- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీఓ 111 రద్ధుపై భిన్నాభిప్రాయాలు.. మూర్ఖపు చర్య అని మండిపాటు
దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన జీఓ 111 రద్ధుపై భిన్నాభిప్రాయాలు వినబడుతున్నాయి. ఆ జీఓ పరిధిలో స్థలాలు ఉన్న వారు సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనను స్వాగతిస్తుండగా ఇతర ప్రజలు మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భాగ్యనగరం పరిధిలో నివాసముంటున్న ప్రజలకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ల నుండి మంచినీరు అందకుండా చేసి క్రమంగా భూములను అమ్మేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని మండిపడుతున్నారు. ఈ జలాశయాల పరిరక్షణకు గాను వీటిని అనుసరించి పది కిలోమీటర్ల మేర కాలుష్య కారక పరిశ్రమలు, బహుళ అంతస్థులతో కూడిన హోటళ్లు, కాలనీలు, కాలుష్య కారక నిర్మాణాలను నిషేధిస్తూ 1994 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం 192 జీఓను అమలులోకి తెచ్చింది. రెండేళ్ల తర్వాత 1996 మార్చి 8న దీనికి కొన్ని సవరణలు చేస్తూ 111ను అమలులోకి తీసుకొచ్చింది.
జీఓ ఏం చెబుతోంది
జీఓ నెంబర్ 111 పరిధిలో జీ ప్లస్ 2 కి మించి నిర్మాణాలు చేపట్టడం పూర్తిగా నిషేధం. జీఓ పరిధిలోని భూములలో చేసే లేఅవుట్లలో 60 శాతం ఓపెన్ స్థలాలు, రోడ్లకు వదిలి పెట్టాలి. రసాయనాలు, క్రిమిసంహారకాల స్థాయిలు లెక్కించేందుకు ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలి. వినియోగించే భూములలో 90 శాతం పరిరక్షణ కోసం కేటాయించాలి. దీనిని హైదరాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథార్టీ పర్యవేక్షించాలి. ఇలా కఠిన నిబంధనలు అమలులో ఉండడంతో జీహెచ్ఎంసీ పరిధిలో రియల్ ఎస్టేట్ బూమ్ జోరుగా నడుస్తున్నప్పటికీ జీఓ పరిధిలో ఉన్న భూములకు అంతగా ధరలు పలకలేదు. స్థలాలు క్రయ, విక్రయాలు చాలా వరకు నిలిచిపోయాయి. దీంతో జీఓ పరిధిలోని 84 గ్రామాలలోని భూముల యజమానులు చాలా ఏండ్లుగా దీనిని రద్ధు చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
నిబంధనలు బేఖాతరు
జీఓ నెంబర్ 111 పరిధిలో చేసే నిర్మాణాలపై పలు రకాల ఆంక్షలు ఉన్నప్పటికీ వీటన్నింటిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు తుంగలో తొక్కి నిర్మాణాలు చేపట్టారు. సుమారు 50కి పైగా ఇంజనీరింగ్ కాలేజ్ లు, రెండు వేలకు పైచిలుకు ఫాంహౌజ్ లు, పది వేలకు పైగా అక్రమ నిర్మాణాలు ఉండవచ్చని అంచనా. ఇప్పటికే జీఓ పరిధిలోని చాలా భూములు బడాబాబుల చేతులలో ఉన్నాయి. వీరంతా జీఓ 111 రద్ధు కోసం రెండు దశాబ్ధాలుగా ఎదురు చూస్తున్నారు. ఇదే జరిగితే ఆయా భూముల విలువ లెక్కకట్టలేని విధంగా పెరిగిపోయే అవకాశం లేకపోలేదు. అయితే నగర ప్రజలు మాత్రం జీఓను రద్ధు చేయకుండా దాంట్లో సవరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. జీఓ పరిధిలో ఉన్న గ్రామాల పరిధి తగ్గించండం ద్వారా చాలా మంది రైతులకు, భూ యజమానులకు మేలు జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఎన్నో సంవత్సరాలుగా హైదరాబాద్ మహా నగర ప్రజలకు మంచినీరు అందిస్తున్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లను కాపాడిన వారవుతారని ప్రభుత్వానికి సూచిస్తున్నారు.
జీఓ రద్ధు చేస్తే వరద ముప్పు
గత రెండేళ్లుగా వర్షాకాలంలో జీహెచ్ఎంసీ ప్రజలను వరదలు వెంటాడుతున్నాయి. సుమారు 20కి పైగా సెంటీమీటర్ల వర్షాపాతం నమోదై వేలాది కాలనీలు నీట మునిగాయి. కోట్ల రూపాయల ఆస్తి నష్టం చోటు చేసుకుంది. దీనికంతటికీ వరద నీరు సజావుగా వెళ్లేందుకు దారి లేకపోవడమేనని అధికారులు సైతం తేల్చారు. హైదరాబాద్ నగరం చుట్టూ ఇలాంటి పరిస్థితులు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుండగా జీఓ 111ను రద్ధు చేస్తే ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న భూములలో నూతన నిర్మాణాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో నూతన కాలనీలు ఏర్పడి వరద నీరు సజావుగా వెళ్లలేక ఇంకా వరద ముంపు ప్రమాదం అధికంగా ఉంటుందని, ప్రభుత్వ నిర్ణయానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) అనుమతులు ఇవ్వరాదని గ్రేటర్ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రభుత్వ ముర్ఖపు చర్య: నూకల ఆదినారాయణ రెడ్డి, ఎల్బీ నగర్
గండిపేట, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలు, హైదరాబాద్, సికింద్రాబాద్ వాసులకు దశాబ్దాల తరబడి ప్రధాన తాగునీరు అందిస్తున్నాయి. వీటిని కాపాడేందుకే నాడు ప్రభుత్వం అక్రమ నిర్మాణాలను నిరోధించేందుకు కొన్ని షరతులు విధిస్తూ జీఓ 111ను జారీ చేసింది. గత 8 సంవత్సరాలలో చాలామంది భూస్వాములు, ప్రముఖులు, సినీ కళాకారులు, పారిశ్రామికవేత్తలు జీఓ పరిధిలో చిన్న రైతుల నుండి వ్యవసాయ భూములను కొనుగోలు చేసి ఫామ్ హౌస్‌లు, గెస్ట్ హౌస్‌లను నిర్మించారు. అయితే ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకోకుండా ఈ నెల 15వ తేదీన సీఎం అసెంబ్లీలో జీఓ 111ను రద్దు చేస్తామని ప్రకటించడం మూర్ఖపు చర్య. ఇది గొప్ప వ్యక్తులకే మేలు చేస్తుంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన సమయంలో జీఓ 111ని రద్దు చేయాలని కేటీఆర్ ముందు షరతు పెట్టారు. దాని ప్రకారమే వారు చేశారు. అధికార టీఆర్‌ఎస్ ప్రజావ్యతిరేక చర్యలను ప్రతిఘటించేందుకు బీజేఎల్‌పీ ఉంది. కానీ అధికార పక్షం నిరంకుశంగా వ్యవహరించి ముందస్తు ప్రణాళికతో బీజేఎల్‌పీ మొత్తాన్ని బయటకు పంపేసి జీఓను రద్ధు చేస్తామని ప్రకటించింది. దీనిని నా లాంటి ఎంతో మంది వ్యతిరేకిస్తున్నారు.