పోటీ చేసే స్థానంపై వీహెచ్ క్లారిటీ! ఖమ్మం సభపై కీలక వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-07-01 12:09:50.0  )
పోటీ చేసే స్థానంపై వీహెచ్ క్లారిటీ! ఖమ్మం సభపై కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం అవకాశం ఇస్తే తప్పక గెలిచి చూపిస్తానన్నారు. గత ఎన్నికల్లోనే తాను ఖమ్మం నుండి పోటీ చేయాలని అనుకున్నానని దీనికోసం అధిష్టానానికి అప్లికేషన్ కూడా పెట్టుకున్నానని చెప్పారు. అయితే వివిధ కారణాల వల్ల తనకు టికెట్ రాలేదన్నారు.

శనివారం ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడిన ఆయన 1976 లో సంజయ్ గాంధీ ఉన్ననాటి నుండి ఖమ్మం జిల్లాతో తనకు అనుబంధం ఉందని అందువల్ల వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నుండి పోటీ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు, అభిమానులు కూడా తనను ఖమ్మంలో పోటీ చేయాలని కోరుతున్నారని, మల్లికార్జున ఖర్గేనే ఏఐసీసీ అధ్యక్షుడు అయ్యారని తనకు వయసు అడ్డంకి కాదన్నారు. సాయి చంద్, సాయన్నలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించకపోడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెవరికో ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు చేస్తూ దళితులను మాత్రం అవమానపరుస్తోందని ధ్వజమెత్తారు.

రాహుల్ గాంధీ సభను సక్సెస్ కాకుండా చేసేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తున్నదని, రేపు ఏం జరుగుతుందో చూస్కుందాం అని సవాల్ చేశారు. కేసీఆర్ తెలంగాణలో రైతుల చేతులకు సంకెళ్లు వేస్తూ మహారాష్ట్రకు వెళ్లి అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అంటున్నారని, ఇక్కడి ప్రజల కష్టార్జితాన్ని పొరుగు రాష్ట్రాల్లో పంచుతోందని ధ్వజమెత్తారు. రేపటి సభలో లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. సీఎం కేసీఆర్ ధరణి విషయంలో చాలా అబద్దాలు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. ధరణి ఎంతో మోసపూరితమైనదో నిరూపించేందుకు తాను సిద్ధమే అన్నారు. భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర కాంగ్రెస్ పార్టీకి చాలా బెనిఫిట్ అవుతుందని ఈ పాదయాత్రలో ఆయన అనేక మందిని కలుసుకుని ప్రజా సమస్యలు తెలుసుకున్నారని చెప్పారు.

Advertisement

Next Story