బీజేపీకి BIG షాక్.. బీఆర్ఎస్‌లోకి వివేక్ వెంకటస్వామి!

by GSrikanth |   ( Updated:2023-09-25 09:21:40.0  )
బీజేపీకి BIG షాక్.. బీఆర్ఎస్‌లోకి వివేక్ వెంకటస్వామి!
X

దిశ, తెలంగాణ బ్యూరో: పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ గత కొంతకాలంగా బీజేపీలో అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ యాక్టీవ్‌గా పాల్గొనడంలేదు. ఆ పార్టీలోనూ ఈ అంశంపై చర్చ జరుగుతున్నది. పార్టీ మార్పుపై గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అలాంటి ఉద్దేశం లేదంటూ స్వయంగా వివేక్ సైతం వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. అయినా ఊహాగానాలు మాత్రం ఆగడంలేదు. తాజాగా ఆయన బీజేపీని వీడి బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను బీఆర్ఎస్ వర్గాలు సైతం ధృవీకరించాయి. ప్రగతి భవన్‌లో ఇప్పటికే ఒక దఫా చర్చలు పూర్తయ్యాయని, అన్నీ అనుకూలిస్తే ఈ రోజు సాయంత్రమే లాంఛనంగా కేసీఆర్‌ సమక్షంలో చేరే అవకాశాలున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. పెద్దపల్లి నుంచి ఎంపీ టికెట్ ఆఫర్ ఇప్పటికే లభించినందున ఇక లాంఛనంగా పార్టీలో చేరడమే తరువాయి అనేది బీఆర్ఎస్ నేతల వాదన.

బీజేపీని వీడితే కాంగ్రెస్‌లో చేరతారా.. లేక బీఆర్ఎస్‌లో చేరతారా అనే చర్చలు చాలా కాలంగా ఉన్నాయి. ఆయనకు సన్నిహితంగా ఉండేవారితో పాటు కుటుంబ సభ్యుల్లోనూ ఏ పార్టీలో చేరితే రాజకీయ భవిష్యత్తు మెరుగ్గా ఉంటుందనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొద్దిమంది కాంగ్రెస్ బెస్ట్ అని చెప్తుండగా మరికొద్దిమంది బీఆర్ఎస్‌లోకి వెళ్ళడమే బెటర్ అని సూచించారు. దీంతో ఏ పార్టీలోకి వెళ్ళాలనేదానిపై కొన్ని రోజులుగా లోతుగా చర్చించిన తర్వాత గులాబీ గూటికి చేరడమే ఉత్తమమనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో చేరడానికి మొగ్గు చూపినప్పటికీ ఆశించిన స్థాయిలో అటు నుంచి ఆదరణ రాకపోవడం, టికెట్‌పై హామీ లభించకపోవడంతో బీఆర్ఎస్ చెంతకు చేరాలనే కంక్లూజన్‌కు వచ్చినట్లు తెలిసింది.

కాంగ్రెస్ నుంచి పలువురిని బీఆర్ఎస్‌లో చేర్చుకోవడంపై ప్రత్యేకంగా ఆపరేషన్ కోసం ప్లాన్ జరుగుతున్నది. ఈ సమయంలో కాంగ్రెస్ జోష్‌ను తగ్గించడంపైనా కూడా ఫోకస్ పెట్టింది. బీజేపీలో అసంతృప్తితో ఉన్నందున కాంగ్రెస్‌కు వెళ్ళకుండా ఉండేలా బీఆర్ఎస్‌ ఒకింత అడ్వాన్స్ అయ్యి ఈ డెవలప్‌మెంట్ దిశగా అడుగులు వేసింది. ఒకటి రెండు రోజుల్లో వివేక్ చేరికపై మరింత స్పష్టత రానున్నది. కానీ బీఆర్ఎస్ శ్రేణులకు మాత్రం వివేక్ చేరికపై ముందుగానే సమాచారం లీక్ కావడంతో ఫేస్‌బుక్ వేదికగా ఆయనకు వెల్‌కమ్ చెప్పడం మొదలైంది.

Advertisement

Next Story

Most Viewed