రాష్ట్రంలో రాజకీయ స్టంట్.. టీఆర్ఎస్‌కు 'తీర్మానాల కౌంటర్'

by Nagaya |   ( Updated:2022-03-24 23:31:00.0  )
రాష్ట్రంలో రాజకీయ స్టంట్.. టీఆర్ఎస్‌కు తీర్మానాల కౌంటర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ ఎత్తులకు పైఎత్తులు వేసేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లపై అధికారపార్టీ కేంద్రంలోని బీజేపీపై పోరు చేపట్టింది. గ్రామం నుంచి జిల్లా పరిషత్ వరకు ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కార్యచరణ రూపొందించింది. అయితే దానికి కౌంటర్ గా తీర్మానాలకు కాంగ్రెస్, బీజేపీలు సన్నద్ధమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలని తీర్మానాలను చేసేందుకు కార్యచరణను రూపొందించాయి. దీంతో తీర్మానాలకు నిర్వహించే సమావేశాలు వాడివేడి అందుకోనున్నాయి.

తెలంగాణలో పండే ధాన్యమంతా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26 నుంచి అన్ని గ్రామపంచాయతీల్లో తీర్మానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా 27న మండల పరిషత్, 28న మార్కెట్ కమిటీలు, పీఏసీఎస్‌లు, 29న డీసీసీబీ, డీసీఎంఎస్, 30న జిల్లా పరిషత్, 31న మున్సిపాలిటీల్లో పంజాబ్ మాదిరిగా రెండుపంటలు నూరుశాతం ధాన్యంను ఎంఎస్పీకి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసి కొరియర్ లేక పోస్టుల ద్వారా ప్రధాని మోడీకి చేరవేయాలని పాలక మండళ్లను ప్రభుత్వం ఆదేశించింది.

అయితే అధికశాతం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే ఉన్నప్పటికీ కాంగ్రెస్, బీజేపీకి చెందిన వారు సైతం ఉన్నారు. దీంతో తీర్మానాల సమయంలో కొంత రభస చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు తీర్మానాల సందర్భంలో అనుసరించే వ్యూహాన్ని రచిస్తున్నాయి. గ్రామ, మండల, జిల్లా, మున్సిపాలిటీల్లో ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలని తీర్మానం చేసేందుకు రెఢీ అవుతున్నాయి.

తీర్మానాలకు కాంగ్రెస్ దూరం

ప్రభుత్వం ఈ నెల 26 నుంచి 31వరకు చేపట్టే తీర్మానాలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. టీఆర్ఎస్ 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తోందని ప్రచారం చేసుకుందని ఇప్పుడు కేంద్రంపై నెపం నెట్టి బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూడటం తగదని కాంగ్రెస్ ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు అభిప్రాయపడుతున్నారు. తీర్మానాలకు తాము దూరంగా ఉంటామని తెలిపారు. ఇన్నాళ్లు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బంది పెట్టడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని... అన్నదాతలను లక్షాధికారులను చేస్తామని చెప్పి నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యమంతా కొనుగోలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. రైతుపక్షమే కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. ఒకవేళ ఎక్కడైనా సభ్యులు పాల్గొన్న తీర్మానంపై సంతకాలు చేసే ప్రసక్తే లేదన్నారు.

రాష్ట్రమే కొనుగోలు చేయాలని బీజేపీ తీర్మానం

ధాన్యంను పూర్తిగా కొనుగోలు చేయాలని బీజేపీ తీర్మానం చేయనుంది. మండల, మున్సిపల్, జడ్పీలలోని బీజేపీ సభ్యులతో సమావేశం నిర్వహించడంతో పాటు పార్టీ తీర్మానం చేసి సమావేశాల్లో పెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. కేంద్రం కేవలం ఎఫ్‌సీఐ ద్వారా బియ్యం మాత్రమే కొనుగోలు చేస్తుందని, ధాన్యం సేకరణ బాధ్యత రాష్ట్రానిదే అని బీజేపీ కౌన్సిలర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రం రా రైస్ తీసుకుంటామని చెబుతున్నప్పటికీ టీఆర్ఎస్ మాత్రం రైతులకు ద్రోహం చేసేలా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ధాన్యం మొత్తం రాష్ట్రమే కొనుగోలు చేయాలని తీర్మానం చేసి సభలో అందజేస్తామన్నారు. తీర్మానాల కాపీలను కేసీఆర్ కు కొరియర్ ద్వారా అందజేస్తామన్నారు.

