కెలికితే పెయింటింగ్ అయ్యింది.. లండ‌న్‌లో 7ఏళ్ల బాలుడు సోలో షో! (వీడియో)

by Sumithra |   ( Updated:2023-05-01 06:16:20.0  )
కెలికితే పెయింటింగ్ అయ్యింది.. లండ‌న్‌లో 7ఏళ్ల బాలుడు సోలో షో! (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః 'క‌ళ క‌ళ‌ కోస‌మా? స‌మాజం కోస‌మా..?' అనే వాద‌న ఎప్ప‌టి నుంచో ఉంది. అయితే, క‌ళ క‌ళ కోస‌మేన‌న్న‌ది ఎక్కువ మంది క‌ళాకారుల వాద‌న‌. చివ‌రికి, జ‌నాన్ని ఆక‌ర్షించే దేనికైనా క‌ళగా గుర్తింపు ఉంటుంది. అలా, పూణేలో అద్వైత్ కోలార్కర్ అనే 7 ఏళ్ల బాలుడు చైల్డ్ ప్రాడిజీగా మారాడు. ఇప్పుడు కాదు 4 ఏళ్ల వ‌య‌సు నుంచే చిత్ర‌లేఖ‌నంలో మెరిసాడు ఈ బుడ్డొడు. ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయంగా తన మొదటి సోలో ఎగ్జిబిషన్‌ను లండన్‌లోని ప్రసిద్ధ గాగ్లియార్డి గ్యాలరీలో నిర్వ‌హించ‌బోతున్నాడు. ఇప్పటికే, కోలార్కర్ భారతదేశంలోనే కాకుండా అనేక ఇతర దేశాలలో కూడా తన స‌త్తాను చూపించాడు. 2020లోనే త‌న ప్ర‌తిభ‌కు 'గ్లోబల్ చైల్డ్ ప్రాడిజీ అవార్డు'ను పొందాడు. ఇక‌, లండన్ షో తర్వాత న్యూయార్క్, లాస్ వేగాస్, ఇండియాల్లో అద్వైత్ కోలార్కర్ క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌లు ప్లాన్ చేశారు.

అద్వైత్ కోలార్కర్‌కు ఎనిమిది నెలల వయస్సులోనే కళపై ప్రేమ మొదల‌వ‌డం విశేషం. మొద‌ట‌ ఫుడ్ కలర్స్‌తో ఆడుకునేవాడు. వాటితో పెయింటింగ్ చేయడం ప్రారంభించాడు. తల్లిదండ్రులు అతని ప్రతిభను గుర్తించి, రంగులతో తనను తాను వ్యక్తీకరించడానికి కాన్వాస్‌ను ఇచ్చారు. "మా ఇంటి గోడలు అద్వైత్ సృజనాత్మక నైపుణ్యానికి గుర్తులు" అని అద్వైత్‌ తల్లి శృతి కోలార్కర్ అంటారు. ఆమె విజువల్ డిజైనర్, ఆమె భర్త, అద్వైత్ తండ్రి అమిత్ కోలార్కర్ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. పెయింటింగ్ బ్రష్‌లు, గరిటెల నుండి చేతులు, చేతి వేళ్ల వరకు అద్వైత్ తన కాన్వాస్‌పై పెయింటింగ్ చేయడానికి ర‌క‌ర‌కాల మార్గాల‌ను వినియోగిస్తాడు. అద్వైత్‌లో పెయింటింగ్‌కి సంబంధించిన ప్ర‌త్యేక‌మైన నైపుణ్య‌మే అత‌న్ని అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందనేది నిజం. అద్వైత్‌ మాట్లాడటం నేర్చుకున్నప్పుడు, త‌న నోటి నుండి రంగుల పేర్లే ఎక్కువ వ‌చ్చేయ‌ని త‌ల్లిదండ్రులు మురుసుకుంటూ ఉంటారు. అలాగే, అద్వైత్‌ నేపుల్స్ ఎల్లోని కాడ్మియం ఎల్లో నుండి అలాగే, బర్న్ సియెన్నా నుండి రా సియెన్నావేరు చేయగలడని, అంత‌టి నిశిత దృష్టి ఉండ‌బ‌ట్టే అత‌డు చిన్న‌వ‌య‌సులోనే మంచి క‌ళాకారుడిగా మారాడ‌ని అంటారు.

Advertisement

Next Story