ముంచుకొస్తున్న ముప్పుపై పాఠాలు.. ప్రపంచానికి ఆదర్శంగా ఇండియన్స్

by Manoj |   ( Updated:2022-07-08 06:52:06.0  )
ముంచుకొస్తున్న ముప్పుపై పాఠాలు.. ప్రపంచానికి ఆదర్శంగా ఇండియన్స్
X

దిశ, ఫీచర్స్ : ఈ 21వ శతాబ్దంలో ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య 'వాతావరణ మార్పు'. అతిపెద్ద ముప్పుగా పరిణమించిన ఈ పరిస్థితి ప్రపంచంలోని ప్రతి మూలను ప్రభావితం చేస్తోంది. డబ్లుహెచ్‌వో లెక్కల ప్రకారం.. క్లైమేట్ చేంజ్ వల్ల పోషకాహార లోపం, మలేరియా, అతిసారం, వేడి ఒత్తిడితో 2030 నుంచి 2050 మధ్య ఏడాదికి సుమారు 2.5 లక్షల అదనపు మరణాలు సంభవించవచ్చని తేలింది. ముంచుకొస్తున్న ముప్పు ప్రభావాన్ని అరికట్టేందుకు ఇదే సమయం. కానీ వాతావరణ మార్పులతో పోరాడేందుకు అత్యాధునిక సాంకేతికత కన్నా సహజ వనరులను ఉపయోగించుకోవడమే అత్యంత సరైన మార్గంగా కనిపిస్తోంది. పలు భారతీయ కమ్యూనిటీలు ఈ కళలో యుగయుగాలుగా ప్రావీణ్యం కలిగి ఉన్నారు. వారు ప్రపంచానికి చెబుతున్న పాఠాలు వాతావరణ స్థితిస్థాపకతకు దిక్సూచిగా నిలుస్తుండగా.. అవేంటో చూద్దాం!

* ఒడిశా.. మినీ అడవులు :

ఒడిశా, జగత్‌సింగ్‌పూర్ జిల్లాలోని 20 గ్రామాలు కలిసి సహజ తుఫాన్లకు అడ్డుగా నిలిచేందుకు 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో మినీ అడవులను నాటాయి. విషయానికొస్తే.. 2020లో సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్‌మెంట్.. 2040 నాటికి ఈ జిల్లాలో వరద ప్రమాదాలు 12.55 శాతం నుంచి 27.35 శాతానికి పెరుగుతాయంటూ ఒక పరిశోధనా పత్రాన్ని ప్రచురించింది. దీనికి తోడు జగత్‌సింగ్‌పూర్‌లోని పారాదీప్ పోర్ట్‌ సిటీని 'తీవ్ర కాలుష్య' నగరాల్లో ఒకటిగా సిటీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్ పేర్కొంది. ఈ కారణాలే గ్రామస్తులను మినీ అడవులు సృష్టించేందుకు ప్రేరేపించాయి. అడవి శాఖ నుంచి అడపాదడపా సాయం తప్ప ఇంకెవరూ ఇందులో జోక్యం చేసుకోలేదు.



* వెస్ట్ బెంగాల్‌ - బంజరు పర్వతంపై అడవుల పెంపకం

పశ్చిమ బెంగాల్‌, పురూలియా జిల్లాలోని ఝర్‌భగ్డా గ్రామ నీటి కష్టాలను గ్రామస్తులే పరిష్కరించుకున్నారు. సమీపంలోని బంజరు పర్వతంపై దట్టమైన అడవిని పెంచడం ద్వారా కఠినమైన వేడి తరంగాలను అధిగమించగలిగారు. నిజానికి గ్రామం చుట్టూ 50 కి.మీ మేర విస్తరించిన బంజరు భూమి కారణంగా తీవ్రమైన వాతావరణ పరిస్థితులు తలెత్తాయి. ప్రస్తుతం కొండతో పాటు దాని చుట్టుపక్కల గల 387-ఎకరాల భూమి పచ్చని అడవులతో కప్పబడింది. ఇది అనేక వన్యప్రాణి జాతులకు నిలయంగా ఉంది. ఠాగూర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్(TSRD) అనే ఎన్జీవో సాయంతోనే ఇది సాధ్యమవగా.. ప్రస్తుతం ఇక్కడ చల్లటి గాలి, భూగర్భ జలాలు పుష్కలంగా లభిస్తున్నాయి.



