దేశంలో ఖరీదైన ఎన్నికలుగా తెలంగాణ ట్రెండ్ సెట్.. ఎన్ని వేల కోట్లో తెలుసా?

by GSrikanth |   ( Updated:2023-11-14 08:00:50.0  )
దేశంలో ఖరీదైన ఎన్నికలుగా తెలంగాణ ట్రెండ్ సెట్.. ఎన్ని వేల కోట్లో తెలుసా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు చేస్తు్న్న మొత్తం ఖర్చు సుమారు రూ.10 వేల కోట్ల వరకు చేరే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సభలు, సమావేశాలు, ర్యాలీలు, కార్యకర్తల అవసరాలకు పెట్టే ఖర్చు ఒక ఎత్తు, పోల్ మేనే‌జ్‌మెంట్ కోసం చేసే ఖర్చు మరో ఎత్తు. అయితే, ఈ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్శించేందుకు ఓ ప్రధాన పార్టీ భారీ ఎత్తున ఖర్చు చేసేందుకు ప్లాన్ చేసినట్లుగా టాక్ వినిపిస్తుంది. ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత ఒక్కో ఓటరకు అక్కడున్న పోటీని దృష్టిలో పెట్టుకుని మందు, మటన్, చికెన్‌తో పాటు నగదును పంపిణీ చేసేందుకు పక్కాగా ప్లానింగ్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

ఈసీకి దొరక్కుండా జాగ్రత్తలు

ఎన్నికల్లో ధన ప్రవాహం భారీ స్థాయిలో ఉంటుందని వార్తలు ఊపందుకుకోవడంతో మరో వైపు కేంద్ర ఎన్నికల సంఘం అలర్టైంది. నగదును నియంత్రించేందుకు బ్యాంకులతో సంప్రదింపులు జరిపింది. నిత్యం వ్యక్తిగత అకౌంట్లపై నిఘా వేసి, ఎక్కువ మొత్తంలో నగదు విత్ డ్రా చేస్తే వెంటనే, సంబంధిత వ్యక్తులను పిలిచి విచారిస్తున్నారు. అయితే, ఈసీ నిఘా పెట్టినా.. ఓటర్లకు పంచే నగదు ఎప్పుడో గ్రామాలకు చేరిందనే వార్తలు వస్తున్నాయి. ఎన్నికల షెడ్యూలుకు ముందే ఓ ప్రధాన పార్టీ తనకు నమ్మకస్తులైన కార్యకర్తల ఇళ్లకు డబ్బును చేరవేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ నగదును ఎప్పుడు ఎవరికి ఇవ్వాలి? ఏ లీడర్ కు అప్పగించాలి, ఎలా ఓటర్లకు పంచాలనే అంశాలపై పక్కగా ప్లాన్ చేశారని టాక్. ప్రధాన పార్టీ అభ్యర్థులు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నట్టు చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నది. 112 సెగ్మంట్లలో ఏకంగా రూ.5 వేల కోట్ల నగదును అభ్యర్థుల చేతికే అప్పగించేందుకు ప్లాన్ చేసినట్టు చర్చ జరుగుతోంది. సగటును ఒక్కో సెగ్మంటపై రూ. 50 కోట్లు ఖర్చు చేసేందుకు పథకం వేసినట్లు సమాచారం. ఒకవేళ ప్రత్యర్థి పార్టీ నుంచి గట్టి పోటీ ఉంటే అదనంగా మరో రూ.20 కోట్లను ఖర్చు చేయాలని ఆలోచనలో ప్రధాన పార్టీ అభ్యర్థులు ఉన్నారని టాక్

ఒక్కో మీటింగ్‌కు రూ.3.5 కోట్ల ఖర్చు

ఓ ప్రధాన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున పబ్లిక్ మీటింగ్స్ నిర్వహిస్తోంది. ఇందుకోసం ఒక్కో మీటింగ్ కు సగటును రూ. 3.5 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం ఉంది. సభకు జనాలను తరలించేందుకు వెహికల్స్, సభకు వచ్చిన ప్రజలకు ఒక్కొక్కరికి సగటున రూ.500 వరకు ఇస్తున్నారు. ఇప్పటివరకు సదరు పార్టీ సుమారు 50 పబ్లిక్ మీటింగ్స్ నిర్వహించింది. ఇందుకోసం దాదాపు రూ.150 కోట్ల వరకు పార్టీ ఫండ్ ఖర్చు చేశారని చర్చ జరుగుతోంది. అదేవిధంగా ప్రధాన కార్యకర్తలకు సగటున రూ.2 లక్షలు పంపిణీ చేసి దసరా పండుగ నుంచే ఓటర్లకు మందు, మటన్, చికెన్ పంపిణీ చేసే బాధ్యతలు అప్పగించారని ప్రచారం జరుగుతోంది. పోల్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా సాధారణ పోటీ ఉన్న నియోజకవర్గాల్లో కనిష్టంగా రూ.వెయ్యి, పోటీ తీవ్రంగా ఉన్నచోట రూ.2 వేలు నుంచి రూ.4 వేల వరకు పంపిణీ చేయాలని అంచనా వేస్తున్నట్టున్నారని సమాచారం. రెండేళ్ల క్రితం హుజూరాబాద్, మునుగోడు బై ఎలక్షన్‌లో ఒక్కో ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు పంపిణీ చేసినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. దీంతో ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలు పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేస్తాయనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. మరోవైపు ఓటర్లు సైతం ఏ పార్టీ ఎంత డబ్బు ఇస్తుందోనని ఆశగా ఎదురుచూస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed