదులో గోపాల్ అనే న్యాయవాది పేర్కొన్నారు. ముంబాయికి చెందిన ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ ఇండియా సంస్థలో 2006-10 మధ్యకాలంలో బీ.టెక్ (మెకానికల్) పూర్తి చేసినట్లు సర్టిఫికెట్ సమర్పించారని, కానీ ఆ సంస్థ ఇచ్చే సర్టిఫికెట్ డిగ్రీకి సమానమైనది కాదని, కేవలం డిప్లొమాకు మాత్రమే సరిపోతుందంటూ గతంలో సుప్రీంకోర్టు కూడా వెల్లడించిందని పేర్కొన్నారు.
గతేడాది డిసెంబరు 30న లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో దానిపై గత నెల 25న విచారించింది. టూరిజం శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నందున ఉన్నత విద్య కోసం సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్స్ లోని నిబంధనల ప్రకారం ఉన్నతాధికారుల (ప్రభుత్వం) నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, కానీ ఎలాంటి అనుమతి తీసుకోలేదని పేర్కొన్నారు. ఇన్‌స్టిట్యూషన్‌లో కోర్సు పూర్తి చేసిన తర్వాత ఏఐసీటీఈ గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి విధిగా మూడు నెలల పాటు ప్రాక్టికల్ ట్రెయినింగ్ పొందాల్సి ఉంటుందని, కానీ మనోహర్ సర్వీసు రిజిస్టర్‌లో అలాంటివేవీ లేవని గుర్తుచేశారు. కనీసం సెలవు కూడా పెట్టలేదని పేర్కొన్నారు.
ఫిర్యాదులో పేర్కొన్న అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న లోకాయుక్త మనోహర్ తన డిగ్రీ విద్యార్హతలకు సంబంధించిన అన్ని వివరాలను, పరీక్షకు అటెండ్ అయిన హాల్ టికెట్, మార్కుల జాబితా తదితరాలన్నింటినీ జూలై 8వ తేదీలోగా సమర్పించాలని విజేందర్ ఆ నోటీసులో స్పష్టం చేశారు.