దాచి పెడితే కిక్కేముంది.. దానం చేస్తేనే అసలైన కిక్కంటున్న బాబాయ్

by Satheesh |
దాచి పెడితే కిక్కేముంది.. దానం చేస్తేనే అసలైన కిక్కంటున్న బాబాయ్
X

దిశ, కొత్తగూడెం: వేసవికాలం వచ్చిందంటే చాలు చల్లని మంచినీరు, మజ్జిగ కోసం ప్రాణం తహతహలాడుతోంది. అసలే ఈ ఏడాది ప్రారంభం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ప్రజలు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. అయితే, వేసవి కాలం ప్రారంభం కాగానే మనకు.. చలివేంద్రాలు దర్శనమిస్తాయి. దాహం వేసిన వారు అక్కడకు వెళ్లి దప్పిక తీర్చుకుంటారు. ఇందుకు భిన్నంగా కొత్తగూడెం నియోజకవర్గంలో మనుషుల వద్దకు చలివేంద్రం వస్తుంది. ఇది ఎలా అనుకుంటున్నారా.. అయితే వివరాల్లోకి వెళదాం. మానవసేవే మాధవ సేవ అని భావించే చిట్టిపల్లి దుర్గారావు తన మోటార్ సైకిల్‌పై ప్రజలకు ఎండకాలంలో చల్లని మజ్జిగ అందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

చుంచుపల్లి మండలం బాబు క్యాంప్‌లో నివాసం ఉంటున్న దుర్గారావు రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి. 2015లో ఉత్తమ కార్మిక అవార్డు సైతం అందుకున్నారు. సింగరేణి నుండి తనకు వచ్చే 10,000 రూపాయల పెన్షన్‌తో పాటు పాత ఇనుప పనిముట్లకు సాన పెడుతూ అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుని అలా వచ్చిన మొత్తాన్ని వేసవికాలంలో మొబైల్ చలివేంద్రం, మిగతా సమయాల్లో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ అరవై పదుల వయసులో అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సంపాదించింది దాచి పెడితే కిక్ ఏముంది బాబాయ్.. దానం చేస్తేనే అసలైన కిక్కు వస్తుంది అంటూ తనదైన శైలిలో సమాధానం చెబుతున్నారు. ఎవరైనా దాతలు ముందుకు వస్తే దాత పేరును వాహనానికి ఉన్న బోర్డుపై పేరు రాసి ఆయన అందించే ప్రతి మజ్జిగ గ్లాసుకి వారి పేరు పలుకుతూ తనదైన రీతిలో సర్వీస్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed