ఆ వంశస్తుల్లో మగపిల్లోడు పుడితే కర్ర దెబ్బలు తినాల్సిందే..

by Vinod kumar |
ఆ వంశస్తుల్లో మగపిల్లోడు పుడితే కర్ర దెబ్బలు తినాల్సిందే..
X

దిశ, కారేపల్లి: సరదాగా సాగే సంప్రదాయ వేడుక డూండ్‌ను బంజారా తెగలోని భూక్యా, లాకావత్‌, తేజావత్‌, వడిత్యా వంశస్థుల కుటుంబాల్లో చేస్తుంటారు. ఈ కుటుంబాల్లో మగ పిల్లవాడు పుట్టితే ఆ ఏడాది జరిగే హోళీ పండుగ రోజు డూండ్‌ ఉత్సవం ఆడాల్సిందే. హోళీకి ముందు నుండే ఈ వేడుకకు అంకురార్పణ చేసి.. 9 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ డూండు వేడుకలో బావ, బామర్ధి వంటి వరసైన వారు బంజారా మహిళల చేతి బరికెల(కర్ర) దెబ్బ రుచి చూడాల్సిందే.


భార్య, మరదళ్లు, వదినల చేతిలో మగవారు ఆనందంగా దెబ్బలు తినడం ఈ వేడుక ప్రత్యేకత. ముఖ్యంగా హోలీ ముందు రోజు నుండి మూడు రోజులు గ్రామంలో వేడుక సందడి ఉంటుంది. డూండ్‌ ఉత్సవం నిర్వహించకుంటే పిల్లావాడు పుట్టిన కుటుంబంలో అనార్ధాలు జరుగుతాయని ఈతెగలో నమ్మకం. వేడుక తొమ్మిది రోజుల్లో ముఖ్యమైనవి మూడు రోజులు. ఈ వేడుక మొదటి రోజు కామదహనంతో మొదలెడతారు. ప్రత్యేకంగా తయారు చేసిన కాముడి బొమ్మను దహనం చేస్తారు. దానిలో ఇనుపరింగులు ఉంచుతారు. కాముడి దహనంతో ఆడ మగ రంగులు చల్లుకొని, బంజారా నృత్యాలతో సందడిగా గడుపుతారు.

ఆట పాటలతో డూండ్‌ వేడుక..


డూండ్‌లో రసవత్తమైన ఘటం హోలీ రోజు సాగుతుంది. ఆరోజు గ్రామంలో సందడే సందడి. వేడుక నిర్వహించే ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ధ్వజస్తంభం పక్కనే పాతిన కర్రలకు నైవేద్యంగా ఉంచిన ఆహార పదార్థాలు కల్గిన గంగాళం, బిందెల కట్టి ఉంచుతారు. వీటి చుట్టూ బంజారా మహిళలు పచ్చి బెత్తాలు (కర్రలు)చేబూని దరువు అనుగుణంగా పాటలు, నృత్యాలతో మూడంచెలుగా కాపలా కాస్తుంటారు. మగవారు ధైర్యం చేసి కాపలా ఉన్న మహిళలను దాటుకొని గంగాళం, బిందెలను బయటకు తీసుకరావటం డూండ్‌లో ప్రధాన ఘట్టం. బిందెలను తీసుకవచ్చే సమయంలో మహిళల బెత్తం దెబ్బలు, తిట్లు మగవారు తినాల్సిందే, చితక కొట్టిన దెబ్బ తగిలిన మహిళలను ఏమి అనకూడదు.


మగవారు చేతిలో కర్రలు ఉంటాయి కానీ అవి మహిళలు కొట్టె దెబ్బల నుండి కాపాడుకోవడానికే వాడాలి. ఇలా మధ్యలో ఉన్న గంగాళం, బిందెలు మహిళల కాపలా ఉన్న ప్రాంతం నుండి బయటకు వచ్చే వరకు జరుగుతుంది. ఇదే సందర్భంలో మగవారు వరుసైన ఆడవారిని ఎత్తుకొని బయటకు తీసుకురావడం, ఆడవారు వీరిని బెత్తాలతో బాదటం చూస్తే సరదా అనిపిస్తుంది. మహిళల మధ్యలో ఉన్న నైవేద్యం ఉన్న బిందెలను తీసుకవచ్చిన వారు ఆ ఏడాది ధైర్యవంతుడిగా కీర్తించబడతారు. అనంతరం ఆ గంగాళం, బిందెలలోని ప్రసాదాన్ని మగ, ఆడ అందరూ కలిసి ఆరగిస్తూ సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆనందిస్తారు. ఈ కార్యక్రమాన్ని గేరియాలు (కులపెద్దలు) పర్యవేక్షిస్తుంటారు.

సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న సామ్యాతండా ప్రపంచీకరణతో ఆధునిక పోకడలకు అలవాటు పడిన యువత కూడా హోలీ రోజు జరిగే డూండ్‌ మాత్రం తప్పని సరిగా హాజరవుతుంటారు. బంజారా సంస్కృతి, సంప్రదాయాలను రాబోయే తరాలకు పరిచయం చేయాలని ఉద్దేశంతో కారేపల్లి మండలం సామ్యా తండా వాసులు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.


ఈ ఏడాది భూక్యా నందులాల్‌ కుటుంబంలో మగపిల్లవాడు అద్వేత్‌ నాయక్‌ పుట్టటంతో పిల్లవాడి తల్లిదండ్రులు భూక్యా నందులాల్‌-దీప్తి దంపతులు ఈ వేడుకను జరిపారు. బంజరా కుల పెద్దలు ధరావత్‌ భద్రు నాయక్‌, వాంకుడోత్‌ సామ్య నాయక్‌, భూక్యా రాములు నాయక్‌, యువకులు, పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story