పారిశ్రామిక వేత్తల అభివృద్ది మార్గదర్శనానికి వికసిత్​భారత్ : కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

by M.Rajitha |
పారిశ్రామిక వేత్తల అభివృద్ది మార్గదర్శనానికి వికసిత్​భారత్ : కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : భారత్​ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యంతో, పారిశ్రామికవేత్తల అభివృద్ధికి మార్గదర్శనం చేయడానికి వికసిత్ భారత్ ఎంటర్‌ప్రెన్యూర్ ను హైదరాబాద్‌లో ప్రారంభించుకున్నామని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. సోమవారం నగరంలో ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ దేశ యువత పరిశోధనలు చేయాలని, తమ స్వంత వ్యాపారాలను ప్రారంభించాలని ఆకాంక్షిస్తోందని, అలాంటి వారికి సరైన మార్గదర్శనం అవసరమన్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలు, అసెంబ్లీ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో భారీ స్థాయిలో పారిశ్రామికవేత్తలను తయారు చేయడం అవసరమని, వ్యవసాయ రంగంలో సాంకేతికత ద్వారా మార్పులు తీసుకురావాలని సూచించారు. ప్రధాని మోడీ స్టార్టప్‌లను, యువ పారిశ్రామికవేత్తలను బలంగా ప్రోత్సహిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల నుండి రుణాలు, ఇతర అనుమతుల క్లియరెన్స్ ప్రక్రియలను సులభతరం చేసిందని తెలిపారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యువతకు వ్యాపారం ప్రారంభించేందుకు ప్రేరణ కల్పించేందుకు, శిక్షణ ఇవ్వడానికి వికసిత్ భారత్ ఎంటర్‌ప్రెన్యూర్ దోహదమవుతుందని, లక్షలాది ఉద్యోగ అవకాశాలను సృష్టించడమే ఈ సంస్థ లక్ష్యమన్నారు. ఈ సంస్థ కోసం పనిచేసిన అమర్ నాథ్​,వారి టీంకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సంస్థ ద్వారా విద్యార్థులు తమ చదువు పూర్తైన తర్వాత వ్యాపార రంగంలోకి ప్రవేశించి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి గొప్ప అవకాశం లభిస్తుందన్నారు.

Next Story