Balakrishna Yoga: యోగా డేలో ఆలోచింపజేసిన హీరో బాలకృష్ణ స్పీచ్

by Nagaya |   ( Updated:2022-06-21 11:40:24.0  )
Balakrishna Yoga On International Yoga Day At Basavatarakam Hospital
X

దిశ, ఏపీ బ్యూరో : Balakrishna Yoga On International Yoga Day At Basavatarakam Hospital| 15 దేశాలతో మొదలై 175 దేశాలకు ఈ యోగా దినోత్సవం నేడు విస్తరించిందని, దీంతో ప్రపంచమంతా మన రుషులు, యోగా గురువుల గొప్పతనాన్ని అంగీకరించి గౌరవాన్నిచ్చారని నందమూరి బాలకృష్ణ కొనియాడారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, యాడ్ లైఫ్ వారి ఆధ్వర్యంలో 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ చైర్మన్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఓంకారంతో ప్రారంభించబడే ఈ యోగా సాధన, షడ్ చక్రాల దర్శన భాగ్యం కలిగిస్తుందని, పూర్వకాలంలో మన రుషులు ఎంతో సాధన చేసి అందించిన ఈ ప్రక్రియను అందరూ కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.

యోగా ద్వారా ఒక లక్ష్యంపై మనస్సు ఏకాగ్రతతో సాధించడం వీలవుతుందని చెబుతూ.. యోగం అంటే మనల్ని మనం గెలుచుకోవడం అని అర్థం అన్నారు. పతంజలి మహార్షి చెప్పినట్లు చంచలమైన మనస్సును గట్టి పరచుకొని చిత్త ప్రవుత్తులను వశం చేసుకొని విజయపధాన సాగించానికి వీలవుతుందని అన్నారు. మన గురువులు వ్యక్తి మనస్థత్వాన్ని బట్టి పలు రకాల యోగాను నిర్థేశించారని, తద్వారా మనిషిలో నిక్షిప్తమైన శక్తిని వెలికితీయడమే యోగాభ్యాస లక్ష్యమని తెలుసుకోవాలని సూచించారు. అంతేకాకుండా యోగాభ్యాసంతో అంతఃకరణ శుద్ధి జరిగి, శరీర రుగ్మతలను నివారించుకోవచ్చని అన్నారు. యోగాను నిరంతరం అభ్యాసం చేసి దాని మంచి ఫలాలను అందుకోవాలని నందమూరి బాలకృష్ణ సూచించారు.

ఓంకార స్వరంతో ప్రారంభమైన ఈ యోగా కార్యక్రమంలో యాడ్ లైఫ్‌కు చెందిన యోగా గురువు ఉదయకుమార్ అందరిచే పలు యోగాసనాలు అభ్యాసం చేయించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ముందుగా నందమూరి బాలకృష్ణ కార్యక్రమానికి గురువుగా వ్యవహరించిన ఉదయకుమార్‌ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్‌కు చెందిన పలువురు వైద్యులు, వైద్యేతర సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు, విద్యార్థిణులతో పాటూ రోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story