* మహారాష్ట్ర - వరదలు లేని గ్రామాలు:

కాజలి నది నీటి ప్రవాహక సామర్థ్యాన్ని పెంచడం ద్వారా మహారాష్ట్రలోని సఖర్పా, కొంగావ్ గ్రామాలు 70 ఏళ్ల తర్వాత వరద రహితంగా మారాయి. 2021లో చిప్లూన్ నగరంలో కురిసిన వర్షాలకు 200 మందికి పైగా చనిపోయారు. అప్పుడు కాలజి నది మధ్య నుంచి ప్రవహించినప్పటికీ ఈ రెండు గ్రామాలు మినహా ప్రతి ప్రాంతం ప్రభావితమైంది. 2015లో సంభవించిన తీవ్ర వరదల తర్వాత 2019 నుంచి 2021 మధ్య కాలంలో చేపట్టిన పునరుద్ధరణ పనుల ఫలితమే ఇది. గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడిని పరిష్కరించే లక్ష్యంతో పనిచేస్తున్న 'నామ్ ఫౌండేషన్' అనే ఎన్జీవో‌తో పాటు 'నేచురల్ సొల్యూషన్స్' కూడా సాయమందించింది.



* లడఖ్ - ఇరిగేషన్ కోసం మంచు స్థూపాలు:

లడఖ్‌లోని కృత్రిమ మంచు స్థూపాలు వేసవిలో ప్రత్యేకించి ఏప్రిల్, మే నెలల్లో 1,500 మొక్కలకు నీరు పెట్టేందుకు ఒక మిలియన్ లీటర్ల నీటిని అందిస్తాయి. ఇది ఎండాకాలంలో నీటి నిల్వకు ఉపయోగిస్తున్న ఒక సాధారణ నీటిపారుదల వ్యవస్థ. లడఖ్‌ రైతులు స్ప్రింగ్ సీజన్‌లో విజయవంతమైన సాగు కోసం ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. ఇక్కడ సుమారు 3 లక్షల జనాభా ఉండగా.. ఏడాదిన సగటు వర్షపాతం 10 సెంటీమీటర్లే కావడంతో ఈ సాంకేతికత కీలకంగా మారింది. శీతాకాలపు మంచి నీటిని ఇలా భారీ, ఎత్తయిన నిర్మాణాల్లో గడ్డకట్టించి నిల్వ చేసే సాంకేతికతను 2013లో ఇంజనీర్ సోనమ్ వాంగ్‌చుక్ అభివృద్ధి చేశారు.



* మహారాష్ట్ర - వాటర్‌షెడ్ నిర్వహణ:

వాస్తవానికి సెంట్రల్ మహారాష్ట్ర ఒక కరువు పీడిత ప్రాంతం. కానీ హివేర్ బజార్ నివాసితుల వాటర్‌షెడ్ నిర్వహణ టెక్నిక్‌తో ఇప్పుడు దేశంలోని అత్యంత సంపన్న గ్రామాల్లో ఒకటిగా నిలిచింది. అహ్మద్‌నగర్ జిల్లాలోని హివారే బజార్‌తో కరువు పరిస్థితులు, పంట నష్టానికి సంబంధించిన కథలు చాలా కామన్. అయితే 1998లో ఉపాధి హామీ పథకం(ఈజీఎస్‌)లో భాగంగా ప్రారంభించిన నీటి సంరక్షణ పనులు అక్కడి రైతుల జీవితాన్నే మార్చేశాయి. ప్రస్తుతం ఆ గ్రామంలోని 216 కుటుంబాల్లో నాలుగో వంతు మంది లక్షాధికారులైపోయారు. గ్రామ తలసరి ఆదాయం.. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని టాప్ 10 శాతం(2008 నాటికి) కంటే రెండు రెట్లు ఎక్కువ.



* మేఘాలయ - లివింగ్ రూట్ బ్రిడ్జెస్:

దేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే మేఘాలయ తరచూ వరదలు, తుఫాన్ల ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. ఈ సమయంలో నదులు ఉప్పొంగి ప్రత్యేకమైన లివింగ్ రూట్ బ్రిడ్జెస్ మినహా అన్ని వంతెనలను ముంచెత్తుతాయి. ఇందుకు పరిష్కారంగానే ఆ రాష్ట్రంలోని 70 గ్రామాల్లో 100కు పైగా సహజ వంతెనలు ఉన్నాయి. వీటిని ప్రకృతి, మానవ సృజనాత్మకతకు కలయికగా చెప్పొచ్చు. ముందుగా నదికి అడ్డంగా వెదురుతో ఈ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ఏదేని చెట్టు మూలాలు (సాధారణంగా రబ్బరు చెట్టు), ఆ నిర్మాణం బలంగా మారేవరకు అల్లుకుపోతాయి. ప్రపంచ వారసత్వ ప్రదేశ హోదా కోసం ఈ రూట్ బ్రిడ్జిలు UNESCO తాత్కాలిక జాబితాకు సమర్పించబడ్డాయి.



Advertisement

Next Story

Most Viewed