వైట్ & బ్రౌన్ రంగు గుడ్లపై భిన్నాభిప్రాయాలు.. ఏది బెస్ట్?

by Manoj |
వైట్ & బ్రౌన్ రంగు గుడ్లపై భిన్నాభిప్రాయాలు.. ఏది బెస్ట్?
X

దిశ, ఫీచర్స్ : శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలను అందించే గుడ్లు మార్కెట్‌లో వైట్ అండ్ బ్రౌన్ కలర్స్‌లో లభిస్తున్నాయి. ఇక తెలుపు రంగు గుడ్ల కంటే గోధుమ రంగు గుడ్లలోనే విటమిన్స్ ఎక్కువని మెజారిటీ జనాల అభిప్రాయం. అయితే తెల్లటి గుడ్లు శుభ్రంగా, రుచికరంగా ఉంటాయన్న వాదనలూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో గుడ్ల గురించిన అసలు నిజాలు..

వాస్తవానికి గుడ్డు రంగు కోడి జాతిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 'వైట్ లెఘోర్న్' కోళ్లు తెల్లటి పెంకుతో కూడిన గుడ్లను పెడితే.. ప్లైమౌత్ రాక్స్, రోడ్ ఐలాండ్ రెడ్స్ మాత్రం బ్రౌన్-షెల్డ్ గుడ్లను పెడతాయి. అంతేకాదు 'అరౌకానా, అమెరౌకానా, డాంగ్జియాంగ్, లుషి' వంటి కొన్ని కోడి జాతులు నీలం లేదా నీలం-ఆకుపచ్చ గుడ్లను కూడా పెడుతుంటాయి. కాగా కోళ్లు ఉత్పత్తి చేసే వర్ణద్రవ్యం నుంచే గుడ్డు పెంకుకు ఆయా రంగులు వర్తిస్తాయి. బ్రౌన్ ఎగ్‌ షెల్స్‌లోని ప్రధాన వర్ణద్రవ్యాన్ని ప్రోటోపోర్ఫిరిన్ IXగా పిలుస్తారు. ఇది రక్తానికి ఎరుపు రంగును ఇచ్చే సమ్మేళనమైన 'హీమ్' నుంచి తయారు చేయబడింది. ఇక నీలిరంగు గుడ్డు పెంకుల్లో కనిపించే ప్రధాన వర్ణద్రవ్యాన్ని 'బిలివర్డిన్' అని పిలుస్తారు. ఇది కూడా హీమ్ నుంచే పుట్టుకొస్తుంది. ప్రధానంగా పెంకు రంగును నిర్ణయించేది జన్యుశాస్త్రమే అయినా ఇతర అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి. గోధుమ రంగు గుడ్లు పెట్టే కోళ్లు వయసు పెరిగే కొద్ది పెద్దవిగా, లేత రంగులో ఉండే గుడ్లను పెడతాయి. అదేవిధంగా పర్యావరణం, ఆహారం, ఒత్తిడి స్థాయి కూడా కొంతవరకు ఎగ్ షెల్ రంగును ప్రభావితం చేయొచ్చు.

రెండూ మంచివేనా?

గోధుమ, తెలుపు గుడ్లు రెండూ ఆరోగ్యకరమైనవే. అయితే ప్రజల్లో నెలకొన్న సందేహాన్ని తీర్చేందుకు శాస్త్రవేత్తలు పోల్చి చూడగా.. షెల్ రంగు గుడ్డు నాణ్యతను గణనీయంగా ప్రభావితం చేయదని తేలింది. అయితే సూర్యరశ్మిలో సంచరించే కోడి గుడ్లలో విటమిన్ డి లెవెల్స్ 3-4 రెట్లు ఎక్కువగా ఉంటాయి. కోడి తినే ఫీడ్ రకం కూడా ఆయా గుడ్లలోని పోషక పదార్థాలను ప్రభావితం చేస్తుంది. ఇక పరిమాణంలో పెద్దవైన గోధుమ రంగు కోళ్లు తక్కువ గుడ్లు పెట్టడం వల్లే నిర్వహణ ఖర్చులు భర్తీకి అధిక ధరకు విక్రయిస్తారు.

Advertisement

Next Story

Most Viewed