టీఆర్ఎస్ రాజకీయ స్టంట్!

ధాన్యం కొనుగోలు కేంద్రాలు యాసంగిలో ఏర్పాటు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం కోతల సమయంలోనే స్పష్టం చేసింది. అప్పటికీ కేంద్రం రా రైస్ కొంటామని స్పష్టమైన ప్రకటన చేసింది. అయినప్పటికీ యాసంగిలో నూక పేరుతో బియ్యం తక్కువగా వస్తుందని, బాయిల్డ్ రైస్ తో ఎక్కువ బియ్యం వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటుంది. అయితే కేంద్ర, రాష్ట్రాల మధ్య గత కొంతకాలంగా 'వడ్లపై వార్' కొనసాగుతోంది. మళ్లీ ఏప్రిల్ రెండవారం నుంచి యాసంగి వరికోతలు ప్రారంభమవుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్ల అంశాన్ని లేవనెత్తింది. దీనిపై మరోసారి పోరుకు సన్నద్ధమవుతుండటం ఇదీ టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ రాజకీయ స్టంటేనని, ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత రావొద్దని కేంద్రంపై నెట్టేయాలనే ప్రయత్నం జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గతంలో కూడా కేంద్రమే ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తాను కొనుగోలు చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకుందని, ఇప్పుడు కేంద్రం రా రైస్ మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడంతో ఏం చేయాలో అర్ధంకాక డిఫెన్స్ లో పడిపోయింది. మరోపక్క బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇది దేనికో దారితీస్తోందో తెలియని పరిస్థితి. యాసంగిలో సాగు చేసిన రైతుల్లో మాత్రం ధాన్యం కొనుగోలు చేస్తారా? లేదా? అనే ఆందోళన నెలకొంది.

ఢీ.. అంటే ఢీ..

టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఢీ.. అంటే ఢీ.. అంటున్నారు. గ్యాస్​ధరలు పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై పోరును మొదలెడితే విద్యుత్​ధరల పెంపుపై బీజేపీ శ్రేణులు కేసీఆర్​సర్కార్​పై యుద్ధానికి సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం గృహ వినియోగంపై యూనిట్​కు రూ.50 పైసలు, హెటెన్షన్​వినియోగాలకు రూపాయి చొప్పున పెంచడంపై కాషాయదళం తెలంగాణ సర్కార్​పై విమర్శనాస్త్రాలను సంధిస్తోంది. ఇదిలా ఉండగా ఎల్పీజీ సిలింలడర్​పై రూ.50 పెంచడంతో పాటు పెట్రోల్ పై అదనంగా 90 పైసలు, డీజిల్​పై 87 పైసలు హైక్​చేస్తున్నట్లు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై గులాబీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో వంటావార్పు వంటి కార్యక్రమాలు చేపడుతూ టీఆర్ఎస్​నేతలు నిరసనలు తెలిపారు.

కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడంతో పాటు మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనలు చేపట్టారు. దొరికిందే చాన్స్​అని ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు చేసుకోవడమేకాక ధర్నాలకు దిగుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్​సైతం సామాన్యులకు కరెంట్ చార్జీల మోత విధించడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అన్ని జిల్లాల్లోనూ కేసీఆర్​సర్కార్​తీరును ఎండగట్టాలని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

Advertisement

Next Story

Most Viewed