ఈవీల కోసం BPCL రూ. 200 కోట్ల పెట్టుబడి!

by Harish |
ఈవీల కోసం BPCL రూ. 200 కోట్ల పెట్టుబడి!
X

ముంబై: దేశీయ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) ఎలక్ట్రిక్ వాహనాల కోసం కొత్తగా 100 ఫాస్ట్ ఛార్జింగ్ కారిడార్‌లను ఏర్పాటు చేయనున్నట్టు బుధవారం ప్రకటించింది. దీనికోసం కంపెనీ సుమారు రూ. 200 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కారిడార్‌లు అత్యంత రద్దీగా ఉండే 100 నేషనల్ హైవేల్లో 2,000 ఛార్జింగ్ స్టేషన్లను కలిగి ఉంటాయని పేర్కొంది. వీటి ఏర్పాటును 2023, మార్చి నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నామని, అంతేకాకుండా దీర్ఘకాలానికి 2024-25 నాటికి మొత్తం 7,000 ఫాస్ట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను కలిగి ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు బీపీసీఎల్ రిటైల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీఎస్ రవి బుధవారం వివరించారు.

కంపెనీ ఇటీవలే తన మొదటి ఈవీ ఛార్జింగ్ కారిడార్‌ను చెన్నై-తిరుచీ-మధురై రహదారిలో ప్రారంభించింది. రాబోయే రెండు నెలల్లో కొచ్చి-సేలం ప్రాంతంలో రెండో కారిడార్, ముంబై-బెంగళూరు రహదారిలో మూడో కారిడార్ ఉంటుందని రవి చెప్పారు. భవిష్యత్తులో ఈవీ పరిశ్రమ అంచనా వేసిన దాని కంటే వేగంగా వృద్ధి చెందుతుందని, ఈ నేపథ్యంలోనే ఈవీ విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉండేందుకు కంపెనీ ఈవీ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తుందని రవి వివరించారు. అలాగే, పరిశ్రమ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్న కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహకాలను ఆశిస్తున్నట్టు రవి తెలిపారు.



Next Story