ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఉన్నట్లా.. లేనట్లా.. ?

by Mahesh |
ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఉన్నట్లా.. లేనట్లా.. ?
X

దిశ, ఖమ్మం టౌన్: ఖమ్మం నగరంలో డ్రైనేజ్ సమస్య విపరీతంగా ఉంది. ఇంత వరకు డ్రైనేజ్ నుంచి విడుదలయ్యే నీరు ఎటు వెళ్లాలో ప్లానింగ్ లేదు. ఓ వైపు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఓపెన్ నాలలు ఉంటే శాఖాధికారుల పై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. కానీ అవి ఖమ్మం అధికారులకు వర్తించడం లేదు. కొన్ని ప్రాంతాలకు మాత్రమే అభివృద్ధి పరిమితం అయ్యింది. మిగతా చోట్ల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. పైపై మెరుగులు తప్ప అంతర్గత అభివృద్ధి కానరావడం లేదు.

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇంటికి కూతవేటు దూరంలో మాణిక్య నగర్ అనే ప్రాంతం ఉంది ఇప్పుడు 20, 21 డివిజన్ ల లోకి ఆ ప్రాంతం విభజింపబడింది. గతంలో సిపిఐ తరపున కౌన్సిలర్ కూడా పరిపాలించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రాంతం కనీస అభివృద్ధికి నోచుకోలేదు. సర్వే నెంబర్ 49 లో 1.34 ఎకరాల భూమి సీలింగ్ కింద ప్రభుత్వం తీసుకుంది. పాత కాలం కాగితాలను సృష్టించిన ఓ వ్యక్తి అక్కడ భూముల పై కన్నేసి పాల్వంచ లో వుంటూ చక్రం తిప్పుతున్నాడు. అక్కడి ప్రజలు మురికి కాలువ నీళ్లు ఇండ్లలోకి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుంటే మరో వైపు కాల్వను పొడుస్తున్నాడు.

అతనికి రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ పూర్తిగా సహకరిస్తున్నట్లు సమాచారం. రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేద కూలీలు పని చేసుకోవడానికి వెళ్లినట్లైతే ఓపెన్ కాలువలో పిల్లలు ప్రమాదవశాత్తు పడిపోతే పరిస్థితి ఏంటని కూలి పనులకు వెళ్లడం మానేసి పిల్లలను చూసుకుంటూ తల్లులు ఇండ్లకే పరిమితం అయ్యారు. రాత్రి వేళల్లో ఆ మురికి కాలువలో నుండి విపరీతమైన దోమలు వచ్చి వారంలో రెండు రోజులు అనారోగ్యం పాలవుతున్నారు. ఓ వైపు నుంచి కాల్వను పూడ్చుకుంటు వస్తున్న కానీ స్థానిక కార్పొరేటర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రాణాలు పోతే వచ్చి నష్ట పరిహారం చెల్లిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు.

నష్ట నివారణ చర్యలు చేపట్టడానికి అధికారులు కానీ అధికార పార్టీ కాని ముందడుగు వేయడం లేదు. మాణిక్య నగర్ లో మురుగు నీరు ప్రస్తుతం ఎటువంటి కాలువ నిర్మాణం చేపట్టకపోవడం తో ప్రజలు నివాసం ఉంటున్న ఇండ్లలోకి వెళ్లి కొత్త కొత్త జబ్బులకు ఆహ్వానం పలుకుతోంది. రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రజల కోసం పని చేస్తున్నారో.. లేక జీతాల కోసం పని చేస్తున్నారో అర్థం కావడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఎన్నో యేళ్ళ సమస్యను ప్రజలు తరుచు అనేక రకాల ఫిర్యాదుల ద్వారా నిరసన ద్వారా తెలియజేసిన కానీ ప్రభుత్వాధికారులు ప్రభుత్వానికి ఓ నివేదిక పంపి సమస్యను పరిష్కరించ కపోవడం వెనుక రియల్ మాఫియా ఇచ్చే లంచాలు వున్నాయనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

కాలువ నిర్మాణం చేపడితే అక్కడ వివాదాల్లో ఉన్న భూములు, కాల్వను కబ్జా చేసిన నాయకులు బయటకు వస్తారనే సమాచారంతో ఈ కాలువ నిర్మాణ పనులు చేపట్టడం లేదనే ఆరోపణలున్నాయి. మాయదారి రోగాలకు కారణమవుతున్న కాలువ నిర్మాణాన్ని చేపట్టిన అధికార యంత్రాంగం పై మానవ హక్కుల కమిషన్, హైకోర్టు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పాల్వంచ లో హోటల్ నడుపుంటు ఖమ్మం వచ్చి ఇక్కడి భూములను కబ్జా చేస్తూ మురుగు కాల్వను పూడ్చి ప్లాట్లను అమ్ముకుంటూ సాయంకాలం అవగానే జల్సాలు చేయడానికి ఓ గ్యాంగ్ ను మెయింటెన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎండాకాలంలోనే కాలువ నిర్మాణం చేపడితే ఖర్చు కూడా తక్కువ పనిలో నాణ్యత పెరిగే అవకాశం ఉంది.

రానుంది వానకాలం ఇప్పటికే చిన్న గా మారిన కాలువలో మురుగు నీటి ఉధృతి పెరిగి ప్రజలు కనీసం బయటకు వచ్చే అవకాశం కూడా ఉండదు. ఇప్పటికే పాల్వంచ నుంచి వచ్చిన వ్యక్తి కాల్వను పూడ్చి చిన్నగా చేసాడు. కాబట్టి అతని పై శాఖ పరమైన చర్యలు తీసుకొని బైండోవర్ కేసులు నమోదు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. పేద ప్రజల ఓట్లతో గెలిచిన స్థానిక కార్పోరేటర్లు ప్రజా సమస్యలను విస్మరించవద్దని ప్రజలు కోరుతున్నారు. రెండు రోజుల క్రితం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిధుల ద్వారా ఇక్కడ కాలువ నిర్మాణం చేపట్టి సామాన్య ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం కాపాడాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed